Share News

Hyderabad: ఆగని రగడ..

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:46 AM

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య రాజుకున్న రగడ శుక్రవారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

Hyderabad: ఆగని  రగడ..
BRS vs Congress

  • కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంతో ఉద్రిక్తత

  • గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ నేతల యత్నం

  • హరీశ్‌, కౌశిక్‌, శంభీపూర్‌ రాజు సహా నేతల హౌస్‌ అరెస్టు

  • జిల్లాల్లోనూ పెద్దఎత్తన బీఆర్‌ఎస్‌ నేతల గృహ నిర్బంధాలు

  • చికిత్స కోసం పోలీసు భద్రత నడుమ ఆస్పత్రికి హరీశ్‌రావు

  • ప్రాంతీయ విభేదాలు సృష్టికి కౌశిక్‌ యత్నం: గాంధీ

  • ఆంధ్రా సెటిలర్లపై నాకు ఎంతో గౌరవం ఉంది

  • నేను చేసిన వ్యాఖ్యలు గాంధీపై వ్యక్తిగతమైనవే: కౌశిక్‌రెడ్డి

  • కౌశిక్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలి: దానం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య రాజుకున్న రగడ శుక్రవారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి తాను గాంధీ ఇంటికి వెళతానని కౌశిక్‌రెడ్డి ప్రకటించడం, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలి రావాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ కీలక నేత హరీశ్‌రావు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శంభీపూర్‌ రాజు సహా ముఖ్య నాయకులందరినీ పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నేతలను కూడా అక్కడే హౌస్‌ అరెస్టు చేశారు. పలువురు నేతలు గృహనిర్బంధం నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.


ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే గాంధీ ఇంటివద్ద భారీగా బలగాలను మోహరించి భద్రత కల్పించారు. అయినా.. రెండోరోజు కూడా కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగాయి. తాను బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానంటున్న గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు పార్టీ కండువా కప్పుతానని, ఆయన ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేస్తానని కౌశిక్‌రెడ్డి ప్రకటించడంతో గురువారం ఇరువురి మధ్య రగడ మొదలైన విషయం తెలిసిందే. కౌశిక్‌రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళతానంటూ గాంధీ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి కొండాపూర్‌లోని కౌశిక్‌ ఇంటికి వెళ్లడంతో జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు కారణమైంది.


  • కౌశిక్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు హౌస్‌ అరెస్ట్‌..

ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి గాంధీకి ఇంటికి వెళ్తామని, అక్కడ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తామని కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండిగల్‌ మునిసిపాలిటీ శంభీపూర్‌లోని రాజు ఇంటి వద్ద మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో శుక్రవారం ఉదయం నుంచే భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ విధించి ఆయన ఇంటివద్దకు బీఆర్‌ఎస్‌ నాయకులు రాకుండా కట్టడి చేశారు. అయినప్పటికీ ఉదయం 10.30 గంటలకు కౌశిక్‌రెడ్డి.. శంభీపూర్‌రాజు ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. వాస్తవానికి కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించి ఆయన బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. కౌశిక్‌రెడ్డి గురువారం అర్ధరాత్రే పోలీసుల కళ్లుగప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు, తెల్లవారుజామునే శంభీపూర్‌ రాజు ఇంటికి వచ్చి అక్కడే నిద్రించినట్లు తెలిసింది. కాగా, శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో శంభీపూర్‌ రాజు, కౌశిక్‌రెడ్డితోపాటు కొంతమంది నాయకులు, కార్యకర్తలు గాంధీ ఇంటికి బయలు దేరేందుకు ప్రయత్నించగా.. పోలీసులు గేటు లోపలనే ఇరువురిని అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.


  • ఎమ్మెల్యేలు, నేతల అరెస్టులు..

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులను కూడా పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్‌, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, బండారి లక్ష్మారెడ్డిలను వారి నివాసాల్లో గృహనిర్బంధం చేశారు. వారితోపాటు ఇతర ముఖ్యనేతలను బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను కూడా ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టు చేశారు. పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని, షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కాగా, అరికెపూడి గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ సిరిసిల్లలో చేనేత చౌక్‌ వద్ద బీఆర్‌ఎస్వీ నాయకులు ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. ఓదెల మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్‌ను పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు.


  • పోలీస్‌ భద్రత నడుమ ఆస్పత్రికి హరీశ్‌రావు

కోకాపేట్‌లోని తన నివాసంలో హౌస్‌ అరెస్టయిన బీఆర్‌ఎస్‌ కీలక నేత హరీశ్‌రావు శుక్రవారం ఆస్పత్రికి కూడా పోలీసుల భద్రత నడుమ వెళ్లాల్సివచ్చింది. గురువారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు హరీశ్‌రావును అరెస్టు చేసి తరలించే క్రమంలో ఆయన భుజానికి గాయమైనట్లు తెలిసింది. దీనికి తాను చికిత్స తీసుకోవాలని హరీశ్‌రావు పోలీసులకు చెప్పడంతో వారే ఆయనను వెంటబెట్టుకొని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వారి భద్రత నడమనే హరీశ్‌రావుకు చికిత్స అందించారు. అంతకుముందు హరీశ్‌రావును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.


