Share News

Ponguleti Srinivas Reddy: ‘ధరణి’ పేర ఓ పెద్దమనిషి దగా చేశారు!

ABN , Publish Date - Aug 03 , 2024 | 03:52 AM

గత ప్రభుత్వంలో ‘ధరణి’ పేర ఓ పెద్ద మనిషి ప్రజలను దగా చేశారని, ఆ పోర్టల్‌ రైతుల పాలిట శాపంగా, భూతంగా మారిందని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు.

Ponguleti Srinivas Reddy: ‘ధరణి’ పేర ఓ పెద్దమనిషి దగా చేశారు!

  • అదో మాయదారి పోర్టల్‌.. ఇద్దరు రూపొందించారు

  • రైతుల పాలిట అదో శాపం.. ఆత్మహత్యలూ జరిగాయి

  • ఇళ్లలో చిచ్చుపెట్టిన దొరలు.. గడీలు నింపుకొన్నారు

  • ‘ధరణి’ స్థానంలో రైతు నేస్తంగా ఉండేలా వ్యవస్థ

  • ఇది దేశంలోనే ఓ గొప్ప రెవెన్యూ చట్టం: పొంగులేటి అసెంబ్లీలో చర్చ

  • ‘ధరణి’ స్థానంలో రైతు నేస్తంగా ఉండేలా వ్యవస్థ: పొంగులేటి

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో ‘ధరణి’ పేర ఓ పెద్ద మనిషి ప్రజలను దగా చేశారని, ఆ పోర్టల్‌ రైతుల పాలిట శాపంగా, భూతంగా మారిందని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు. ఇద్దరు వ్యక్తులు గదిలో కూర్చుని విప్లవాత్మక మార్పు అంటూ మోసపూరితంగా ధరణి పోర్టల్‌ తెచ్చారని, అప్పట్లో ఆ పోర్టల్‌ దృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు భూమికి సంబంధించి రైతుకు ఏ కష్టం వచ్చినా రెవెన్యూ కార్యాలయాల్లో ప రిష్కారం దొరికేదని.. ధరణి వచ్చాక రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని.. కొందరు ఆత్మహత్యలూ చేసుకున్నారని, ధరణి ఓ మాయదారి పోర్టల్‌ అని అన్నారు. ధరణి పేరుతో మాయమైన భూములన్నింటినీ బయటకు తీస్తామని, పేదవారి దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నింటినీ తిరిగి మళ్లీ పేదవారికి అందిస్తామని చెప్పారు.


సమస్యల కారణంగా రైతులు కన్నీరు పెట్టుకోవడంతోనే మీరు అక్కడ కూర్చోవాల్సి వచ్చింది అని బీఆర్‌ఎస్‌ సభ్యులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో ‘భూ హక్కు లు - భూసంస్కరణలు’ అనే అంశంపై శుక్రవారం శాసనసభలో లఘు చర్చను చేపట్టగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ‘‘రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు, ఈ దేశానికి అదేదో ఆదర్శమైనట్లు అప్పటి ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాల్లో సమస్య లేని గ్రామం అంటూ లేదు. ప్రతి గ్రామంలోనూ భూ సమస్యలు పుట్టుకొచ్చాయి. ప్రజల మధ్య, కుటుంబాల్లో ధరణి రూపంలో చిచ్చుపెట్టిన దొర లు.. రూ.వేల కోట్లు దోచుకుని, తమ గడీలను ధన రాశులతో నింపుకొన్నారు. ఫలితంగా వారికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉసురు తగిలింది. ఇప్పుడా ఆ దొర.. తన గడీలోనే బందీ అయ్యారు. ప్రజలకు తన మొహాన్ని చూపలేక దాక్కున్నారు’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


ఆ పెద్దమనిషి చేసిన పాప ఫలితమే రైతులకీ దుస్థితి అని పేర్కొన్నారు. ధరణి వల్ల ఏర్పడిన భూసమస్య పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు తేవాలేగానీ.. కుట్ర పూరితంగా, మోసపూరితంగా ఉండకూడదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో సుమారు 18 లక్షల ఎకరాలను చిన్న చిన్న కారణాలతో రికార్డులకు ఎక్కించకుండా పక్కన పెట్టారని తెలిపారు. ధరణి వల్ల దాదాపు 30 లక్షల మంది రైతులు ఽబాధితులుగా మారారన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.


అందుకే సమస్యలను పరిష్కరించి, రైతుల కళ్లలో ఆనందాన్ని చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఈ విషయమై విస్తృత కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ధరణి స్థానంలో కొత్త వ్యవస్థను తేబోతున్నామని, అది పూర్తిగా రైతు నేస్తంగా ఉండబోతున్నదని తెలిపారు. పూర్తిగా రైతు విశ్వాసాన్ని చూరగొనే క్రమంలో అందరి సలహాలనూ వింటామని, బీఆర్‌ఎస్‌ పార్టీ మంచి సలహాలిచ్చినా స్వీకరిస్తామని అన్నారు. గడీలు దాటని దొరవారు చెప్పినా వింటామని కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున.. దేశంలోనే ఒక గొప్ప, ఆదర్శవంతమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు. విస్తృత ప్రజాభిప్రాయం, అసెంబ్లీలో చర్చ తర్వాత ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు.


  • పైలెట్‌ ప్రాజెక్టుగా యాచారం.. సాగర్‌లోని ఓ మండలంలో

ధరణిలో లోపాలను పరిష్కరించేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌ను రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలోని 10గ్రామాలు, నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని ఒక మండలంలో అమలు చేయనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. అక్కడి లోపాలన్నింటినీ సర్వే చేసి, అనంతరం పరిష్కరిస్తామని, 10-15రోజుల్లో ఈ రెండు మండలాల రిపోర్టులు వస్తాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చిన ధరఖాస్తుల్లో ఏమైనా తిరస్కరించాల్సి వస్తే అందుకు గల కారణాలను దరఖాస్తుదారునికి వివరిస్తున్నామని స్పష్టంచేశారు. కాగా ఆనాడు రావణాసురుడు పది తలలతో అవతారం ఎత్తితే గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మూడు తలలతో మొదలయి, ముప్పై మూడు తలలుగా అవతారం ఎత్తిందని ఆయన విమర్శించారు.

Updated Date - Aug 03 , 2024 | 03:52 AM