Crime: 10 నిమిషాల్లో వస్తానని అమ్మనాన్నలకు చెప్పి బయటికెళ్లిన అమెజాన్ మేనేజర్.. కానీ ఇంతలోనే దారుణం..

ABN , First Publish Date - 2023-08-30T15:41:18+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Crime: 10 నిమిషాల్లో వస్తానని అమ్మనాన్నలకు చెప్పి బయటికెళ్లిన అమెజాన్ మేనేజర్.. కానీ ఇంతలోనే దారుణం..

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మేనేజర్‌గా(Amazon manager) ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడి మేనమామకు కూడా కాల్పుల్లో గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు హర్‌ప్రీత్ గిల్‌గా(Harpreet Gill) పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటన మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల హర్‌ప్రీత్ గిల్ అమెజాన్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో తన మేనమామాతో కలిసి బయటికి వెళ్లాడు. 10 నిమిషాల్లో తిరిగి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి మరి వెళ్లాడు. కానీ ఇంతలోనే దారుణం జరిగింది. భజన్‌పురలోని సుభాష్ విహార్ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి వారిని అడ్డగించారు. ఇద్దరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. నిందితులు వెళ్లిపోయాక గిల్‌ను అతని మేనమామను చుట్టుపక్కల ఉండేవారు స్థానికంగా ఉండే జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించారు. కానీ హర్‌ప్రీత్ గిల్ అప్పటికే చనిపోయాడు. అతని మేనమామకు చికిత్స కొనసాగుతోంది.


గిల్ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు తనపై, తన మేనల్లుడిపై కాల్పులు జరిపారని గిల్ మేనమామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే దుండగులు గిల్‌పై కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ మాట్లాడుతూ.. దుండగుల కాల్పుల్లో గిల్ తలపై కుడి వైపు బుల్లెట్ గాయాలు అయినట్లు తెలిపారు. బుల్లెట్ తల కుడి వైపు, చెవి వెనుక నుంచి లోపలికి వెళ్లి మరొక వైపు నుంచి బయటికి వెళ్లిందని చెప్పారు. మృతుడి మేనమామ భజన్‌పురా నివాసి కాగా, ఆ ప్రాంతంలో అతనికి ఓ తినుబండారం దుకాణం ఉంది.

ఇదే ప్రాంతానికి చెందిన ఓ ముఠా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో యాక్టివ్‌గా ఉందని, నగరంలో పెద్ద డాన్ కావాలనే కోరికతో ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఆయుధాలతో తమ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా సమీర్, అకా మాయ అనే వ్యక్తులు వీడియోలు పెట్టినట్లు పేర్కొన్నారు. సమీర్‌కు(Samir) ప్రస్తుతం 19 ఏళ్లు ఉంటాయని, మైనర్‌గా ఉన్నప్పుడే అతడిపై హత్యతో సహా 3 కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక ఈ ఘటనపై సీసీ కెమెరాల(CCTV cameras) ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటన తరువాత వారు పారిపోయిన మార్గాలను కూడా ట్రాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-08-30T15:41:18+05:30 IST