NHAI: పది రోజుల్లో పరిహారం లెక్కలు
ABN , Publish Date - Aug 22 , 2024 | 04:42 AM
రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) కోసం సేకరిస్తున్న భూముల పరిహారం మరో పది రోజుల్లో ఖరారు కానుంది. ఈ భూములకు సంబంధించిన విలువలను గతంలోనే ప్రాథమికంగా నిర్ణయించారు.
2013 చట్టం ప్రకారమే ఆర్‌ఆర్‌ఆర్ పరిహారం
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర మార్గం నిర్మాణానికి అడుగులు
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) కోసం సేకరిస్తున్న భూముల పరిహారం మరో పది రోజుల్లో ఖరారు కానుంది. ఈ భూములకు సంబంధించిన విలువలను గతంలోనే ప్రాథమికంగా నిర్ణయించారు. రహదారి కోసం భూములను కోల్పోతున్న వారికి పరిహారం గరిష్ఠంగా అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌హెచ్‌ఏఐ 2013 భూపరిహార చట్టం కింద పరిహారం అందించాలని నిర్ణయించింది.
ఇందుకు సంబంధించిన అంచనాలను తయారు చేస్తున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని నెలాఖరులోగా ఖరారు చేయమని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రాంత రైతులు భూముల అప్పగింత, పరిహారంపై కోర్టులో పిటిషన్లు వేశారు. వారితో చర్చలు జరిపి ఒప్పించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. ఆగస్టు 31న 3డీ నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం నిర్దేశించింది.
రహదారి నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములు ఎవరివి, ఎంతెంత? అనే వివరాలు 3డీ నోటిఫికేషన్‌లో ఉంటాయి. 2013భూ పరిహార చట్టం ప్రకారం సవరించిన భూ పరిహార వివరాల ముసాయిదాను సెప్టెంబరు15లోగా ఎన్‌హెచ్‌ఏఐకి పంపాలని గడువు పెట్టారు. అనంతరం పరిహారం చెల్లింపుల ప్రక్రియ మొదలవుతుంది. పరిహారం విషయంలో రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారితో చర్చించి పరిహారాన్ని ఖరారు చేస్తారు. ఆ వివరాలతో కూడిన 3జీ జాబితాను ప్రకటిస్తారు.
పెరగనున్న పరిహారం
రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు సార్లు భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో సవరణలు చేయడంతో ఆ మేరకు పరిహారం కూడా పెంచింది. ఇప్పుడు 2013 భూపరిహార చట్టం కూడా తోడు కావడంతో గరిష్ఠ పరిహారం అందుతుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్, గెజిట్‌లను సిద్ధం చేస్తున్నారు. 3డీ నోటిఫికేషన్‌కు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 93.10 హెక్టార్లు, మెదక్ జిల్లా పరిధిలో 189.13 హెక్డార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 39.79 హెక్టార్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 126.08 హెక్టార్లు పెండింగ్‌లో పడ్డాయి.
3జీ జాబితాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా పరిధిలో 93.10 హెక్టార్లు, మెదక్‌లో 189.13హెక్టార్లు, సిద్దిపేటలో 39.79 హెక్డార్లు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 315.80 హెక్టార్ల మేర పెండింగ్‌లో ఉంది. ఈ పెండింగ్‌ను పరిష్కరిస్తేనే భూసేకరణ వ్యవహారం పూర్తవుతుంది. ఈలోపు కేంద్రం నుంచి అటవీ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నారు. కాగా, ర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తన ‘విజన్-2047’ పథకంలో చేర్చింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐకు సమాచారం అందింది.