Deve Gowda: 'జనతా ఫ్రీడం ఫ్రంట్' కోసం నితీష్ నన్ను సంప్రదించారు: దేవెగౌడ

ABN , First Publish Date - 2023-10-03T15:24:45+05:30 IST

మాజీ జనతాదళ్ పార్టీలతో కలిసి ''జనాతా ఫ్రీడం ఫ్రంట్'' ఏర్పాటు కోసం నాలుగు నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ తనను సంప్రదించినట్టు జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు.

Deve Gowda: 'జనతా ఫ్రీడం ఫ్రంట్' కోసం నితీష్ నన్ను సంప్రదించారు: దేవెగౌడ

బెంగళూరు: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి బీజేపీతో పొత్తుకు అవగాహన కుదుర్చుకున్న జేడీఎస్‌ సంచలన విషయం వెల్లడించింది. మాజీ జనతాదళ్ పార్టీలతో కలిసి ''జనాతా ఫ్రీడం ఫ్రంట్'' ఏర్పాటు కోసం నాలుగు నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) తనను సంప్రదించినట్టు జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదన్నారు.


''నితీష్ నాలుగు నెలల క్రితం జనతాదళ్ ఫ్రీడం ఫ్రంట్ ప్రతిపాదనతో సంప్రదించారు. నాకు ఇష్టం లేదని చెప్పాను. జాతీయ స్థాయి పదవులపై ఆసక్తి లేదని కూడా చెప్పాను. ఇప్పుడు నా వయస్సు 91. కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా వంచనకు పాల్పడిందో చూశాను. ఈ వయసులో ఎలాంటి ప్రయోగాలు చేయాలని నేను కోరుకోవడం లేదు'' అని దేవెగౌడ చెప్పారు. జనతాదళ్ నుంచి విడిపోయి సొంత గ్రూపులు పెట్టుకున్న పార్టీలన్నింటిని కలుపుకొని జనతా ఫ్రీడం ఫ్రెంట్ ఏర్పాటు చేసే ఆలోచన నితీష్ కుమార్‌కు ఉండేదని, ఆ ప్రతిపాదననే మూడు-నాలుగు నెలల క్రితం తన ముందుకు తెచ్చారని చెప్పారు. తనను ఒప్పించేందుకు నితీష్ ఆయన పార్టీ అధ్యక్షుడు, సీనియర్ లీడర్లను పంపారని, అయితే తాను వారి ప్రతిపాదనను తోసిపుచ్చానని చెప్పారు. ఈ ప్రతిపాదనతో ముందుకు వెళ్లాలంటే ముందుగా మిగతా పార్టీలను కూడా సంప్రదించాల్సి ఉంటుందని తాను సూచించినట్టు చెప్పారు. 'ఇండియా' కూటమి గురించి జేడీఎస్‌తో కాంగ్రెస్ సంప్రదించలేదని కూడా దేవెగౌడ తెలిపారు.


సిద్ధరామయ్య వ్యాఖ్యలపై..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై దేవెగౌడ మండిపడ్డారు. రాజకీయాల్లోకి ఆయనను తీసుకువచ్చిందే తానని అన్నారు. ఇంతకంటే తాను మాట్లాడదలచుకోలేదని, తాను ఎంతో బాధకు గురయ్యానని చెప్పారు. బీజేపీకి బీ-టీమ్‌గా జేడీఎస్‌ను రాహుల్ గాంధీ పోల్చడం ఇది రెండో సారని విమర్శించారు. 2018లోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారని అన్నారు. ఆయన నుంచి తమకు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదన్నారు. జేడీఎస్ సెక్యులర్ పార్టీ అని, సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే వాళ్ల నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మైనాటిరీలు, ఇతర అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ గురించి తమకు బాగా తెలుసునని, అంతకుమించిన అనుభవం ఉందని అన్నారు. తాను పెద్దపెద్ద మాటలు చెప్పనని, 60 ఏళ్ల రాజకీయాల్లో తన సత్తా చాటుకున్నానని, ముస్లింలే కాకుండా ఏ మైనారిటీ గ్రూపును తాము తక్కువగా చూడలేదని చెప్పారు. కాగా, ఇటీవల ఏర్పడిన విపక్ష కూటమి 'ఇండియా' బ్లాక్‌లో జేడీయూ, కాంగ్రెస్‌తో పాటు గతంలోని జనతాదళ్ పార్టీలుగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి ఉన్నాయి.

Updated Date - 2023-10-03T15:24:45+05:30 IST