Share News

Kaleshwaram Project: బిల్లుల కోసం అప్పులా..?

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:30 AM

‘‘కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ను.. కేవలం రుణాలు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే ఏర్పాటు చేశారా? కార్పొరేషన్‌కు ఆస్తులున్నాయా? ఆదాయం ఏమైనా ఉందా?

Kaleshwaram Project: బిల్లుల కోసం అప్పులా..?

  • కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆదాయం ఎలా?

  • నిర్వహణకు నిధులెక్కడి నుంచి వస్తాయి?

  • రుణాలు తీసుకోవాలని ఆదేశించిందెవరు?

  • తిరిగి రుణాల చెల్లింపు ఎలా చేస్తారు?

  • కాళేశ్వరం కార్పొరేషన్‌ అధికారులపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ను.. కేవలం రుణాలు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే ఏర్పాటు చేశారా? కార్పొరేషన్‌కు ఆస్తులున్నాయా? ఆదాయం ఏమైనా ఉందా? దీని నిర్వహణకు నిధులెక్కడివి? కాగ్‌ నివేదిక ఆమోదయోగ్యమైనదేనా?’’ అంటూ జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌.. కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌తో ముడిపడిన అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆర్థిక అంశాలపై ముగ్గురు అధికారులను కమిషన్‌ విచారించింది. కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకోవాలని ఆదేశించిందెవరు? అని కాళేశ్వరం కార్పొరేషన్‌ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (సీఏవో)గా పనిచేసిన కొమర్రాజు వెంకట అప్పారావును కమిషన్‌ ప్రశ్నించగా.. తాను విధుల్లో చేరిన సమయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్‌కుమార్‌ ఆదేశాలతో కార్పొరేషన్‌ రుణాలు తీసుకుందని చెప్పారు. ప్రభుత్వం పూచీకత్తు ఇస్తే.. కాళేశ్వరం కార్పొరేషన్‌ పాలకమండలి సమావేశంలో చర్చించి, ఎండీ అనుమతితో రుణాలు తీసుకున్నామని వివరించారు. రుణాల సమీకరణలో తన పాత్రేమీ లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తయిన పనులను కార్పొరేషన్‌ ఆస్తులుగా పరిగణిస్తామని, కార్పొరేషన్‌కు స్వతహాగా ఎలాంటి ఆదాయం లేదని పేర్కొన్నారు. 2023 నుంచి రామగుండం ఫర్టిలైజర్‌, ఎన్‌టీపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన నిధులు వస్తున్నాయని తెలిపారు.


  • మెజర్‌మెంట్‌ చూశాకే బిల్లులు చెల్లిస్తారా?

బిల్లుల చెల్లింపులకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ఏమైనా పాటిస్తారా? మెజర్‌మెంట్‌లు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్‌ ఆరా తీయగా.. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బిల్లును సిద్ధం చేసి, పే అండ్‌ అకౌంట్స్‌(పీఏవో)కు పంపిస్తే.. ఆ బిల్లులను పీఏవో పరిశీలించి, ఐఎ్‌ఫఎంఎస్‌ ద్వారా కాళేశ్వరం కార్పొరేషన్‌కు పంపిస్తారని కాళేశ్వరం సీఏవో చెప్పారు. మెజర్‌మెంట్‌ను పీఏవో పరిశీలిస్తుందని, ఆ తర్వాత చెల్లింపులు జరుగుతాయని అన్నారు. కాగ్‌ అభ్యంతరాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. కార్పొరేషన్‌ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది? అని కమిషన్‌ ప్రశ్నించగా.. బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రుణాలు మంజూరైన వెనువెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయకుండా ఆ నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో జమచేస్తామని చెప్పారు. ఆ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో కార్పొరేషన్‌ నడుస్తుందని తెలిపారు. కాంట్రాక్టర్లు సమర్పించిన ఈఎండీ/ఏఎండీ నిధులపై వచ్చే వడ్డీని కూడా నిర్వహణకు వాడుకుంటున్నామని చెప్పారు. కార్పొరేషన్‌లో కొందరు డిప్యుటేషన్‌పై, మరికొందరు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారని వివరించారు.


  • ఎవరినో రక్షించే ప్రయత్నం చేయొద్దు..

