Share News

Telangana: రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఊరుకోం

ABN , Publish Date - May 29 , 2024 | 04:46 AM

రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Telangana: రాష్ట్ర చిహ్నంలో   మార్పులు చేస్తే ఊరుకోం

ఓరుగల్లు సాక్షిగా సమర శంఖం పూరిస్తాం

పిచ్చోడిచేతిలో రాయిలా తెలంగాణలో పాలన

రాష్ట్రంలో రైతులపై దాడులు జరుగుతుంటే..

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలా..?

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు

రాష్ట్రంలో రైతులపై దాడులు జరుగుతుంటే..

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలా..?: కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉందని, రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమన్నారు. పౌరుషానికి ప్రతీక అయిన ఓరుగల్లు సాక్షిగా కాంగ్రెస్‌ సర్కారు సంకుచిత నిర్ణయాలపై సమర శంఖం పూరిస్తామని, తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమం చేపడతామని కేటీఆర్‌ హెచ్చరించారు. రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్‌ ఉండటం రాచరిక పోకడ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మంగళవారం ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ రాచరికపు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో రైతన్నలపై దాడులు, లాఠీచార్జ్‌ జరుగుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉండటం సిగ్గుచేటని కేటీఆర్‌ మండిపడ్డారు. ఆదిలాబాద్‌లో రైతులపై జరిగిన లాఠీచార్జ్‌ను ఖండించిన ఆయన.. ఈ దాడికి పాల్పడిన ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


1 నుంచి దశాబ్ది ఉత్సవాలు..

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జూన్‌ 1 నుంచి మూడు రోజుల పాటు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 1న సాయంత్రం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌ బండ్‌వద్ద ఉన్న అమరజ్యోతి వరకు అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు మంగళవారం ఆయన తెలిపారు. కార్యక్రమానికి పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు తెలంగాణ ఉద్యమకారులు హాజరవుతారని చెప్పారు. 2న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఉంటాయని వెల్లడించారు.

రాష్ట్ర గీతంపై ఆంధ్రోళ్ల పెత్తనమేంది..?: ఆర్‌ఎస్పీ

‘తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనం ఏంది? అదీ తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత’ అంటూ బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ‘కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు నాటు పాట కాదు.. ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుబాటు బావుటా ఎగరేసిన అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతిరూపం. జయ జయహే గీతం ఒక రణ నినాదం. అందెశ్రీ ఇచ్చిన ఒరిజినల్‌ ట్యూన్‌తోనే ఈ గీతాన్ని యావత్‌ తెలంగాణ ఆనాడు ఆలపించింది. గీత స్వర కల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది..?’ అని ప్రశ్నించారు.

Updated Date - May 29 , 2024 | 04:48 AM