Viral Fever: జ్వరం తగ్గి 2 నెలలైనా తగ్గని నొప్పులు
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:10 AM
రాష్ట్రంలో వైరల్ జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. ప్లేట్లె ట్లు తగ్గిపోవడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నీరసంతోపాటు.. 103 డిగ్రీలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు రెండు మూడు రోజులకే తగ్గిపోతున్నా.. అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి.
ముందెన్నడూ లేని విధంగా విషజ్వరాలు.. దోమల స్వైరవిహారం
ఆస్పత్రులకు బాధితుల క్యూ.. ఓపీలో వారి సగటే 30-40%
డెంగీ, చికున్‌గున్యా విజృంభణ.. రాష్ట్రానికి అమెరికా ట్రావెల్ అలెర్ట్
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ల్యాప్రోస్కోపిక్ సర్జన్ చికున్‌గున్యా బారినపడ్డారు. రోజూ సర్జరీలతో బిజీబిజీగా ఉండే ఆయన.. జ్వరంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు జ్వరం తగ్గినా.. జ్వరానంతర(పోస్ట్ వైరల్) సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒంటినొప్పులు, నీరసం, అలసట కారణంగా శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారు. కేవలం ఔట్‌పేషెంట్లను చూడడానికే పరిమితమవుతున్నారు. ఆయన వయసు 45 ఏళ్లే..!
ఖమ్మం జిల్లాకు చెందిన మెహన్రావు అనే ఆటోరిక్షా డ్రైవర్దీ ఇదే పరిస్థితి..! కొన్నాళ్ల క్రితం విషజ్వరం బారినపడ్డారు. ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయినా.. విపరీతమైన ఒంటినొప్పులతో ఆటోరిక్షాను నడపలేకపోతున్నారు. ఇంటికే పరిమితమయ్యారు.
ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు
రోజుకు ఓపీలో వారి సగటే 30-40ు
పెరుగుతున్న డెంగీ, చికున్‌గున్యా
తెలంగాణకు అమెరికా ట్రావెల్ అలెర్ట్
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైరల్ జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. ప్లేట్లె ట్లు తగ్గిపోవడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నీరసంతోపాటు.. 103 డిగ్రీలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు రెండు మూడు రోజులకే తగ్గిపోతున్నా.. అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. జ్వరం తగ్గిన తర్వాత ఒంటినొప్పులు ఊపిరి సలపనివ్వడం లేదు. దీంతో బాధితు లు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజువారీ ఔట్‌పేషెంట్ కేసుల్లో జ్వరానంతర సమస్యలే 30-40ు వరకు ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాధితుల్లో వైరల్ జ్వరాల నుంచి బయటపడ్డామనే ఆనందం కంటే.. పోస్ట్వైరల్ లక్షణాలతో ఆందోళనలు పెరుగుతున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
పెరుగుతున్న మలేరియా, డెంగీ, గున్యా
ఈ ఏడాది రాష్ట్రంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. విస్తృతంగా వర్షాలు కురవడం, వాతావరణ మార్పులు, దోమల స్వైరవిహారం వంటివి ఇందుకు కారణాలుగా వివరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకా రం ఈ ఏడాది 9,450 డెంగీ కేసులు, 194 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. అనధికారిక అంచనాల ప్రకారం.. వీటి సంఖ్య 30 వేలు(20ు పెరుగుదల), 15 వేలుగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. గత నాలుగేళ్లలో ఈ స్థాయిలో డెంగీ, చికున్‌గున్యా కేసులు లేవని చెబుతున్నారు. సాధారణంగా డెంగీ, విషజ్వరాలు జూన్‌లో మొదలై.. ఆగస్టులో పతాకస్థాయికి, సెప్టెంబరులో తారస్థాయికి చేరుకుంటాయి. అక్టోబరు తొలి వారం నుంచి తగ్గుముఖం పడతాయి. కానీ, ఈ ఏడా ది మాత్రం జ్వరాలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తున్నాయి. మొదట్లో విషజ్వరాలు..ఆ తర్వాత డెంగీ, చికున్‌గున్యా, ప్రస్తుతం వీటితోపాటు, వైరల్ దగ్గు వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తగ్గని నొప్పులు.. బాధితుల తంటాలు