  • కౌశిక్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలి: దానం

కౌశిక్‌రెడ్డి చేసిన ఆంధ్ర, తెలంగాణ వ్యాఖ్యలను తాము చాలా సీరియ్‌సగా తీసుకుంటామని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. కౌశిక్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం అరికెపూడి గాంధీకి మద్దతుగా నాగేందర్‌ ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డిని కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడైన హరీశ్‌రావుకు ఉందన్నారు. ఆయనకు చేతకాకుంటే ఎలా కంట్రోల్‌ చేయాలో తమకు తెలుసునన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కూడా గాంధీకి మద్దతుగా ఆయన ఇంటికి వచ్చారు. మీడియాలో పబ్లిసిటీ కోసమే కౌశిక్‌రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్లాన్‌ ప్రకారమే బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తోందని, నగరాభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.


  • ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద మూడంచెల భద్రత..

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద కూడా ఉదయం నుంచే పోలీసులు భారీ భద్రత కల్పించారు. బాలానగర్‌ డీసీపీ సురే్‌షకుమార్‌ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గాంధీ ఇంటికి వెళ్లే అన్ని రహదారులను మూసి వేశారు. కేవలం ఆ కాలనీలో నివాసముండే వారిని మాత్రమే అనుమతించారు. మధ్యాహ్నం సమయంలో వివేకానందనగర్‌ డివిజన్‌కు చెందిన కొంతమంది బీఆర్‌ఎస్‌ నాయకులు గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్‌ఎస్‌ నాయకులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఒక్కసారిగా వారి వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని వారిని శాంతింపజేశారు. ఇదిలా ఉండగా.. కౌశిక్‌రెడ్డితో కలిసి తన ఇంటికి వస్తానన్న బీఆర్‌ఎస్‌ నాయకుల కోసమంటూ గాంధీ తన నివాసంలో ఉదయం పూట కుర్చీలు వేసి వారికి టిఫిన్లు ఏర్పాటు చేశారు.


  • సీఎం డైరెక్షన్‌లో నన్ను హత్య చేసే కుట్ర: కౌశిక్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ట్రాప్‌లో పడిన సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ నుంచి పెట్టుబడులను అమరావతికి తీసుకపోతున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్ధితి తీసుకొచ్చారని అన్నారు. ఆంరఽధా సెటిలర్స్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఆంధ్రావాళ్లు అని తాను అనలేదని తెలిపారు. ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడి ఉంటే.. అది తనకు, గాంధీకి వ్యక్తిగతమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వారిలా దాడులు చేయడం తమకు పెద్ద విషయమేమీ కాదని, అయితే వాళ్లు చేసిన తప్పులు మనం చేయవద్దని కేసీఆర్‌ అనడంతో సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. దానం నాగేందర్‌కు నిజంగా పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఖైరతాబాద్‌లో ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.


13.jpg

  • నా ఇంటిపై జెండా ఎగరేసేందుకు కౌశిక్‌ ఎవడు?: గాంధీ

కౌశిక్‌రెడ్డిపై తాను నోరు జారింది వాస్తవమేనని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. అయితే కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగానే తాను అలా పరుష పదజాలంతో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. తన ఇంటిపై జెండా ఎగరేసేందుకు కౌశిక్‌రెడ్డి ఎవరని ప్రశ్నించారు. మహిళా గవర్నర్‌ను అవమానించిన చరిత్ర అతనిదని అన్నారు. చీర, గాజుల గురించి మాట్లాడి తల్లి, చెల్లి, భార్యను అవమానించాడని, ప్రాంతీయ విబేధాలు తీసుకొచ్చాడని మండిపడ్డారు. అతడి మాటలతో ఆంధ్రవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు మీకు ప్రాంతాలు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏమైనా కౌశిక్‌రెడ్డి అయ్య జాగీరా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగా బీఆర్‌ఎ్‌సకు, కేసీఆర్‌కు మచ్చ వస్తుందని, అతని లాంటి వారితోనే బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోయిందని ఆరోపించారు. ‘‘బ్రోకర్‌, కోవర్టును ఊరు మీద కు వదిలారు. అమెరికా నుంచి ఫోన్‌లో హెచ్చరికలు రావడంతోనే ఈ రోజు తగ్గి మాట్లాడాడు. నా భాష గురించి మాట్లాడుతున్న హరీశ్‌రావు గతంలో ప్రభుత్వ అధికారులైన ఐఏఎస్‌, ఐపీఎ్‌సలపై మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలి’’ అని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నాననే దానిపై స్పీకర్‌ క్లారిటీ ఇచ్చారని తెలిపారు.

Updated Date - Sep 14 , 2024 | 07:06 AM