Share News

Ujjwala Yojana: ఉజ్వల పథకం ద్వారా 10 కోట్ల మందికి లబ్ధి

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:13 AM

దేశంలో 10 కోట్ల మందికిపైగా పేద వర్గాల మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Ujjwala Yojana: ఉజ్వల పథకం ద్వారా 10 కోట్ల మందికి లబ్ధి

  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

బోయిన్‌పల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : దేశంలో 10 కోట్ల మందికిపైగా పేద వర్గాల మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వెనుకబడిన పేద వర్గాల మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ర్టిబ్యూటర్ల శిఖరాగ్ర సమావేశం ఆదివారం సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి డైమండ్‌ పాయింట్‌లో గల గాయత్రి గార్డెన్‌లో జరిగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


అనంతరం పలువురు ఎల్‌పీజీ డిస్ర్టిబ్యూటర్లను సత్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రతి కుటుంబంతో ఎల్‌పీజీ భాగస్వామ్యం అయిందని పేర్కొన్నారు. ఎల్‌పీజీ అంటే ‘లైఫ్‌లైన్‌ ఫర్‌ ప్రాస్పరిటీ అండ్‌ గ్రోత్‌’ అని అన్నారు. మారుమూల ప్రాంతాలకూ ఎల్‌పీజీని అందించడంలో డిస్ర్టిబ్యూటర్లు కీలకపాత్ర వహిస్తున్నారన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎల్‌పీజీ డిస్ర్టిబ్యూటర్లు, పలువురు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 05:13 AM