Share News

Congress: నటి ఖుష్బూ క్షమాపణ చెప్పాల్సిందే..

ABN , First Publish Date - 2023-11-29T08:16:01+05:30 IST

దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, నటి ఖుష్బూ(Actress Khushboo) తీరును ఖండిస్తూ ఆమె

Congress: నటి ఖుష్బూ క్షమాపణ చెప్పాల్సిందే..

- కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ధర్నా

- 100 మంది అరెస్టు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, నటి ఖుష్బూ(Actress Khushboo) తీరును ఖండిస్తూ ఆమె నివాస ప్రాంతంలో మంగళవారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. టీఎన్‌సీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎంపీ రంజన్‌కుమార్‌ నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో ఖుష్బూ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఖుష్బూ ఫొటోలను చీపురుకట్టలతో కొట్టి ఆమె వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నటి త్రిష గురించి విలక్షణ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన విమర్శలను ఖండిస్తూ ఖుష్బూ తన ఎక్స్‌ పేజీలో ప్రకటన వెలువరించారు. ఆ ప్రకటనను ఖండించిన నెటిజన్‌పై ఖుష్బూ మండిపడుతూ అతడి భాష ‘చేరి భాష’ (దళిత కాలనీవాసుల భాష)గా ఉందన్నారు. ఖుష్బూ ఇలా దళితులు మాట్లాడే భాషను కించపరిచారంటూ టీఎన్‌సీసీ నేతలు, ప్రత్యేకించి ఎస్సీ విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖుష్బూ వెంటనే బహిరంగంగా క్షమాపణలు తెలుపాలని, లేకుంటే ఆమె నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే ఖుష్బూ... ఫ్రెంచి భాషలో చేరి అనే పదానికి ‘ప్రియత్వం’ అని అర్థమని దళితులను కించపరిచే విధంగా తాను ఆ పదాన్ని ఉపయోగించలేదని సమర్థించుకున్నారు. అయినప్పటికీ ఎస్సీ విభాగ నాయకులు నెమ్మదించలేదు.

nani5.2.jpg

ఈక్రమంలో టీఎన్‌సీసీ ఎస్సీ విభాగం నాయకులు మంగళవారం ఉదయం స్థానిక శాంథోమ్‌ హైరోడ్డులోని ఖుష్బూ నివాసం ఎదుట కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అయితే అప్పటికే అక్కడ భద్రతా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఆమె నివాసగృహం వైపువెళ్ళకుండా అందరినీ అడ్డుకున్నారు. దీనితో ఖుష్బూ ఇంటి పక్కనున్న దారిలో ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అనుగుండు ఆరుముగం, కార్యదర్శి విజయశేఖర్‌, జిల్లా శాఖ నేతలు దురై, మయిలై ధరణి, ఉమాబాలన్‌, నిలవన్‌, వై ప్రభా, మీరా సరళా తదితరులు పాల్గొన్నారు. ఖుష్బూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె దిష్టిబొమ్మను తగులబెట్టి, ఫొటోలను చీపుర్లతో, చెప్పులతో కొట్టారు. అంతేకాకుండా పేడ అలికారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని బలప్రయోగంతో కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం సభ్యులు, కార్యకర్తలు సహా 100 మందిని అరెస్టు చేసి, వ్యాన్లలో తరలించారు. ధర్నాకు నాయకత్వం వహించిన రంజన్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ... ఖుష్బూకు వ్యతిరేకంగా జరిపిన ఆందోళన విజయవంతమైందని, ఆమె భేషరతుగా క్షమాపణలు చెప్పేంతవరకూ ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు.

ప్రచారం కోసమే ధర్నా: ఖుష్బూ

చేయని తప్పుకు క్షమాపణలు తెలిపే ప్రసక్తే లేదని, కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు తమ ప్రచార ఆర్భాటాల్లో భాగంగానే తనకు వ్యతిరేకంగా ధర్నా జరిపారని ఖుష్బూ అన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ధర్నా ముగిసిన తర్వాత ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఖుష్బూ విలేకరులతో మాట్లాడారు. తన ఇంటి ముందు ధర్నా జరిపితే పార్టీకి రెండు రోజులపాటు ప్రసార మాధ్యమాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుందనే ఆశతోనే కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం నాయకులు ఆందోళన జరిపారని చెప్పారు. 1986లో తమిళసీమలో అడుగపెట్టానని, ఈ భూమి తన సొంతమని, అన్ని కులాల వారిని తాను సమానంగానే పరిగణిస్తానని తెలిపారు. గతంలో డీఎంకే నేతలు తనను అవమానించేలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ కాంగ్రెస్‌ ఎస్సీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నించారు. తప్పుచేస్తే తనకంటే పిన్నవయస్సు కలిగినవారికి కూడా క్షమాపణలు చెబుతానని, అయితే చేయని తప్పుకు ఎలా క్షమాపణలు చెప్పగలనని ఆమె ప్రశ్నించారు.

Updated Date - 2023-11-29T08:16:03+05:30 IST