Share News

Sridhar Babu: టెక్‌ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ!

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:54 AM

ఆవిష్కరణలతో పాటు వర్ధమాన సాంకేతికతల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు.

Sridhar Babu: టెక్‌ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ!

  • ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతల్లో ముందున్న రాష్ట్రం

  • ‘అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండియా’లో దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆవిష్కరణలతో పాటు వర్ధమాన సాంకేతికతల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు. ‘అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండియా’ హైదరాబాద్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సర్కారు తీసుకున్న వ్యూహాత్మక చర్యలు, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం, ఆవిష్కరణల వంటి అంశాలు పెట్టుబడులను ఆకర్షించాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో స్టార్ట్‌పలను పెంచి, ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలకు తెలంగాణను గమ్యస్థానంగా నిలిపాయని చెప్పారు.


2024లో తెలంగాణ ఐటీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందిందన్నారు. కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), బ్లాక్‌చెయిన్‌ సాఫ్ట్‌వేర్‌లు రాష్ట్రంలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ కీలక నిర్ణయాలతో రాష్ట్రంలో స్టార్టప్‌ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ఇక్కడి స్టార్ట్‌పలు అంతర్జాతీయ అవకాశాలను దక్కించుకుంటున్నాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెరగడంతో ఉత్పాదకత పెరిగిందని, ప్రజా ఆరోగ్య సేవలు మెరుగుపడ్డాయని శ్రీధర్‌ బాబు చెప్పారు.

Updated Date - Oct 01 , 2024 | 03:55 AM