Share News

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా..

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:38 AM

దసరా పండుగకు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంస్థ లాభాల్లో 33 శాతం బోనస్‌ కింద ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా..

  • లాభాల్లో 33% బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.. నిరుటి కంటే 1% ఎక్కువ

  • సగటున ఒక్కొక్కరికి 1.90 లక్షలు.. తొలిసారి కాంట్రాక్ట్‌ కార్మికులకు 5వేలు

హైదరాబాద్‌, గోదావరిఖని, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగకు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంస్థ లాభాల్లో 33 శాతం బోనస్‌ కింద ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,412 కోట్లను లాభంగా యాజమాన్యం ప్రకటించింది. ఇందులోంచి రూ.796 కోట్లు కార్మికులకు పంపిణీ చేయనున్నారు. సగటున ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు దక్కనున్నాయి. దసరాలోపే ఈ మొత్తం కార్మికులకు అందేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో 25 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకూ రూ.5వేల చొప్పున బోనస్‌ ఇవ్వనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశ అనంతరం మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సింగరేణి లాభాల వాటాను ప్రకటించారు.


తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచారని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో వారి పాత్ర మరువలేనిదని కొనియాడారు. అనంతరం సింగరేణి లాభాలు, సంస్థ విస్తరణ, బోన్‌సకు సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరులకు వివరించారు. 2023-24లో 70 మిలియన్ల బొగ్గు ఉత్పత్తితో సింగరేణి రూ.4,701 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని.. సంస్థ విస్తరణ, పెట్టుబడులకు రూ.2,289 కోట్లు కేటాయించగా మిగిలిన రూ.2,412 కోట్లలో మూడో వంతు (రూ.796 కోట్ల)ను కార్మికులకు బోన్‌సగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సంస్థలో 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.


  • విస్తరణకు ప్రాధాన్యం

సింగరేణి లాభాలను భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని భట్టి చెప్పారు. అదనంగా 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల స్థాపనతో పాటు రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌ నిర్మాణం, జైపూర్‌లోని థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో మరో కేంద్రం, రామగుండంలో టీఎస్‌ జెన్‌కో-సింగరేణి సంయుక్త భాగస్వామ్యంలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌ 2,400 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వీకే ఓపెన్‌ కాస్ట్‌, గోలేటీ, నైనీ ఓసీలను ప్రారంభిస్తామని, సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం గురుకుల పాఠశాలలు, సమీకృత పాఠశాలలు, ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణతో పాటు హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్సత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని భట్టి వెల్లడించారు.


  • నిరుటి కంటే 1 శాతం ఎక్కువ..

సింగరేణి కార్మికులకు 2022-23లో లాభాల బోనస్‌ కింద 32 శాతం (రూ.711 కోట్లు) ఇవ్వగా ఈసారి ఒక శాతం పెంచారు. నిరుడు ఒక్కో కార్మికుడికి బోన్‌సగా రూ.1.70 లక్షలు అందగా, ఇప్పుడు రూ.20 వేలు అదనంగా దక్కనున్నాయి. సంస్థలోని 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు బోనస్‌ ప్రకటన మరో బోనస్‌.

Updated Date - Sep 21 , 2024 | 03:38 AM