Adani-Hindenburg case: అదానీపై విదేశీ సంస్థల రిపోర్ట్‌ను నమ్మడం ఎలా? ప్రశ్నించిన సుప్రీం
ABN , First Publish Date - 2023-11-24T19:48:16+05:30 IST
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్‌ను టార్గెట్ చేస్తూ విదేశీ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌ను నమ్మడమెలా? అని ప్రశ్నించింది. రిపోర్టును తాము తోసిపుచ్చడం లేదని, అయితే ఆధారాలు కావాలని, ఆధారాలు ఏవైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని అదేశించింది.
న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ కేసు (Adani-Hindenburg case) విచారణలో భాగంగా సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్‌ను టార్గెట్ చేస్తూ విదేశీ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌ను నమ్మడమెలా? అని ప్రశ్నించింది. రిపోర్టును తాము తోసిపుచ్చడం లేదని, అయితే ఆధారాలు కావాలని, ఆధారాలు ఏవైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ల తరఫు లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పబ్లికేషన్ వర్క్‌ను తిరుగులేని సత్యంగా భావించలేమని పేర్కొంది.
అదానీ గ్రూప్‌లో అక్రమమార్గంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని బిలియనీర్ జార్జ్ సోరోస్ స్థాపించిన ఆర్గనైడ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్టు (ఓసీసీఆర్‌పీ) ఇచ్చిన రిపోర్టు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదానీ గ్రూప్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇద్దరు విదేశీ ఇన్వెస్టర్ల చేతిలోనే ఇదంతా జరిగిందని చెప్పింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. హిండెన్‌బర్గ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని చెప్పింది. సెబీ సైతం ఈ రిపోర్టును ఖండించింది. రిపోర్టులో ఏ మాత్రం నిజం లేదని పేర్కొంది. ఓసీసీఆర్‌పీని మరింత సమాచారం కోసం తాము సంప్రదించినట్టు కూడా సెబీ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 24 అనుమానాస్పద లావాదేవీల పరిశీలన పూర్తి చేశామని, తక్కిన రెండు కేసుల్లోనూ విదేశీ ఏజెన్సీల నుంచి సమాచారం కోసం వేచిచూస్తున్నామని సెబీ తరఫున వాదించిన తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. భారత విధానాలపై విదేశీ సంస్థలు విమర్శలు చేయడం పరిపాటైందని ఆయన మండిపడ్డారు.