ఈ ఏడాది మిశ్రమ జ్వరాల(మిక్స్డ్ వైరల్ ఫీవర్స్)తో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాలు, డెంగీతో మరణాలు కూడా సంభవించాయని గుర్తుచేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ విషజ్వరాలు, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరిటీస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్లు అధికారిక గణాంకాలు వివరిస్తున్నాయి. వీటికి తోడు.. దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొంటున్నారు. జ్వరాలతో యుక్తవయస్కుల్లో కూడా రోగనిరోధక శక్తి తగ్గి.. ఇతర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారని చెబుతున్నారు. అయితే.. చికున్‌గున్యా, డెంగీల తీవ్రత శరీరతత్వాన్ని బట్టి.. కొందరిలో 4 వారాలకు పరిమితమవ్వగా.. మరికొందరిలో 8 వారాలు అయినా.. ఒంటినొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడం లేదంటున్నారు. ‘‘తీవ్రత ఎంతలా ఉందంటే.. నొప్పులతో బాధితులు ఉదయాన్నే మూత్రవిసర్జనకు కూడా వెళ్లలేనంతగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధుల్లో జ్వరానంతర ఒంటినొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి’’ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
జ్వరానంతర సమస్యల విషయంలో వైద్యులు పలు సూచనలు చేశారు. జ్వరం తగ్గాక వెంటనే బయటకు వెళ్లకుండా.. తగినంత విశ్రాంతి తీసుకోవాలంటున్నారు. పూర్తిగా కోలుకునేవరకు అధిక శ్రమ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. మరిన్ని సూచనలు..
డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. తగినంత నీళ్లు తాగాలి. కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు
తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధా న్యాలు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
ధూమపానానికి దూరంగా ఉండాలి
నొప్పులు ఎక్కువగా ఉంటే.. పారాసిటమాల్ వేసుకోవాలే తప్ప.. పెయిన్ కిల్లర్ల జోలికి వెళ్లకూడదు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్నా.. 103 డిగ్రీలకు మించి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతు లు, డీహైడ్రేషన్ ఉంటే.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి
15 ఏళ్ల తర్వాత.. అమెరికా ట్రావెల్ అలెర్ట్
తెలంగాణకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ) ట్రావెల్ అడ్వయిజరీ చేసింది. 2009లో తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నప్పుడు అమెరికా ట్రావెల్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే..! అప్పట్లో హైదరాబాద్.. ముఖ్యంగా పంజాగుట్ట ప్రాంతాలకు వెళ్లొద్దని తమ పౌరులను అప్రమత్తం చేసింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు చికున్‌గున్యా విజృంభిస్తోందని, పౌరులు తెలంగాణకు వెళ్లాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. తెలంగాణ నుంచి అమెరికాకు వచ్చిన వారిలో చికున్‌గున్యా నిర్ధారణ అయినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు వచ్చేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా.. ఆగస్టు నెలలో మహారాష్ట్రలో జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కూడా అమెరికా ఆ రాష్ట్రానికి వెళ్లే పౌరులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది.
కూర్చున్నాక.. లేవలేని పరిస్థితి
జ్వరానంతర సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. విషజ్వరాల నుంచి కోలుకున్నా.. రోగనిరోధక శక్తి లేక.. బాగా నీరసంతో బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ఆయాసం, నడుంనొప్పి, మోకాళ్ల నొప్పులతో కనీసం మెట్లు ఎక్కలేకపోవడం, కుర్చీల్లో కూర్చున్నవారు లేవలేకపోవడం, భుజాల కదలికలు తగ్గిపోవడం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయి. విషజ్వరాలు, డెంగీ, చికున్‌గున్యా వ్యాప్తి పెరుగుతోంది, జ్వరం తగ్గినా.. నొప్పులు మాత్రం 4-8 వారాల వరకు కొనసాగుతున్నాయి.
- డాక్టర్ వినయ్‌కుమార్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి
అవయవాలు దెబ్బతింటున్న కేసులొస్తున్నాయి
జ్వరానంతర సమస్యల్లో.. కొందరిలో కీళ్లనొప్పులు, ఒంటినొప్పులు, నీరసం వంటి లక్షణాలు 2-3 నెలల వరకు ఉంటున్నాయి. కొన్ని కేసుల్లో కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు గుర్తించాం. న్యూమోనియా వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కొందరైతే.. నెలరోజుల వరకు కూడా పనులు చేయలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంతోపాటు.. డి, సి-విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి.
- డాక్టర్ ఎం.స్వప్న, ఎండీ(జనరల్ మెడిసిన్), గాంధీ ఆస్పత్రి