Navy Radar Station: నౌకా దళానికి రామబాణం..
ABN , Publish Date - Oct 16 , 2024 | 03:23 AM
దేశ రక్షణ దళాలకు అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చడం ఎంత కీలకమో.. అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంతే కీలకమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.
దేశ రక్షణలో మరో ముందడుగు వీఎల్‌ఎఫ్ స్టేషన్
రియల్ టైం కమ్యూనికేషన్‌లో అత్యంత కీలకం
నౌకల మధ్య మెరుగైన సమన్వయానికి దోహదం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం
పర్యావరణానికి హాని కలిగించకుండా స్టేషన్
స్థానికులకు ఉద్యోగాలు.. పరిసరాల్లో ఆర్థికాభివృద్ధి
అవసరమైతే స్థానికులకు పునరావాస ఏర్పాట్లు
సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాలను పక్కనబెట్టి..
దేశ హితం ముఖ్యమని చాటారు: రాజ్‌నాథ్‌సింగ్
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ దళాలకు అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చడం ఎంత కీలకమో.. అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంతే కీలకమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. యుద్ధ సమయంలో గెలుపోటములను రియల్ టైం కమ్యూనికేషన్ నిర్ణయిస్తుందని, ప్రస్తుతం ప్రపంచ యుద్ధ పరిణామాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ దిశగా తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న వీఎల్‌ఎఫ్ నేవీ రేడార్ కేంద్రం దేశ రక్షణలో అత్యంత కీలకంగా మారనుందన్నారు. ముఖ్యంగా నౌకాదళాలకు ఈ స్టేషన్ రామబాణం కానుందన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా దామగుండంలో కేంద్ర నౌకాదళం ఏర్పాటుచేయనున్న ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్’కు రాజ్‌నాథ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేడార్ స్టేషన్ నిర్మాణ ప్రణాళిక కాగితాల నుంచి కా ర్యాచరణకు చేరుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో సహకరించారంటూ అభినందించారు. ‘‘దేశ ప్రయోజనాలకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యం కలిగిన వీఎల్‌ఎఫ్ స్టేషన్‌కు మాజీ రాష్ట్రపతి, ప్రముఖ మిసైల్ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జయంతి రోజు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించడం రాజకీయం కాదని తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం అద్భుతమైన విషయం. రాజకీయమంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాదు.. దేశాన్ని ఏర్పాటు చేయడమన్న ఉద్దేశంతో ఆయన ఈ ప్రాజెక్టుకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇందుకు రేవంత్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు’’ అని రాజ్‌నాథ్ అన్నారు.
నౌకాదళాలకు అత్యంత కీలకం..
‘‘నౌకాదళాలకు రియల్ టైం కమ్యూనికేషన్‌లో ఈ స్టేషన్ అత్యంత కీలకం కానుంది. సముద్రంలో ఉండే భారతీయ నౌకాదళం నౌకల మధ్య మరింత మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థ దీంతో సమకూరనుంది. దేశ రక్షణకు సంబంధించి ఇది ఎంతో కీలకం కానుంది. మనిషి, యంత్రం మద్యలో సమన్వయం ప్రస్తుత తరంలో ఎంతో కీలకంగా కానుందని రక్షణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థ రక్షణ రంగంలో ఎంతో కీలకం. ఉన్నతస్థాయి ఆదేశాలను క్షేత్రస్థాయిలో పంపించడం, సత్వర నిర్ణయాలు అమలు చేయడం, క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ సేకరణలో ఈ కేంద్రం ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉండనుంది. గత వైఫల్యాలతో పాఠాలు నేర్చుకుని సురక్షిత భవిష్యత్తు కోసం దీనిని అభివృద్ధి చేస్తున్నాం.
