సింగపూర్ ప్లాన్ సిద్ధం!
ABN , Publish Date - Nov 13 , 2024 | 03:11 AM
బాపు ఘాట్‌ను అంతర్జాతీయ పర్యాటక, విజ్ఞాన, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సింగపూర్ కన్సార్టియం మెయిన్ హార్ట్ తాజాగా ప్రభుత్వానికి అందజేసింది.
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బాపు ఘాట్
212 ఎకరాల్లో అభివృద్ధి.. సర్కారుకు కన్సార్షియం ప్లాన్
ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు!
మల్లన్న సాగర్ నుంచి స్వచ్ఛమైన జలాల తరలింపు
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): బాపు ఘాట్‌ను అంతర్జాతీయ పర్యాటక, విజ్ఞాన, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సింగపూర్ కన్సార్టియం మెయిన్ హార్ట్ తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా సుమారు 55 కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతాన్ని పర్యాటక, ఉపాధి కల్పన అవకాశాల కేంద్రంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలుత మూసీ ఒడ్డునున్న బాపుఘాట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టునునమూనాగా చూపి.. మూసీ పొడవునా ఉన్న ప్రజల విశ్వాసాన్ని పొందేలా నిర్మాణ ప్రతిపాదనలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘మెయిన్ హార్ట్’ ఈ ప్రణాళికలను సిద్ధం చేసి, ప్రభుత్వ పెద్దలకు చూపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమారు 212 ఎకరాల మేర ఈ అభివృద్ధి ప్రణాళికను సింగపూర్ కన్సార్షియం రూపొందించింది. సుమారు 115 ఎకరాల ప్రభుత్వ భూమి, 30 ఎకరాల పైన ప్రైవేటు భూమి, 50 ఎకరాలకు పైగా రక్షణ శాఖ భూమిని ఈ ప్రాజెక్టు పనుల కోసం ప్రతిపాదించారు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా.. బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రబోధించే కేంద్రాన్ని నిర్మిస్తారు.
బెంగళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయం తరహాలో ఇక్కడ ఒక ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. అదే సమయంలో స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలకు చెందిన ఒక ఆఫ్ క్యాంపస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లండన్ ఐ తరహాలో ఒక భారీ జెయింట్‌వీల్ ఏర్పాటుచేస్తారు. వీటికి తోడు ఇంకా అనేక హంగులు, ఆకట్టుకునే నిర్మాణాలతో ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా దీన్ని తయారుచే యాలని సంకల్పించారు. అలాగే.. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల గోదావరి జలాలను తరలించి.. అందులో 5 టీఎంసీల జలాలను మూసీ నదిలో ఉంచేలా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈమేరకు.. మల్లన్న సాగర్ నుంచి పైప్‌లైన్ పనుల టెండర్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. మూసీ ప్రక్షాళనతో పాటు గోదావరి జలాలను కూడా తీసుకు రావడం వల్ల బాపూ ఘాట్ వద్ద ఒక స్వచ్ఛమైన దృశ్యాన్ని ఆవిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఉదారంగా పరిహారం
బాపు ఘాట్ అభివృద్ధి పనులకు అవసరమైన భూమిలో సగానికి పైగా ప్రభుత్వం వద్దే ఉంది. సేకరించాల్సిన ప్రైవేటు భూమి 30 ఎకరాలదాకా ఉంటుందని అంచనా ఈ ప్రైవేటు భూమిలో రెండు అపార్ట్‌మెంట్ వెంచర్లు ఉన్నాయని గుర్తించారు. ఆ భూమి సేకరణ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని.. వారి నుంచి తీసుకునే భూమికన్నా ఎక్కువ భూమిని వారికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు సమాచారం. కొత్తగా భూ కేటాయింపు చేసిన చోట తిరిగి గేటెడ్ కమ్యునిటీ నిర్మాణం కోసం అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. మౌలిక సదుపాయాలను కల్పించనుంది. ఈమేరకు అపార్ట్‌మెంట్ల సంఘాలతో మాట్లాడి, ఒక ప్రత్యేక ఖాతా తెరిచి దానిలో నిర్మాణానికి అవసరమైన నిధులను జమ చేసే ఉద్దేశంతో ఉంది.