Share News

Mahesh Kumar Goud: పార్టీ కేడర్‌కు పీసీసీ చీఫ్ కీలక సూచన

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:11 PM

పార్టీలో కష్టపడిన నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కింద స్థాయి కేడర్ కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని కీలక పదవుల్లో నియమిస్తామని ఆయన తెలిపారు.

Mahesh Kumar Goud: పార్టీ కేడర్‌కు పీసీసీ చీఫ్ కీలక సూచన
TPCC Chief Mahesh Kumar Goud

హైదరాబాద్, నవంబర్ 30: పార్టీలోని కింద స్థాయి నాయకుల కష్టంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (టీపీసీసీ) మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కష్టపడిన నాయకులకు పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీలోని నేతలకు అన్ని రకాల పదవులల్లో అవకాశం కల్పిస్తామన్నారు. శనివారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళదని ఆయన విమర్శించారు.


రూ. 8 లక్షల కోట్ల అప్పు..

బీఆర్ఎస్ నేతలు రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి పనులు చేసిన.. బీఆర్ఎస్ నేతలు మనపై అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిన ఆవసరం ఉందన్నారు. మనం చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని పార్టీ కేడర్‌కు ఆయన కీలక సూచన చేశారు.


పార్టీ శ్రేణులకు పిలుపు..

బీఆర్ఎస్, బీజేపీలు మనపై చేస్తున్న అబద్దాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదని తెలిపారు. అలాగే 10 ఏళ్లలో చేయ లేని పనులు 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిందని గుర్తు చేశారు. బీజేపీ మత తత్వ ప్రచారంతో లబ్ది పొందుతుందని ఆరోపించారు.


రాహుల్‌ని ప్రధాని చేయాలి..

అయితే బీజేపీ మతతత్వ ప్రచారాన్ని మోడీ అబద్దాలను సైతం తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత మనపై ఉందని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు ఆయన సూచించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి అభివృద్ధి చేసే లక్ష్యంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


సర్వే ఎంత అవసరమో..

కులగణన సర్వే ఎంత అవసరమో ఆయన వివరించారన్నారు. అదే ప్రస్తుతం తెలంగాణలో అమలు జరుగుతుందని వివరించారు. రాహుల్ గాంధీ స్వాతిముత్యం అంత మంచి వాడని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. ఆయన అన్ని రకాల మంచి పనులు చేస్తున్నారని తెలిపారు. నాగార్జున సాగర్‌లో వారం రోజుల పాటు ఆదివాసీ క్యాంపు నిర్వహించనున్నామని ఆయన స్పష్టం చేశారు.

For Telangana News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 03:21 PM