Women Reservation Bill: మహిళా బిల్లు బీజేపీకి రాజకీయ అంశం కాదు: అమిత్‌షా
ABN , First Publish Date - 2023-09-20T19:39:21+05:30 IST
కొన్ని పార్టీలకు మహిళా రిజర్వేజన్ బిల్లు రాజకీయ అంశం కావచ్చేమో కానీ, బీజేపీకి ఎంతమాత్రం కాదని, తమ పార్టీకి, తమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ బిల్లు మహిళా సాధికారతకు చెందిన అంశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త శకానికి ఆరంభమన్నారు.
న్యూఢిల్లీ: కొన్ని పార్టీలకు మహిళా రిజర్వేజన్ బిల్లు (Women's Reservation Bill) రాజకీయ అంశం కావచ్చేమో కానీ, బీజేపీకి ఎంతమాత్రం కాదని, తమ పార్టీకి, తమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ బిల్లు మహిళా సాధికారతకు చెందిన అంశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త శకానికి ఆరంభమని, మహిళా ప్రగతికి సంబంధించిన విజన్‌ను ప్రధాని మోదీ జి-20లో ఆవిష్కరించారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో బుధవారంనాడు జరిగిన చర్చలో అమిత్‌షా పాల్గొంటూ, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును తమ ప్రభుత్వం మంగళవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, భారత పార్లమెంటరీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు ఇదని అన్నారు. ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి మహిళా భద్రత, గౌరవం, సమప్రాధాన్యం అనేవి ప్రభుత్వానికి కీలక ప్రాధాన్యతలుగా ఉన్నాయన్నారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, విధానాల రూపకల్పనలో మహిళలకు భాగస్వామ్యాన్ని ఈ బిల్లు కల్పిస్తుందని చెప్పారు.
బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించండి..
మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలో నాలుగుసార్లు పార్లమెంటు ముందుకు తీసుకువచ్చారని, కానీ ఆమోదానికి నోచుకోలేదని, ఇది ఐదవ ప్రయత్నమని, ఇప్పుడైనా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని అమిత్‌షా కోరారు. మాజీ ప్రధాని దేవెగౌడ నుంచి మన్మోహన్ వరకూ బిల్లును తీసుకువచ్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయని, అయినా బిల్లు ఆమోదించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం జనరల్, ఎస్సీ, ఎస్టీ అనే మూడు కేటగిరిల్లో పార్లమెంటు సభ్యుల ఎన్నిక జరుగుతోందని, ఒక్కో కేటగిరిలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పారు. ఓబీసీలు, ముస్లింలకు రిజర్వేషన్ లేనందున బిల్లుకు మద్దతు ఉండకపోవచ్చంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, బిల్లుకు మీరు (ఎంపీలు) మద్దతు ఇవ్వకుంటే రిజర్వేషన్ల సత్వర అమలు సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. ''మీరు మద్దతిస్తే, కనీసం ఒక గ్యారెంటీ అయినా ఉంటుంది'' అని అమిత్‌షా సూచించారు.
ఎన్నికలు పూర్తికాగానే...
ఎన్నికలు పూర్తికాగానే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపడతామని, సాధ్యమైనంత త్వరగా లోక్‌సభలో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలును అంతా చూడగలుగుతారని అమిత్‌షా చెప్పారు.