Share News

Field Survey: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో క్షేత్రస్థాయి పరిశీలన!

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:15 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం నిర్మాణ ప్రారంభానికి ఒక్కొక్కటిగా అడుగులు ముందుకు పడుతున్నాయి.

Field Survey: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో క్షేత్రస్థాయి పరిశీలన!

  • 189.2 కిలోమీటర్లు.. రెండ్రోజులు.. 20 బృందాలు

  • మార్గమంతా జియో ట్యాగింగ్‌ చేసేందుకు కసరత్తు

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం నిర్మాణ ప్రారంభానికి ఒక్కొక్కటిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. రహదారి అలైన్‌మెంట్‌పై ఇప్పటికే దృష్టి సారించిన ప్రభుత్వం.. తాజాగా దక్షిణ భాగం మార్గం మొత్తాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. దక్షిణ భాగం నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌ దగ్గర ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డి వద్ద ప్రారంభమయ్యే ఉత్తర భాగానికి అనుసంధానమవుతుంది.


అయితే, ప్రాథమికంగా నిర్ధారించిన దక్షిణ భాగం మార్గం మొత్తాన్ని జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. ఆ మార్గంలో విద్యుత్‌లైన్లు, గుర్తించిన, గుర్తించబడని చెరువులు, కుంటలు, అటవీ భూములు, చెట్లు, గుట్టలు.. ఇలా అన్ని వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, అటవీ, ఆర్‌అండ్‌బీ శాఖలకు చెందిన అధికారులతో 20 బృందాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. 189.2 కిలోమీటర్ల మేర వివరాల సేకరణకు 10కిలోమీటర్లకు ఒక బృందాన్ని నియమించనుంది. వివరాల సేకరణను రెండు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు అఽధికారిక వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల తర్వాత వివరాల సేకరణ ప్రారంభించనున్నట్లు తెలిసింది.

Updated Date - Sep 01 , 2024 | 04:15 AM