Share News

SC categorization: తెలంగాణలోనే మొదట ఎస్సీ వర్గీకరణ: సంపత్‌ కుమార్‌

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:38 AM

దేశంలో మొదట తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కాబోతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించారని గుర్తు చేశారు.

SC categorization: తెలంగాణలోనే మొదట ఎస్సీ వర్గీకరణ: సంపత్‌ కుమార్‌

  • గాంధీభవన్‌లో ఘనంగా చేనేత దినోత్సవం

  • ‘33% రిజర్వేషన్ల’ అమలుకు మహిళా కాంగ్రెస్‌ ఆందోళన

హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): దేశంలో మొదట తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కాబోతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించారని గుర్తు చేశారు. బుధవారం మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు సతీశ్‌ మాదిగ, ఉస్మానియా వర్సిటీ ఉద్యమకారుడు చారకొండ వెంకటేశ్‌తో ఆయన నివాసంలో సమావేశమై ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పీసీసీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌ నేతృత్వంలో గాంధీభవన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి చేనేత వృత్తి అభ్యున్నతికి ఆయన సేవలను కొనియాడారు. చేనేత రంగ ప్రముఖులు బావండ్ల వెంకటేశం, నాగరాజు, లింగయ్య (గద్వాల), గజం జనార్దన్‌ (యాదాద్రి భువనగిరి)ను సన్మానించారు. కాగా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మహిళా కాంగ్రెస్‌ తలపెట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బుధవారం గాంధీభవన్‌ నుంచి టీపీసీసీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు వందలాది మంది మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరగా.. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సునీతారావు కార్యకర్తలతో కలసి బారికేడ్లు ఎక్కి రోడ్డు మీదికి వచ్చేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు పెద్దఎత్తున మోహరించడంతో బయటకు వచ్చే మార్గం లేక మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీభవన్‌లోనే ఆందోళన కొనసాగించారు.

Updated Date - Aug 08 , 2024 | 04:38 AM