విచారణలో వాస్తవాలు మాత్రమే చెప్పాలని, ఎవరినో రక్షించే ప్రయత్నాలు చేయొద్దని పీసీ ఘోష్‌ కమిషన్‌.. అధికారులకు సూచించింది. ‘మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి’ అని చెప్పింది. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ(జనరల్‌) కార్యాలయంలోని చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (సీఏవో) పద్మావతిని విచారిస్తూ.. బడ్జెట్‌ రూపకల్పనలో మీ పాత్ర ఏంటి? అని ప్రశ్నించింది. ఇందుకు ఆమె సమాధానమిస్తూ.. ఏటా జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఆర్థిక శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు కోరితే, సంబంధిత చీఫ్‌ ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికే కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పడింద తెలిపారు. రుణాల చెల్లింపు కోసం నిధులను ఏటా బడ్జెట్‌ లో కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.


రుణాలకు సంబంఽధించిన సమావేశంలో గత ప్రభుత్వ సీఎంవో అధికారులు పాల్గొన్నారా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. జవాబు దాటవేశారు. కాళేశ్వరం రుణాల చెల్లింపులకు బడ్జెట్‌లో ఆర్థిక శాఖ ఒక పద్దును సృష్టించి నిధులు విడుదల చేసిందని వివరించారు. ఈ ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారమెంత? దీనికి మీ సమర్థన ఉందా? అన్న ప్రశ్నలకు, ‘‘నాకు తెలియదు.. ఆ నిర్ణయాలతో నాకు సంబంధం లేదు’’ అని పద్మావతి బదులిచ్చారు. ఆర్థిక క్రమశిక్షణ/వివేకం లేకుండా కాళేశ్వరంపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా... ‘ఇది చాలా విస్తారమైన అంశం.. ఆ విషయంలో నేనేమీ చెప్పలేను’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక మీ బాధ్యతలు, విధులేంటని వర్క్స్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌ ఫణిభూషణ్‌ శర్మను కమిషన్‌ ప్రశ్నించగా... పనులకు సంబంధించిన బిల్లులు వస్తే... వాటిని పరిశీలించడం, చెల్లింపులకు సిఫారసు చేయడం వరకేనని ఆయన బదులిచ్చారు. కాగ్‌ నివేదికలో ఒకటి రెండు అంశాలే వాస్తవికంగా లేనట్లు గుర్తించానని చెప్పారు.


  • ఈఎన్‌సీ ఆదేశాలు.. ఎస్‌ఈ ఉత్తర్వులు

  • మేడిగడ్డ నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీ తిరిగి ఇచ్చేయాలంటూ రెండుసార్లు మెమో

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి.. నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీ విడుదల నిర్ణయం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) స్థాయి అధికారిది కాదని.. రామగుండం ఈఎన్‌సీ ఆదేశాల మేరకు సంబంధిత ఎస్‌ఈ రెండుసార్లు ఉత్తర్వులు ఇచ్చారని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణలో వెల్లడైంది. గ్యారంటీ విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ 2020 డిసెంబరు 29న మెమో (నం.896215) జారీ చేసింది. కానీ, రామగుండం సర్కిల్‌-1 ఎస్‌ఈ అంతకన్నా ముందే.. అంటే, 2020 నవంబరు 27నేదీనిపై ఒక మెమో ఇవ్వడం గమనార్హం. కానీ, దానికి ఆధారంగా ఎటువంటి ఉత్తర్వులూ లేవన్న కారణంతో మహాదేవపూర్‌ ఈఈ-1 మౌనంగా ఉండిపోయారు.


దీంతో ఎస్‌ఈ 2021 జనవరి 1న మరో మెమో జారీచేశారు. ‘‘మరొకసారి కోరుతున్నా.. నిర్మాణ ఒప్పందంలోని క్లాజ్‌-45 ప్రకారం బ్యాంకు గ్యారంటీని విడుదల చేసి, రిపోర్టు చేయాలి’’ అని ఆయన అందులో పేర్కొన్నారు. దీంతో బ్యాంకు గ్యారంటీలు విడుదలకు ఈఈ తిరుపతిరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లుతో పాటు అప్పటి రామగుండం ఎస్‌ఈ-1లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లు, నిర్మాణం అన్ని వ్యవహారాల్లో వీరిద్దరి పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉండగా.. ప్రభుత్వం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లును ఉద్వాసన పలికి, అప్పటి ఎస్‌ఈని కీలక బాధ్యతల్లో కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Sep 26 , 2024 | 04:30 AM