Share News

Clinics: ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక క్లినిక్‌లు!

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:21 AM

రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 బోధనాస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుంది.

Clinics: ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక క్లినిక్‌లు!

  • రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో ఏర్పాటు

  • 23 చోట్ల క్లినిక్‌లు.. ఓపీ, ఐపీ సేవలు.. సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 బోధనాస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ఆయా జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రుల్లో ఈ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. శుక్రవారం వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.


తాము అనారోగ్యం పాలైతే ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నామని, ధైర్యం చేసి వెళ్లినా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ట్రాన్స్‌జెండర్లు ఇటీవల సర్కారు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సర్కారు ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఓపీ, ఇన్‌పేషెంట్‌ వైద్య చికిత్సలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడనున్నారు. ఈ క్లినిక్‌లకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు టెండర్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. రాష్ట్రంలో 60 వేల మందికి పైగా ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు సర్కారీ లెక్కలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఉస్మానియా ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి అవసరమైన ఏర్పాట్లూ చేశారు.


  • కేంద్రాలు ఎక్కడంటే..

ఆదిలాబాద్‌ రిమ్స్‌, మంచిర్యాల జనరల్‌ ఆస్పత్రి, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌ ఎంజీఎం, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జనరల్‌ ఆస్పత్రులతో పాటు హనుమకొండ టీబీ ఆస్పత్రిలోనూ ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలో ఒక నోడల్‌ అధికారి లేదా ఫిజీషియన్‌, డెర్మటాలజిస్టు, సైకియాట్రిస్టు, స్టాఫ్‌ నర్స్‌ను నియమించనున్నారు. కాగా, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సైతం ట్రాన్స్‌జెండర్లకు అందించాల్సిన వైద్యచికిత్సలపై ఈ నెల 10న మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Sep 14 , 2024 | 03:21 AM