Fee Payment: దిగొచ్చిన టె న్త్ బోర్డు..
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:20 AM
పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును టెన్త్ బోర్డు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇవ్వగా..
పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు 28 వరకు పొడిగింపు
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును టెన్త్ బోర్డు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇవ్వగా.. దీనికి సంబంధించి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘పది ఫీజు పరేషాన్’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ శనివారం కథనం ప్రచురించింది. దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం స్పందించింది. ఫీజు చెల్లించే గడువును ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది. ఫీజు చెల్లించిన అనంతరం ముద్రిత నామినల్ రోల్స్‌ను 30 నుంచి డిసెంబరు 4 వరకు పొడిగించారు.
ఆ నామినల్ రోల్స్‌ను సంబంధిత డీఈవోలు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ (టెన్త్ బోర్డు)కు డిసెంబరు 5 నుంచి 7 వరకు సమర్పించాల్సి ఉంటుంది. ఇక రూ.50 అపరాధ రుసుముతో డిసెంబరు 10 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబరు 19 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 30వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను నమోదు చేసుకోవాలని.. ఐడీ, పాస్‌వర్డ్‌తో బోర్డు వెబ్సైట్లో లాగిన్ అయి వివరాలు పొందుపరచాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.