OHRK BY Tatikonda Rajaiah: విధేయత, త్యాగానికి గుర్తింపు ఉంటుంది

ABN , First Publish Date - 2023-09-25T04:23:13+05:30 IST

తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah.).. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే(Station Ghanpur MLA)గా కంటే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వివాదాస్పద వీడియోలు, ఫొటోలతోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఘన్‌పూర్‌ టికెట్‌(Ghanpur ticket) రాలేదని బాధ ఉన్నా.. తన విధేయత, త్యాగానికి గుర్తింపు ఉంటుందని రాజయ్య ధీమాగా ఉన్నారు.

OHRK BY Tatikonda Rajaiah: విధేయత, త్యాగానికి గుర్తింపు ఉంటుంది

బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం ఇస్తారు

నా మాటలు, చేతలను మార్ఫ్‌ చేశారు

కడియం అనుచరులే వైరల్‌ చేశారు

నవ్య పంచాయితీ.. శ్రీహరి కుట్ర

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah.).. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే(Station Ghanpur MLA)గా కంటే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వివాదాస్పద వీడియోలు, ఫొటోలతోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఘన్‌పూర్‌ టికెట్‌(Ghanpur ticket) రాలేదని బాధ ఉన్నా.. తన విధేయత, త్యాగానికి గుర్తింపు ఉంటుందని రాజయ్య ధీమాగా ఉన్నారు. తనకు ఎంపీ టికెట్‌ లేదా ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని పార్టీ పెద్దల నుంచి హామీ వచ్చిందని చెబుతున్నారు. 15 రోజుల క్రితం జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ ('Open Heart with RK')లో రాజయ్య అనేక విషయాలపై మాట్లాడారు.

ఆర్కే: టికెట్‌ రాని బాధ నుంచి కోలుకున్నారా..?

తాటికొండ రాజయ్య: నిత్యం జనంలో ఉంటా. అలాంటిది.. టికెట్‌ రాకపోతే ఎవరికి మాత్రం బాధ ఉండదు. అయినా, ఎక్కడో ఆశ ఉంది. కేసీఆర్‌ స్వయంగా చెప్పారు.. మరోసారి చెక్‌ చేసుకుని టికెట్ల కేటాయింపులో ఏవైనా మార్పులు ఉంటే ప్రకటిస్తామని. ఒక పార్టీని నమ్ముకుని విధేయంగా ఉన్నప్పుడు, త్యాగం చేసి ఒక పార్టీలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఆశ ఉంటుంది.

ఆర్కే: ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు వివాదాస్పదంగా మారారు..?

తాటికొండ రాజయ్య : వాస్తవానికి.. కడియం శ్రీహరికి, నాకు విభేదాలు. వ్యక్తిగతంగా నన్ను బాగా టార్గెట్‌ చేసేవాడు. 1999లో తొలిసారిగా పోటీ చేసి 4 వేల ఓట్లతో కడియం శ్రీహరిపై ఓడిపోయా. మా ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. 2014, 2018లో ఇద్దరం టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం పోటీపడ్డాం. అధిష్ఠానం నాకే ఇచ్చింది. నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే.. ‘వరుసగా రెండుసార్లు టికెట్‌ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తావా..? నా దారి నేను చూసుకోవాలా’ అని కడియం నుంచి సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. రాజయ్య సౌమ్యుడు ఆయనకు ఎంపీనో, ఎమ్మెల్సీనో ఇద్దామని పార్టీ అనుకున్నట్టు తెలిసింది.

2.jpg

ఆర్కే: కేటీఆర్‌ మీకు క్లాస్‌ పీకారని వార్తలొచ్చాయి కదా

తాటికొండ రాజయ్య : అలాంటిదేం లేదు. ఆయన పిలిస్తే వెళ్లాను. తొందరపడొద్దు.. టికెట్‌కు ఢోకా ఏమీ లేదని చెప్పారు. కేసీఆర్‌ ఎంపీగా వెళితే కడియం కూడా ఎంపీగా వెళతారని అన్నారు. ఎంపీ లేదా ఎమ్మెల్సీ ఇస్తామన్న సంకేతాలు కూడా పార్టీ నుంచి వచ్చాయి.

ఆర్కే: పిల్లలంతా నాకే పుట్టారని ఓసారి అన్నారు కదా..?

తాటికొండ రాజయ్య : అక్కడ నా మాటలను మార్ఫింగ్‌ చేశారు. నా దగ్గర ఓపీకి వచ్చిన పిల్లల సంఖ్య 16-18 లక్షలు ఉంటుంది. కొన ఊపిరితో ఉన్న అనేక మందికి ప్రాణం పోశా. వాళ్లంతా బతికి.. ఇవాళ నేను ఎక్కడికి వెళ్లినా స్వాగతం పలుకుతున్నారనే సందర్భంలో చెప్పాను. బర్త్‌ డే వేడుకలో స్వీట్‌ తినిపిస్తుంటే.. మార్ఫింగ్‌ చేసి దురర్థం వచ్చేలా చూపించారు. మహిళలు బొకే ఇచ్చినపుడు.. అది పట్టుకుంటే వాళ్ల చేతులు మన చేతిని తాకుతాయి కదా. చేతి వద్ద యారో మార్క్‌ పెట్టి ఏదో ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. స్కూల్‌లో పిల్లలకు అన్నం తినిపించినా.. వాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేసినా.. దురదృష్టవశాత్తు నెగెటివ్‌గా ప్రచారం చేశారు.

