Share News

Viral News: నోట్లో నాగుపాముతో దుస్సాహసం

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:43 AM

సోషల్‌ మీడియా సంచలనంగా మారిపోవాలనే పిచ్చి ఆలోచనతో ఓ యువకుడు దుస్సాహసం చేశాడు.

Viral News: నోట్లో నాగుపాముతో దుస్సాహసం

  • పాము కాటుకు గురై యువకుడి మృతి

బాన్సువాడ, సెప్టెంబరు 6: సోషల్‌ మీడియా సంచలనంగా మారిపోవాలనే పిచ్చి ఆలోచనతో ఓ యువకుడు దుస్సాహసం చేశాడు. విషపూరితమైన నాగుపామును నోట్లో పెట్టుకుని వీడియో తీయించుకుంటూ.. అదే పాము కాటుకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది కానీ ఆ యువకుడే లోకంలో లేకుండా పోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేటలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మోచి శివరాజులు(23) అనే యువకుడు మరణించాడు.


దేశాయిపేటకు చెందిన మోచి గంగారం పాములు పడుతూ స్నేక్‌ క్యాచర్‌గా జీవిస్తున్నాడు. గంగారం కుమారుడు శివరాజులు కూడా పాములు పడుతుంటాడు. గంగారం ఇటీవల ఓ నాగుపామును తెచ్చి శివరాజులుకు ఇచ్చాడు. స్నేక్‌ క్యాచర్‌గా పేరు సంపాదించేందుకు ఆ పాముతో వీడియోలు, ఫొటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టాలని సూచించాడు. దీంతో శివరాజులు నాగుపాము తల భాగాన్ని తన నోట్లో పెట్టుకుని విన్యాసాలు చేస్తూ స్నేహితులతో వీడియో తీయించుకున్నాడు.


శివరాజులు సుమారు పది నిమిషాలు పాటు పామును తన నోట్లోనే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో ఆ పాము శివరాజులు నోట్లో కాటేసినట్టు తెలిసింది. పాము కాటును గుర్తించని శివరాజులు యధావిధిగా ఇంటికి వెళ్లగా.. ఆ తర్వాత అరగంటకే చనిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Updated Date - Sep 07 , 2024 | 04:43 AM