Share News

Hyderabad : గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు?

ABN , Publish Date - Jul 03 , 2024 | 04:45 AM

రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్‌ అధికారులను బదిలీ చేయవచ్చని తెలిసింది.

Hyderabad : గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు?

  • లేదంటే బెన్‌హర్‌ మహేశ్‌దత్‌కు అవకాశం త్వరలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు!

  • త్వరలో రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ బదిలీలు!

  • భట్టి విక్రమార్క పేషీలో నలుగురు ఐఏఎస్‌లు

  • అధికారుల కొరతతో మిగతా శాఖలపై ప్రభావం

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్‌ అధికారులను బదిలీ చేయవచ్చని తెలిసింది. ఇటీవలే ప్రభుత్వం రెండు దఫాలుగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. తొలుత 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం... వారం రోజుల వ్యవధిలోనే మరో 40 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లు, ఒక ఐఎఫ్‌ఎస్‌ అధికారి, మరో నాన్‌-కేడర్‌ అధికారిని బదిలీ చేసింది.

తాజాగా, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మరికొంత మంది ఐఏఎస్‌లను బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గవర్నర్‌కు ముఖ్యకార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావును బదిలీ చేసి ఈ పదవిలో నియమిస్తారని, లేదా 1995 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బెన్‌హర్‌ మహేశ్‌దత్‌ ఎక్కాకు అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది.


విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గవర్నర్‌ ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, ఇటీవల చేపట్టిన 40 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రస్తుతం ఆర్థిక శాఖలో ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఒక ముఖ్య కార్యదర్శితో పాటు 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ కె.హరిత సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. వీరు కాకుండా... డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క వద్ద 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ కృష్ణ భాస్కర్‌ ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇలా ఒక్క ఆర్థిక శాఖలోని సచివాలయ బ్రాంచిలోనే నలుగురు ఐఏఎస్‌లు ఉండడంతో ఇతర శాఖలకు అధికారులు లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది.

Updated Date - Jul 03 , 2024 | 07:06 AM