Share News

Sircilla: పీఈటీని తొలగించాలంటూ విద్యార్థినుల ధర్నా

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:26 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు.

Sircilla: పీఈటీని తొలగించాలంటూ విద్యార్థినుల ధర్నా

  • పీఈటీ జ్యోత్స్న చితకబాదారని విద్యార్థినుల ఆరోపణ

  • స్నానం చేస్తుంటే వీడియోలు రికార్డు చేశారంటూ ఆవేదన

  • విచారణ జరిపి పీఈటీని తొలగించిన కలెక్టర్‌

సిరిసిల్ల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోన్న గెస్ట్‌ పీఈటీ జ్యోత్స్నను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గేట్‌ దూకి చీకట్లో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రత్యేక తరగతులకు హాజరుకాని విద్యార్థినులను జ్యోత్స్న చితకబాదిందని వారు ఆరోపించారు.


బాత్రుంలో స్నానం చేస్తుంటే తలుపులు విరగ్గొట్టి లోపలికి దూరి ఫోన్‌లో వీడియాలు రికార్డు చేసిందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా విద్యార్థినులు వినిపించుకోలేదు. చివరకు కలెక్టర్‌ సందీ్‌పకుమార్‌ ఝా అదేశాల మేరకు డీఈవో రమేష్‌ విద్యార్థినులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం కలెక్టర్‌ పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. పీఈటీని విధుల్లో నుంచి తొలగించారు.

Updated Date - Sep 13 , 2024 | 04:26 AM