Ministers Files: ఫైళ్లపై దండయాత్ర!
ABN , First Publish Date - 2023-09-04T03:11:06+05:30 IST
రాష్ట్ర మంత్రులు(Ministers Files) ఫైళ్లపై దండెత్తారు. వాటిని క్లియర్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు.. కొన్నిచోట్ల వేడుకోళ్లతో హడావుడి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అందినకాడికి సర్దేసే పనిలో పడ్డారు. తమ తమ శాఖల ముఖ్య కార్యదర్శులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ‘ఎన్నికలు(Elections) ఎప్పుడొస్తాయో తెలియదు.
మంత్రుల ‘ముందు’ జాగ్రత్త
లబ్ధి చేకూర్చే ఫైళ్లపై కన్ను
ఎన్నికలు ముందే రావొచ్చన్న ప్రచారంతో మంత్రులు నానా హైరానా పడుతున్నారు. అందినకాడికి వెనకేసుకునేందుకు అప్పుడే కీలక ఫైళ్లపై కన్నేశారు. ఎన్నికలు 2-3 నెలల్లోనే వచ్చేస్తే వాటిని తీరిగ్గా క్లియర్ చేసే అవకాశం ఉండదు.. దీంతో అమాత్యులు పవర్ ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకునేందుకు హడావుడి పడుతున్నారు. తమ తమ శాఖల్లో పాత ఫైళ్లు, ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారు చెప్పింది చేయాలని సీఎం కార్యాలయం సైతం అధికార యంత్రాంగానికి ఆదేశాలివ్వడం గమనార్హం.
వాటిని క్లియర్ చేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు
ముఖ్య కార్యదర్శులతో భేటీలు
తమ అనుచరులకే టెండర్లు ఇవ్వాలని పట్టు
నామినేషన్పైనా పనులు
అమాత్యులకే సీఎంవో దన్ను
వారు చెప్పింది చేయాలని హెచ్వోడీలకు ఆదేశాలు
దేవదాయ శాఖలో 3 వేల ఫైళ్లు పెండింగ్!
వీటిపై నేటిలోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశాలు
4 రోజులుగా అదే పనిలో అధికార యంత్రాంగం
సిబ్బందికి సెలవులు సైతం రద్దు
కొన్నిటికి వేగంగా క్లియరెన్సులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రులు(Ministers Files) ఫైళ్లపై దండెత్తారు. వాటిని క్లియర్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు.. కొన్నిచోట్ల వేడుకోళ్లతో హడావుడి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అందినకాడికి సర్దేసే పనిలో పడ్డారు. తమ తమ శాఖల ముఖ్య కార్యదర్శులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ‘ఎన్నికలు(Elections) ఎప్పుడొస్తాయో తెలియదు. ఈ ఎన్నికల తర్వాత పదవి ఉంటుందో లేదో తెలియదు. ఉన్న ఈ కాస్త సమయంలోనైనా మా పనులు చేసి పెట్టండి. కనీసం కొన్ని టెండర్లయినా మా వాళ్లకు కేటాయించండి’ అంటూ వ్యక్తిగతంగా విన్నవించుకుంటున్నారు. అన్ని వైపుల నుంచీ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. మరికొంత మంది ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)తో కూడా చెప్పించుకుంటున్నారు. సీఎంవో అధికారులు (CMO officials)సైతం మంత్రులు అడిగినవి చేయాలని శాఖాధిపతులను ఆదేశిస్తున్నారు. తాము మంత్రిగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి తమ పేషీల ద్వారా ఎన్ని ఎండార్స్‌మెంట్స్‌ను శాఖలకు పంపించారు..? అందులో ఎన్ని క్లియర్ అయ్యాయి..? ఎన్ని పెండింగ్‌లో పెట్టారన్న దానిపై అమాత్యులు ప్రస్తుతం దృష్టి సారించారు.
ఆ జాబితాను శాఖాధిపతులకు పంపించి తమ ఎండార్స్మెంట్స్(Endorsements) ఎందుకు క్లియర్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. గత పదిహేను రోజులుగా దాదాపు అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. మంత్రులు ప్రతి రోజూ ముఖ్య కార్యదర్శులతో భేటీ అవడమో.. ఫోన్లో మాట్లాడి తమ ఫైల్స్‌ను క్లియర్ చేయించుకోవడమో జరుగుతోంది. ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ(Minister Kottu Satyanarayana) ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ‘మా పేషీ నుంచి ఎండోమెంట్ కమిషనరేట్‌కు ఇప్పటి వరకూ దాదాపు మూడు వేల ఎండార్స్మెంట్స్ వచ్చాయి. ఆ ఫైళ్లన్నీ ఏం చేశారు? ఎన్ని క్లియర్ చేశారు..? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి..? ఎందుకు పెండింగ్ పెట్టారో వెంటనే రిపోర్టు ఇవ్వండి’ అని ఏకంగా కమిషనరేట్‌కే లేఖ రాశారు. వీటిపై సోమవారం నాటికి స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. దీంతో కమిషనరేట్ ఉద్యోగులంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. గత నాలుగు రోజులుగా నివేదిక తయారీపై కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికిప్పుడు క్లియర్ చేయగల ఫైళ్లు ఉంటే వెంటనే ఆ పనిచేస్తున్నారు. కమిషనరేట్ ఉద్యోగులకు సెలవులు కూడా ఇవ్వడం లేదు. ఫోన్లు చేసిన వెంటనే వారి వద్ద ఉన్న ఫైళ్లు పంపించాలని ఆదేశించడంతో శని, ఆదివారాల్లో కూడా పని చేయాల్సిన పరిస్థితి. దేవదాయ శాఖ మాత్రమే కాదు.. అన్ని శాఖల్లోనూ ఇదే జరుగుతోందని అంటున్నారు. సెలవు రోజుల్లో కూడా ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించుకుని మం త్రులు ఫైళ్లు పరిష్కరిస్తున్నారు. కొందరిని ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశిస్తున్నారు.
టెండర్లు మా వాళ్లకే రావాలి..
మరికొన్ని శాఖల్లో పరిస్థితి విచిత్రంగా మారింది. శాఖలో ఏ టెండర్లు పిలిచినా కచ్చితంగా తమ వాళ్లకే ఇవ్వాలంటూ అధికారులపై మంత్రులు ఒత్తిడి చేస్తున్నారు. అర్హతలు, కంపెనీ స్థితిగతుల గురించి పట్టించుకోకుండా తాము సిఫారసు చేసినవారికే టెండర్లు ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. దీంతో కొన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు మంత్రుల అనుచరులకు టెండర్లు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. వారి కంపెనీలు ఎంపికయ్యేలా టెండర్ నిబంధనలు తయారు చేస్తున్నారు. కొన్ని శాఖల్లో నామినేషన్ పద్ధతిలో మంత్రుల అనుచరులకు ఇచ్చేస్తున్నారు.