Share News

Supreme Court: ఏపీలో దొంగ ఓట్లపై నేడు సుప్రీంలో విచారణ

ABN , First Publish Date - 2023-11-28T10:07:01+05:30 IST

న్యూఢిల్లీ: ఏపీలో దొంగ ఓట్లపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఏపీలో దొంగ ఓట్ల నమోదు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని 'సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ' ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Supreme Court: ఏపీలో దొంగ ఓట్లపై నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: ఏపీలో దొంగ ఓట్లపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని 'సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ' ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మాటున కుట్ర జరుగుతోందిని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు సిటిజన్ ఫర్ డెమొక్రసి విజ్ఞప్తి చేసింది. మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్‌ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని, వారి ద్వారా చట్ట విరుద్ధంగా వ్యక్తిగత సమాచారం సేకరణ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికల అక్రమాలకు తావిస్తున్న వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. అధికార వైకాపా కార్యకర్తలనే ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిందని, అందుకు అవకాశం కల్పించిన జీవో నెం.104ను సస్పెండ్‌ చేయకపోతే ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ప్రాథమిక, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ సంస్థ పేర్కొంది. వాలంటీర్ల ద్వారా... సేకరించిన సమాచారాన్నంతా అధికారికంగా సొంత పార్టీ సభ్యులకు అందించి వారి ద్వారా గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని ఆ సంస్థ పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం తన బాధ్యతలను విస్మరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ఓటర్ల తొలగింపు జరిగిందని తెలిపింది. ఓట్ల తొలగింపు, సేకరించిన డేటాను ప్రైవేటు సంస్థలకు పంచేందుకు.. అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని సంస్థ తన పిటిషన్‌లో వివరించింది.

వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఐప్యాక్, రామ్‌ ఇన్ఫో ప్రైవేట్‌ లిమిటెడ్‌ లాంటి సంస్థల ద్వారా ప్రొఫైలింగ్‌ చేయించడంపై పరిశీలన కోసం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ కోరింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజల వ్యక్తి గత గోప్యతకు భంగం కల్గించేలా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని 21, 243కి అధికరణానికి విరుద్ధమైన జీవో.104ను కొట్టేయాలని, చట్టవిరుద్ధంగా నియమితులై అధికార పార్టీ తరుఫున పని చేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్‌ వ్యవస్థను ఎన్నికల సంబంధ విధుల నుంచి పూర్తిగా తప్పించాలని కోరింది. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సేవలను ఉపయోగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ ఆ పిటిషన్‌లో పేర్కొంది.

Updated Date - 2023-11-28T10:07:03+05:30 IST