Share News

Saudi Arabia: సౌదీ వచ్చిన 3 రోజులకే గుండెపోటుతో మృతి.

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:25 AM

కొలువు కోసం సౌదీకొచ్చిన తెలంగాణ వాసి మూడు రోజులకే మృత్యువాతపడ్డాడు. ఇది తెలియని యజమాని, విధులకు రాకుండా అతడు పారిపోయాడంటూ కేసు పెట్టాడు. అయితే నెల రోజుల తర్వాత అతడు చనిపోయిన విషయం స్వదేశంలోని అతడి కుటుంబసభ్యులకు తెలిసింది.

Saudi Arabia: సౌదీ వచ్చిన 3 రోజులకే గుండెపోటుతో మృతి.

  • విషయం తెలియక పారిపోయాడంటూ యజమాని కేసు

  • మృతుడు కామారెడ్డి వాసి.. మార్చురీలో నెల తర్వాత గుర్తింపు

  • (గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

కొలువు కోసం సౌదీకొచ్చిన తెలంగాణ వాసి మూడు రోజులకే మృత్యువాతపడ్డాడు. ఇది తెలియని యజమాని, విధులకు రాకుండా అతడు పారిపోయాడంటూ కేసు పెట్టాడు. అయితే నెల రోజుల తర్వాత అతడు చనిపోయిన విషయం స్వదేశంలోని అతడి కుటుంబసభ్యులకు తెలిసింది. మృతుడు కామారెడ్డి జిల్లా శబ్దిపూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ షరీఫ్‌ (39). డ్రైవర్‌గా పనిచేసేందుకు సౌదీ రాజధాని రియాద్‌కు జూన్‌ 3న వచ్చాడు. తర్వాత మూడు రోజులకే సమీపంలోని అజిజీయా పార్కులో అతడు గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.


మృతుడి గురించి నెలరోజుల దాకా ఎవ్వరూ ఆరా తీయకపోవడం, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బయోమెట్రిక్‌ విధానంతో వివరాలు కనుక్కున్నారు. దీనిపై రియాద్‌లోని ప్రముఖ సామాజిక సేవకుడు షిహాబ్‌ కొత్తుకాడ్‌, సిద్ధీఖ్‌ తువూర్లకు సమాచారమిచ్చారు. కాగా వీసా వివరాలను తనిఖీ చేస్తే విఽధి నిర్వహణ నుంచి షరీఫ్‌ పారిపోయినట్లుగా షరీఫ్‌ పేరు బ్లాక్‌ లిస్ట్‌లో ఉంది. పాస్‌పోర్టు ఆధారంగా మృతుడి కుటుంబసభ్యులను భారత రాయబార కార్యాలయం అధికారుల ద్వారా సంప్రదించి షరీఫ్‌ మరణవార్తను తెలియజేశారు. సౌదీలోనే ఉండే మృతుడి కుటుంబీకుల్లో ఒకరు ఆ మృతదేహం షరీ్‌ఫదేనని గుర్తించారు.


భారత రాయబార కార్యాలయం ఖర్చులతో మృతదేహాన్ని ఇటీవల స్వదేశానికి తరలించారు. ఇక కామారెడ్డి జిల్లాలోనే తాడ్వాయి మండలం అరగొండకు చెందిన శ్యామయ్య కూడా అనారోగ్యంతో సౌదీలోని ఆస్పత్రిలో చేరాడు. ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో విషయాన్ని కుటుంబీకులు విచారించగా అతడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుసుకున్నారు. శ్యామయ్య మృతదేహాన్ని కూడా ఇటీవల స్వదేశానికి తరలించారు.

Updated Date - Aug 04 , 2024 | 05:25 AM