Share News

LRS Applications: ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ పరిశీలనకు జిల్లాకో బృందం!

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:07 AM

లే-అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) పెండింగ్‌ దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనుంది. దరఖాస్తుల పరిష్కారానికి జిల్లాకో బృందాన్ని ప్రత్యేకంగా నియమించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 బృందాలు ఎల్‌ఆర్‌ఎస్‌ పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించనున్నాయి.

LRS Applications: ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ పరిశీలనకు జిల్లాకో బృందం!

  • మొత్తం 33 బృందాల ఏర్పాటు

  • కొత్త దరఖాస్తులకు చాన్స్‌?

  • దరఖాస్తుల పరిశీలనకు 33 బృందాలు

  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

  • 25.29 లక్షల దరఖాస్తుల పెండింగ్‌

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): లే-అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) పెండింగ్‌ దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనుంది. దరఖాస్తుల పరిష్కారానికి జిల్లాకో బృందాన్ని ప్రత్యేకంగా నియమించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 బృందాలు ఎల్‌ఆర్‌ఎస్‌ పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించనున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఇప్పటికే లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వాటి పరిష్కారంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెవెన్యూశాఖ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.


శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటితో కలిసి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లే-అవుట్‌ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని భట్టి సూచించారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ కింద 25.29 లక్షల దరఖాస్తులు ఉన్నాయి.


వీటి క్రమబద్ధీకరణతో భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అపరిష్కృత దరఖాస్తుల్లో గ్రామ పంచాయతీల పరిధిలో 10,83,394, మునిసిపాలిటీల్లో 10,60,013, నగర పాలక సంస్థల పరిధిలో 4,16,155 దరఖాస్తులు ఉన్నాయి. స్థలానికి రూ.1,000, లే అవుట్లకు రూ.10,000 చొప్పున ప్రభుత్వం రుసుము వసూలు చేసింది. దీంతో దరఖాస్తు ఫీజు కిందే రూ.257.47 కోట్ల ఆదాయం వచ్చింది. వాటిని పరిష్కరిస్తే ఖజనాకు మరింత ఆదాయం సమకూరుతుందని రేవంత్‌ సర్కారు భావిస్తోంది.

Updated Date - Jul 27 , 2024 | 03:07 AM