Indian couple: భారతీయ జంటను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష.. సమర్థించిన దుబాయి కోర్టు
ABN , First Publish Date - 2023-06-17T08:02:27+05:30 IST
అరేబియా రాంచెస్‌లో (Arabian Ranches) భారతీయ జంటను చంపిన వ్యక్తికి విధించిన ఉరిశిక్షను తాజాగా దుబాయి కోర్టు సమర్థించింది.
దుబాయి: అరేబియా రాంచెస్‌లో (Arabian Ranches) భారతీయ జంటను చంపిన వ్యక్తికి విధించిన ఉరిశిక్షను తాజాగా దుబాయి కోర్టు సమర్థించింది. ఇలా దుబాయ్‌లోని కోర్ట్ ఆఫ్ కాసేషన్ భారతీయ జంటను చంపిన ఓ ఆసియా వ్యక్తికి విధించిన మరణశిక్షను సమర్థించడం జరిగింది. ఈ తీర్పును కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ జారీ చేయగా, అప్పీల్ కోర్ట్ సమర్థించింది. వివరాల్లోకి వెళ్తే.. 2020 జూన్‌లో దుబాయి పరిధిలోని అరేబియన్ రాంచెస్‌లో నివాసం ఉండే వ్యాపారవేత్త హిరేన్ అధియా (Hiren Adhiya), అతని భార్య విధి అధియాను ఓ ఆసియా వ్యక్తి చోరీకి వెళ్లి, అతి కిరాతకంగా చంపేశాడు. వారి విల్లాలోకి చొరబడిన దుండగుడు భారతీయ దంపతులను చంపేసి, అడ్డువచ్చిన వారి కూతురును గాయపరిచి 2వేల దిర్హమ్స్(రూ.44,603) ఎత్తుకెళ్లాడు.
తన పేరెంట్స్ బెడ్ రూం ముందు గుర్తుతెలియని వ్యక్తిని చూసిన కూతురు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాంతో అతడు ఆమె గొంతులో కత్తితో పొడిచి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ఘటనపై హిరేన్ కూతురు ఫోన్ ద్వారా దుబాయి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చేసరికి దంపతులిద్దరూ చనిపోయారు. బాలిక మాత్రం రక్తపుమడుగులో పడి ఉంది. ఇక సీసీటీవీ కెమెరాలోని ఫుటేజీ ద్వారా నిందితుడిని 26 ఏళ్ల ఆసియా వర్కర్‌గా పోలీసులు గుర్తించారు. అంతేగాక అతడు కొన్ని నెలల ముందు బాధితుల విల్లాలో పనిచేసినట్లు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన నిందితుడు.. తాను విల్లాలో దోపిడీకి మాత్రమే వెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.
Indian lady: భారతీయ మహిళపై దాడి కేసు.. చైనా జాతీయుడిని దోషిగా తేల్చిన సింగపూర్ న్యాయస్థానం
విల్లాలోకి చోరబడిన తర్వాత నగదు కోసం వెతకగా తనకు 2వేల దిర్హమ్స్ మాత్రమే దొరికినట్లు చెప్పాడు. వాటిని తీసుకుని బయటపడే క్రమంలో హిరేన్ దంపతులకు మెలుకువ రావడంతో వారు తనను చూసేశారని తెలిపాడు. దాంతో ఎక్కడ తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారోనని వారిని తనతో పాటు తీసుకెళ్లిన కత్తితో పొడిచి చంపేసినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో వారి కూతురు కూడా అక్కడి రావడంతో ఆమెను పొడిచి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపాడు. ఇక తన నేరాన్ని ఒప్పుకున్న నిందితుడిని పోలీసులు కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో హాజరుపరిచారు. దాంతో న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. తాజాగా ఈ శిక్షను దుబాయ్‌లోని కోర్ట్ ఆఫ్ కాసేషన్ (Court of Cassation) కూడా సమర్థించింది.