Share News

UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..

ABN , First Publish Date - 2023-10-21T07:24:55+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సందర్శకుల కోసం ఈ ఏడాది మేలో పున:ప్రారంభించిన 3నెలల కాలపరిమితితో ఇచ్చే విజిట్ వీసాను (Visit visa) మళ్లీ నిలిపివేసింది.

UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సందర్శకుల కోసం ఈ ఏడాది మేలో పున:ప్రారంభించిన 3నెలల కాలపరిమితితో ఇచ్చే విజిట్ వీసాను (Visit visa) మళ్లీ నిలిపివేసింది. మహమ్మారి కరోనా కారణంగా 2020లో ఈ మూడు నెలల వ్యవధితో కూడిన విజిట్ వీసాలను అక్కడి సర్కార్ నిలిపివేసి, వాటి స్థానంలో 60రోజుల కాలపరిమితితో కూడిన విజిట్ వీసాను తీసుకొచ్చింది. కానీ, కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో గత మే నుంచి ఈ వీసాను తిరిగి జారీ చేయడం ప్రారంభించింది. మళ్లీ ఇప్పుడు వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై యూఏఈ విజిటర్లకు మూడు నెలల విజిట్ వీసా అందుబాటులో ఉండదని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పష్టం చేశారు.

అయితే, సందర్శకులు 30 లేదా 60 రోజుల కాలపరిమితితో కూడిన వీసాలపై యూఏఈకి రావొచ్చని తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీలు వాటిని యధావిధిగా జారీ చేయడం జరుగుతుందన్నారు. కాగా, 3 నెలల వీసా ద్వారా సందర్శకులు (Visitors) యూఏఈలో 90 రోజుల వరకు బసచేసే వీలు ఉండేది. ప్రధానంగా దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఎక్కువ కాలం యూఏఈలో గడపాలనుకునే పర్యాటకులు, ఆ దేశ నివాసితుల పేరెంట్స్/ పిల్లలు/ కుటుంబ సభ్యులు, యూఏఈలో స్థిరపడాలనుకునే సందర్శకులు 3నెలల వీసా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే, యూఏఈ సర్కార్ ఇటీవల విజిటర్ల కోసం ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు చాలా తీసుకొచ్చింది. ఇప్పటికే ఇవి అమల్లోకి వచ్చేశాయి కూడా. అవేంటో ఒక లుక్కేద్దాం..

* జాబ్ వీసా: యూఏఈలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి ఉద్యోగార్ధులు ఈ కొత్త జాబ్ వీసా (Job visa)ను పొందవచ్చు. ఈ వీసాకు స్పాన్సర్ గానీ, హోస్ట్ గానీ అవసరం. ఇది బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్‌లకు, ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్‌లతో పాటు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ విభజించిన మొదటి, రెండవ, మూడవ నైపుణ్య కేటగిరీల కిందకు వచ్చే వారికి మంజూరు చేయబడుతుంది.

* బిజినెస్ వీసా: పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేకుండానే బిజినెస్ వీసా (Business visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ప్రధానంగా కావాల్సింది డిపాజిట్స్ మాత్రమే.

* చదువు/శిక్షణ కోసం వీసా: ఈ వీసా శిక్షణ, పరిశోధన కోర్సులు, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు హాజరు కావాలనుకునే వ్యక్తులు లేదా విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఈ వీసాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యా మరియు పరిశోధనా సంస్థలు స్పాన్సర్ చేసే వెసులుబాటు ఉంది. దీనికి అధ్యయనం లేదా శిక్షణ లేదా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, దాని వ్యవధి వివరాలను స్పష్టం చేస్తూ సంబంధిత సంస్థ నుండి తీసుకున్న లేఖ సమర్పించాల్సి ఉంటుంది.

* బంధువులు/స్నేహితులను సందర్శించడానికి వీసా: ఒక విదేశీయుడు యూఏఈలో పౌరుడు/నివాసి స్నేహితుడు లేదా బంధువు అయితే ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేదు.

* తాత్కాలిక వర్క్ వీసా: ప్రొబేషన్ టెస్టింగ్, ప్రాజెక్ట్ ఆధారిత పని వంటి తాత్కాలిక వర్క్ అసైన్‌మెంట్ ఉన్నవారు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అభ్యర్థులు తాత్కాలిక పని ఒప్పంద పత్రాన్ని లేదా యజమాని నుండి ఒక లేఖ, ఫిట్‌నెస్ ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

* మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా: ఐదేళ్ల కాలపరిమితో ఇచ్చే ఈ మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా (Multi-entry tourist visa)కు స్పాన్సర్ అవసరం లేదు. అలాగే 90 రోజుల వరకు యూఏఈలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. మరో 90 రోజుల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇలా ఓ వ్యక్తి ఈ వీసాతో ఆ దేశంలో 180 రోజులు ఉండొచ్చు. అయితే, దరఖాస్తుదారుడు దరఖాస్తు చేయడానికి ముందు గత ఆరు నెలల్లో తప్పనిసరిగా 4వేల డాలర్లు(రూ.3.16లక్షలు) లేదా విదేశీ కరెన్సీలలో దానికి సమానమైన బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.

* ఫ్యామిలీ వీసా: గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లలోపు మాత్రమే స్పాన్సర్ చేసే వీలు ఉండేది. తాజాగా తీసుకువస్తున్న ఈ ఫ్యామిలీ వీసా (Family visa)ద్వారా ఇప్పుడు మగ పిల్లలను 25 సంవత్సరాల వయస్సు వరకు స్పాన్సర్ చేయవచ్చు. వికలాంగ పిల్లలు కూడా ప్రత్యేక అనుమతిని పొందుతారు. అవివాహిత కుమార్తెలకు తల్లిదండ్రులు నిరవధిక సమయం వరకు స్పాన్సర్ చేయవచ్చు.

* గ్రీన్ వీసా: ఐదేళ్ల వ్యవధితో వచ్చే గ్రీన్ వీసా (Green visa) ద్వారా వీసాదారులు తమ కుటుంబ సభ్యులను స్పాన్సర్ లేదా యజమాని లేకుండా తీసుకురావడానికి అనుమతిస్తుంది. ఈ వీసా నైపుణ్యం కలిగిన కార్మికులు, స్వీయ-యజమానులు, ఫ్రీలాన్సర్లు మొదలైన వారికి వర్తిస్తుంది.

No passport, no visa: మరో స్మార్ట్ ఆలోచనతో ముందుకు వచ్చిన దుబాయ్.. ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే..


Updated Date - 2023-10-21T07:35:34+05:30 IST