Share News

MLC By Polls: 18,565 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:19 AM

శాసనమండలి నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌)కు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి.

MLC By Polls: 18,565 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వీడని ఉత్కంఠ

  • మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ దక్కని కోటా ఓటు

  • ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం

నల్లగొండ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శాసనమండలి నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌)కు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి 1,04,248 ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి 43,313 మొదటి ప్రాధాన్య ఓట్లతో మూడో స్థానంలో ఉండగా, నల్లగొండకు చెందిన స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌ 29,697 మొదటి ప్రాధాన్య ఓట్లు సాధించి నాలుగో స్థానంలోకి వచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా.. గతానికి భిన్నంగా ఈ సారి అత్యధికంగా 25,824 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.


చెల్లిన ఓట్లు 3,10,189 ఉండగా.. 1,55,095 ఓట్లను కోటా ఓటుగా రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన ప్రకటించారు. అయితే, గెలిచేందుకు అవసరమైన కోటా ఓటు మొదటి ప్రాధాన్యం పరిధిలో ఎవరికీ రాకపోవడంతో గురువారం రాత్రి 9.30 నుంచి ఎలిమినేషన్‌ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రక్రియంతా పూర్తయి ఫలితం వెలువడే సరికి శుక్రవారం రాత్రి అయ్యే అవకాశం ఉంది. ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్ధి తీన్మార్‌ మల్లన్న కోటా ఓటు సాధించాలంటే ద్వితీయ ప్రాధాన్యంలో ఆయనకు 32,282 ఓట్లు, రాకేశ్‌రెడ్డి గెలవాలంటే 50,847ఓట్లు రావాల్సి ఉంటుంది.


బ్యాలెట్లపై సంతకాలు.. నినాదాలు!

బ్యాలెట్‌ పేపర్లపై జై కేసీఆర్‌, జై మల్లన్న, జై రాకేశ్‌ అని నినాదాలు రాయడం, అంకెలకు బదులు ఎక్స్‌ గుర్తు పెట్టడం, కొట్టివేయడం వంటి కారణాల వల్లే చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని పార్టీల ఏజెంట్లు చెబుతున్నారు. కొన్నింటిపై లవ్‌యూ అని రాతలు రాశారని, కొందరు ఫోన్‌ నంబర్లు వేస్తే, కొన్ని బ్యాలెట్లపై సంతకాలు చేశారని పేర్కొంటున్నారు. కొందరైతే ఏకంగా ఫోన్‌ పే నంబర్లు రాసి డబ్బులు పంపించాలని కోరినట్లు వెల్లడించారు. చెల్లని ఓ కారణంగానే చివరకు ద్వితీయ ప్రాధాన్య ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది.


మూడో రౌండ్‌ రీకౌంటింగ్‌ చేపట్టాలి: రాకేశ్‌రెడ్డి

‘‘ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయి. మా సందేహాలను రిటర్నింగ్‌ అధికారి పరిశీలించడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు’’ అని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. మూడో రౌండ్‌ రీ కౌంటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఎన్నికల అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. తనపై ఆరోపణలు చేసే వారు వాటిని నిరూపించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరిచందన సూచించారు. పారదర్శకంగా కౌంటింగ్‌ సాగుతోందని తెలిపారు.


చెల్లని ఓట్లతోపాటు అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్లే కౌంటింగ్‌ ఆలస్యమైందని వివరించారు. కాగా, లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ సీఈవో వికా్‌సరాజ్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. మూడో రౌండ్‌లో రాకేశ్‌రెడ్డికి 533, నాలుగో రౌండ్‌లో 170 ఓట్ల మెజారిటీ వస్తే.. కాంగ్రెస్‌ అభ్యర్థికి వచ్చినట్టుగా చూపించారని ఆరోపించారు. కాగా, కౌంటింగ్‌ సందర్భంగా బుధవారం రాత్రి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిపై తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఏఆర్‌వో కె.వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 07 , 2024 | 05:31 AM