Modi Vs Pawar : మోదీ మాటతో పార్లమెంటుకు వెళ్లాలంటే భయం : శరద్ పవార్

ABN , First Publish Date - 2023-01-07T14:54:57+05:30 IST

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Modi Vs Pawar : మోదీ మాటతో పార్లమెంటుకు వెళ్లాలంటే భయం : శరద్ పవార్
Sharad Pawar, Narendra Modi

పుణే : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘శరద్ పవార్ నా చేతిని పట్టుకుని రాజకీయాల్లోకి నడిపించారని అంగీకరించడానికి నాకు ఎటువంటి సందేహం లేదు’’ అని 2016లో ఒకరు అన్నారని, ఇటువంటి వ్యాఖ్యలు పార్లమెంటుకు వెళ్ళాలంటే భయపడేలా చేస్తున్నాయని పవార్ చెప్పారు. మహారాష్ట్రలోని పింప్రిలో శుక్రవారం జరిగిన ప్రపంచ మరాఠీ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సదస్సులో పాల్గొన్న మాజీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే (Sushil kumar Shinde) మాట్లాడుతూ, తాను పవార్ బడిలోనే రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. ఆయనకు మరాఠీలంటే చాలా ప్రేమ అని, వారి కోసం ఎప్పుడు ఏ పథకంతో వస్తారో తెలియదని చెప్పారు. మరాఠీలకు ఆయన అన్ని వేళలా సహాయపడతారన్నారు.

షిండే వ్యాఖ్యలపై పవార్ స్పందిస్తూ, ‘‘నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని షిండే చెప్పారు. నాకు భయమేస్తోంది. ఎందుకంటే, రాజకీయాల్లో ప్రవేశించడానికి నా చేతిని పట్టుకున్నానని ఒకరు గతంలో చెప్పారు. అప్పటి నుంచి పార్లమెంటులో ప్రవేశించాలంటే నాకు భయంగా ఉంది. పార్లమెంటులో అడుగు పెట్టాలంటే భయంగా ఉంది’’ అని చెప్పారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016లో పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, శరద్ పవార్ తన చేతిని పట్టుకుని రాజకీయ క్షేత్రంలో నడవటం నేర్పించారని అంగీకరించడానికి తనకు ఎటువంటి సందేహం లేదని చెప్పారు.

శుక్రవారం జరిగిన ప్రపంచ మరాఠీ సదస్సును జగ్తిక్ మరాఠీ అకాడమీ, డాక్టర్ వీవై పాటిల్ విశ్వవిద్యాలయం నిర్వహించాయి.

Updated Date - 2023-01-07T15:34:42+05:30 IST