మన నౌకాదళం వద్ద పెద్దఎత్తున నౌకలున్నాయి. ఇండో పసిఫిక్ సముద్రం, బంగాళాఖాతంలో మన నౌకాదళం నౌకలు విస్తరించి ఉన్నాయి. దశాబ్దాలుగా ఫ్రాన్స్, ఆంగ్లేయులు సముద్రంపై ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్నారు. నేడు మనం ఆ రంగంలో ఆధిపత్యం చలాయించాలంటే ఇలాంటి లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ ఎంతో కీలకం. ఇది పూర్తి గా అత్యాధునిక టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు అవసరాలకూ ఇది ఎంతో కీలకం కానుంది. వచ్చే ఎన్నో దశాబ్దాల వరకు మన నౌకాదళానికి ఈ కేంద్రం సురక్షితమైన కమ్యూనికేషన్ల వ్యవస్థను అందిస్తుంది. భారతీయ నౌకాదళాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి స్టేషన్ల నిర్మాణంతో మన దళాలను అత్యాధునిక, ఆత్మ నిర్భర్‌గా చేస్తున్నాం’’ అని రాజ్‌నాథ్ వివరించారు.
పర్యావరణ సమస్యలుండవు..
‘‘పర్యావరణ సమస్యలంటూ ఈ కేంద్రం గురించి స్థానికుల్లో అనేక అపోహలు వ్యాప్తి చేశారు. మీ అందరికీ నేను మాటిస్తున్నా.. పర్యావరణ సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎలాంటి పర్యావరణ సమస్యలు రాకుండా నిర్మాణం ఉంటుందని ఇప్పటికే నేవీ చీఫ్ అడ్మిరల్ పేర్కొన్నారు. నేను కూడా స్పష్టం చేస్తున్నా.. పర్యావరణానికి విఘాతం కలగకుండా స్టేషన్ నిర్మాణం ఉంటుంది. ఈ కేంద్రం నిర్మాణంలో అవసరమైతే స్థానికుల పునరావాసం గురించి కూడా ఏర్పాట్లు చేస్తాం. తమిళనాడు తిరునల్వేలిలోని ఐఎన్‌ఎస్ కట్టబొమ్మన్ వీఎల్‌ఎస్ ట్రాన్స్‌మిషన్ కేంద్రం గత 35 ఏళ్లుగా నౌకాదళాలకు సేవలందిస్తోంది. అక్కడ స్థానికంగా ఎలాంటి పర్యావరణ సమస్యలు రాలేదు. ఎవరైనా వెళ్లి చూడవచ్చు.
ఈ కేంద్రం నిర్మాణంలో, పూర్తయ్యాక స్థానికులకు ఉద్యోగ అవకాశాలూ ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇది కేవలం ఉపాధి అవకాశాల కోసమే కాదు.. పరిసర ప్రాంతాల అభివృద్ధికీ గ్రోత్ పోల్‌గా మారనుంది. శాంతికి సంబంధించిన అతిపెద్ద గ్యారంటీ మన నౌకాదళం. బంగాళాఖాతం, భారత సముద్ర జలాల్లో శాంతిని కొనసాగించడం మన ప్రాధాన్యం కావాలి. భారత్ చేస్తున్న ఈ ప్రయత్నంలో స్నేహపూర్వక దేశాలన్నీ కలిసి నడుస్తున్నాయి. మన పొరుగు దేశాలతోనూ స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నాం. దేశ రక్షణ విషయం వస్తే కులమతాలకు అతీతంగా అందరూ ఏకమవుతారని ఇక్కడి స్థానికులు చాటిచెప్పారు. ఇతర రాజకీయ పక్షాలు కూడా దేశ సురక్ష విషయంలో అంతా ఏకమై వచ్చారు’’ అని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు.
రాజ్‌నాథ్‌కు ఘనస్వాగతం
బేగంపేట: దామగుండం ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాత్‌సింగ్‌కు మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 11.35 గంటలకు బేగంపేటకు చేరుకున్న రాజ్‌నాథ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్వాగతం పలికారు. శంకుస్థాపన పూర్తయిన అనంతరం 4.18 గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకొని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.