Karnataka : నోట్ల కట్టలతో పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యేపై అధిష్ఠానం ఆగ్రహం!

ABN , First Publish Date - 2023-03-08T18:13:28+05:30 IST

నోట్ల కట్టలతో పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప పై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉంది.

Karnataka : నోట్ల కట్టలతో పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యేపై అధిష్ఠానం ఆగ్రహం!
Karnataka BJP MLA Virupakshappa

బెంగళూరు : నోట్ల కట్టలతో పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప (Madal Virupakshappa)పై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉంది. కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) నుంచి ముందస్తు బెయిలు పొందిన తర్వాత భారీ ప్రదర్శనతో తన నియోజకవర్గానికి వెళ్ళడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవినీతి ఆరోపణల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని హెచ్చరించింది.

విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కార్యాలయంపై లోకాయుక్త పోలీసులు మార్చి 2న దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రూ.8 కోట్లు నగదు పట్టుబడింది. ప్రశాంత్ బెంగళూరు వాటర్ సప్లయ్ అండ్ సెవరేజ్ బోర్డ్ (Bangalore Water Supply & Sewerage Board)లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) చైర్మన్‌గా వ్యవహరించేవారు. ఈ కంపెనీకి కెమికల్ ఆయిల్ సరఫరా టెండరు మంజూరు కోసం ప్రశాంత్ ఓ సంస్థ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు. దీంతో విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆచూకీ లేకుండా పోయారు. కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేశారు. ముందస్తు బెయిలు మంజూరవడంతో ఈ నెల 7న అట్టహాసంగా తన అనుచరులతో కలిసి తన నియోజకవర్గానికి (చన్నగిరికి) వెళ్లారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవినీతి ఆరోపణల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని బీజేపీ (BJP) భావిస్తోంది. లోకాయుక్త (Lokayukta) పోలీసులకు చిక్కి, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ, భారీగా జన సమీకరణ చేసి, తన నియోజకవర్గానికి వెళ్లిన విరూపాక్షప్పపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి సంబరాలు జరుపుకోవద్దని ఆయనను హెచ్చరించింది.

ఇదిలావుండగా, పార్టీ నుంచి తనను బహిష్కరిస్తారని విరూపాక్షప్ప భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకాయుక్త పోలీసులు పట్టుకున్న సొమ్ము తనదేనని, దీనికి అవసరమైన అన్ని ఆధారాలను తాను చూపిస్తానని ఆయన మంగళవారం మీడియాకు చెప్పారు. తనకు అరెకనట్ తోటలు, అరెకనట్ మండీ, స్టోన్ క్రషర్లు, ఇతర వ్యాపారాలు ఉన్నాయని చెప్పారు. దర్యాప్తునకు అవసరమైన అన్ని రికార్డులను తాను సమర్పిస్తానని చెప్పారు. ఈ ఆరోపణల నుంచి తాను నిష్కళంకంగా బయటపడతానని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

DU women’s hostel : హోళీ సంబరాలపై ఆంక్షలు... ఢిల్లీ విద్యార్థినుల నిరసన...

China Vs Taiwan : చైనా ఇలాంటి యుద్ధం మొదలెడుతుందని ఎవరూ ఊహించలేదు!

Updated Date - 2023-03-08T18:13:28+05:30 IST