Electric Buses: జిల్లాలకూ ఎలక్ట్రిక్ బస్సులు
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:55 AM
రాజధాని నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం టీజీఎ్‌సఆర్టీసీ మరో వారం రోజుల్లో ఎలక్ట్రిక్ (సెమీ లగ్జరీ) బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
కరీంనగర్, ఇందూరు డిపోలకు కేటాయింపు
హైదరాబాద్ మార్గంలో సెమీ లగ్జరీ సేవలు
ఒలెకా్ట్ర, జేబీఎం సంస్థలతో ఆర్టీసీ ఒప్పందం
అద్దె ప్రాతిపదికన నడిపేందుకు చర్యలు
మరో వారం రోజుల్లో అందుబాటులోకి
డిసెంబరు నాటికి మరిన్ని జిల్లాలకు విస్తరణ
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాజధాని నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం టీజీఎ్‌సఆర్టీసీ మరో వారం రోజుల్లో ఎలక్ట్రిక్ (సెమీ లగ్జరీ) బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు విజయవాడ వెళ్లి వచ్చేందుకు పరిమితంగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.. ఇకపై జిల్లా కేంద్రాలకు కూడా ఆ సర్వీసులను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో బస్సు సుమారు రూ.1.5కోట్ల నుంచి రూ.1.8 కోట్ల ఖరీదు చేస్తున్నందున.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒలెకా్ట్ర, జేబీఎం సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఒక్కో సంస్థ నుంచి 500 చొప్పున బస్సులు తీసుకుని కరీంనగర్, నిజామాబాద్ డిపోలతో పాటు వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్-2 డిపోల నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో డిపో నుంచి 75 బస్సుల చొప్పున ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. డిసెంబరు నాటికి సిటీతో పాటు జిల్లాల నుంచి వెయ్యి ఎలక్ట్రిక్ సెమీ లగ్జరీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బస్సులకు చార్జింగ్ పెట్టేందుకు ఆయా డిపోల వద్ద ఏర్పాటు చేసే ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆర్టీసీ వ్యయం చేస్తోంది. ఇటీవలే జేబీఎం 50 బస్సులను సమకూర్చగా.. ఆర్టీసీ అధికారులు కరీంనగర్ డిపోకు 33, నిజామాబాద్ డిపోకు 13 బస్సులను కేటాయించారు. మిగిలిన బస్సులను స్పేర్‌లో ఉంచారు. ఈ బస్సులకు డ్రైవర్లను జేబీఎం సంస్థనే నియమిస్తుంది.
విజయవాడ మార్గంలో విజయవంతం..
ప్రస్తుతం కంటోన్మెంట్, మియాపూర్ డిపోల నుంచి సుమారు వంద ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఇందులో పది బస్సులు విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 300-320 కి.మీ దూరం వెళతాయి. విజయవాడ వెళ్లి వచ్చే బస్సుల కోసం సూర్యాపేటలో ఆర్టీసీ అధికారులు చార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సర్వీసులు విజయవంతం కావడంతో అధికారులు తెలంగాణ జిల్లాలకు ఎలక్ట్రిక్ బస్సుల సేవలను విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కరీంనగర్ డిపోలో ఏర్పాట్లు..
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా నుంచి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ డిపోలో ప్రత్యేకంగా 11కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పెట్టి 12 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అలాగే నిజామాబాద్ డిపోలో కూడా చార్జింగ్ యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్-జేబీఎస్, నిజామాబాద్-జేబీఎస్ మధ్య నడిచే బస్సుల కోసం కంటోన్మెంట్ డిపోలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు.