Miyapur: మహా ‘మత్తు’ పార్టీ..
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:19 AM
పెద్ద శబ్దంతో మ్యూజిక్.. దాని ధాటికి సాధారణ వ్యక్తులకైతే చెవులు చిల్లులు పడిపోతాయ్..! కానీ, ఆ పార్టీలో పాల్గొన్నవారికి మాత్రం ఏమీ కాదు..! అందరూ ఓ విభ్రమలో ఉంటారు. అసలు వారు ఈ ప్రపంచంలోనే ఉన్నట్లుగా కనిపించరు..! దీనంతటికీ కారణం..
హైదరాబాద్ ఖాజాగూడ కేవ్ పబ్‌లో ‘సైకెడెలిక్ డ్రగ్స్’ పార్టీ
ముందుగా డ్రగ్స్ తీసుకోవడమే దీని హాజరుకు అర్హత
పాల్గొన్న 55 మంది.. 24 మందికి పాజిటివ్; కేసు నమోదు
పట్టుబడినవారిలో ఐటీ సంస్థల ఉద్యోగులు, విద్యార్థులు
పబ్‌ను సీజ్ చేసిన పోలీసులు.. నిర్వాహకులు పరార్
మియాపూర్, జూలై 7(ఆంధ్రజ్యోతి): పెద్ద శబ్దంతో మ్యూజిక్.. దాని ధాటికి సాధారణ వ్యక్తులకైతే చెవులు చిల్లులు పడిపోతాయ్..! కానీ, ఆ పార్టీలో పాల్గొన్నవారికి మాత్రం ఏమీ కాదు..! అందరూ ఓ విభ్రమలో ఉంటారు. అసలు వారు ఈ ప్రపంచంలోనే ఉన్నట్లుగా కనిపించరు..! దీనంతటికీ కారణం.. అప్పటికే ఒళ్లంతా ఆవహించేసిన డ్రగ్స్! ఆ పార్టీ పేరు సైకడలిక్ పార్టీ..! దీనికి హాజరవడానికి అర్హత.. ‘ముందుగానే మాదకద్రవ్యాలు తీసుకోవడం’. హైదరాబాద్ ఖాజాగూడలోని కేవ్ బార్ అండ్ లాంజ్‌లో శనివారం రాత్రి సైకెడెలిక్ పార్టీ జరుగుతుండగా.. టీజీ న్యాబ్ అధికారులు, సైబరాబాద్ ఎస్‌వోటీ, రాయదుర్గం పోలీసులు దాడి చేశా రు. 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని మాదాపూర్ డీసీ పీ డాక్టర్ వినీత్ ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు.
ఇందులో టీసీఎస్, అమెజాన్‌తో పాటు ప్రముఖ కంపెనీల ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. డిస్క్ జాకీ (డీజే)లు సందీ్‌పశర్మ, సాయి గౌరంగ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో గుర్తించామన్నారు. యజమానులు రాజేష్, అభినవ్, సాయికృష్ణ, సన్నీలు పార్టీ నిర్వహణ వెనుక ఉన్నట్లు గుర్తించామని, వీరంతా పరారయ్యారని తెలిపారు. యజమానులు, పాజిటివ్ వచ్చినవారితో పాటు పబ్ మేనేజర్ అబ్దుల్లా ఆయూబ్, ఈవెంట్ మేనేజర్ ఆర్.శేఖర్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు డీసీ పీ చెప్పారు. డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించినందుకు గాను పబ్‌ను మూసివేసినట్లు తెలిపారు. మేనేజర్‌ను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరు డ్రగ్స్ సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బందికి డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలపై ఐటీ సంస్థలు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
కేవ్‌లో గతంలోనూ.. బెంగళూరు నుంచి డీజేలు
కేవ్ పబ్‌లో గతంలోనూ సైకెడెలిక్ పార్టీలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని, యజమానులను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని డీసీపీ చెప్పారు. కాగా, సైకెడెలిక్ పార్టీకి బెంగళూరు నుంచి డీజేలను పిలిపించారని, పాల్గొనేవారికి నిర్వాహకులు ఇన్‌స్టాగ్రాం ద్వారా ఆహ్వానం పంపారని వివరించారు. వారికి ప్రత్యేకమైన కోడ్ ఉంటుందని ఆయన చెప్పారు.