ఆర్కే: ఇదంతా శ్రీహరి చేశారని మీ అనుమానం..?

తాటికొండ రాజయ్య : వంద శాతం. ఆయన అనుచరులు వీటిని ఫార్వర్డ్‌ చేస్తూనే ఉంటారు. నాపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన కడియం అనుచరుడొకరు.. నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం చెందాడు. ‘సారీ అన్నా.. అటువైపు ఉన్నప్పుడు ఇవన్నీ నేనే చేశా’ అని చెప్పాడు.


ఆర్కే: సర్పంచ్‌ నవ్య వివాదం ఏంటి..?

తాటికొండ రాజయ్య : ఆ వ్యవహారాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. ఆమెను అటు పంపించిన వాళ్లు.. ఆమెకు రోజూ ఏదో ఒకటి నేర్పి, మార్చి పంపించడం వంటివి చేస్తున్నారు. చిన్న అంశాన్ని పట్టుకుని రోజుకో పది చానళ్లలో మాట్లాడుతున్నారు. నేను పారదర్శకంగా ఉన్నా. జరిగినది చిన్న అంశం. అక్కడ ఏం జరగలేదని చెప్పను. కడియం అనుచరులుగా ఉన్న నవ్య దంపతులు నావైపు వచ్చారు. దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని వాళ్ల ఊరికి తీసుకెళ్లి.. నేనే కార్యక్రమాలు చేశా. పనులు అయిపోయినా ఇంకా బిల్లులు రావట్లేదనే అసంతృప్తితో 15 రోజుల తర్వాత మళ్లీ నవ్య దంపతులు కడియం వైపు వెళ్లారు. ఎమ్మెల్యేతో ఉండటం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదని నవ్య దంపతుల అభియోగం. కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే క్రమంలో మధ్యలో లబ్ధిదారులు ఉన్నారు. సర్పంచ్‌ తనకేదీ పట్టనట్టు దూరంగా ఉన్నారు. నేను దగ్గరికి రమ్మంటే.. దగ్గరికి రమ్మంటాడని చెప్పుకుంది. వీటి వాటి వెనుక రాజకీయ కుట్ర ఉంది.

ఆర్కే: ఆమే స్వయంగా చెప్పింది కదా..?

తాటికొండ రాజయ్య : నవ్య వ్యవహారాన్ని మహిళా కమిషన్‌ రెండుసార్లు సుమోటోగా తీసుకుంది. పోలీసుల విచారణలో నా ప్రమేయం ఏదీ లేదని తెలిసింది. ఆ విషయాన్నే మహిళా కమిషన్‌కు నివేదించారు. ఇప్పుడామె ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందట. కడియం, రాజయ్య కొట్టుకుంటున్నారు కదా.. వాళ్లిద్దరూ కాదు.. తనకు టికెట్‌ ఇవ్వాలని అంటోంది. నవ్య ఎపిసోడ్‌ వెనుక కడియం ఉన్నాడు. ఆయన అనుచరులు వారికి ఆర్థికంగా సాయం చేయడం, మీడియా వాళ్లను మేనేజ్‌ చేయడం వంటి అనేక అంశాలు ఉన్నాయి.

1.jpg

ఆర్కే: మిమ్మల్ని కేసీఆర్‌ డిప్యుటీ సీఎంగా నియమించారు. ఏడు నెలలకు తీసేశారు. అప్పుడు రకరకాల కారణాలున్నాయి కదా?

తాటికొండ రాజయ్య : కేసీఆర్‌ స్వయంగా పెద్ది సుదర్శన్‌రెడ్డితో మూడుసార్లు పిలిపిస్తే.. నేను వెళ్లలేదు. నాలుగోసారి వెళ్లా. అప్పటికే రెండేళ్లు మౌనంగా ఉన్నా. అన్ని అంశాలపై నివేదికలు వచ్చాక కేసీఆర్‌ పిలిస్తే వెళ్లా. ‘ఐ యామ్‌ ఎక్సీ్ట్రమ్‌లీ సారీ రాజయ్య. చిలువలు, పలువలు చేసి చెప్పారు. నీ స్థాయి తగ్గకుండా మళ్లీ అవకాశమిస్తా’ అని చెప్పారు. ఆ రోజు ఉన్న 18 మంది మంత్రుల్లో అందరికన్నా గొప్పగా పనిచేయాలనుకోవడమే నేను చేసిన తప్పు. కాళోజీ వర్సిటీ అంశంపై వరంగల్‌లో నేను మాట్లాడినప్పుడు కేసీఆర్‌ వారించారు. ‘ఎక్కడపడితే అక్కడ హామీలు ఇస్తావ్‌. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి’ అని అన్నారు.

Untitled-1.jpg

ఆర్కే: దామోదర రాజనర్సింహతో మీ మీటింగ్‌ తర్వాత వినయ్‌ భాస్కర్‌ పరుగెత్తుకొచ్చాడు కదా

తాటికొండ రాజయ్య : తెల్లారే నా దగ్గరికి వచ్చారు. అధిష్ఠానం ఆదేశాల మేరకే వచ్చారు. నాకు ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని చెప్పారు.

ఆర్కే: మీకు టికెట్‌ ఇవ్వకపోవడానికి కారణం చెప్పారా..?

తాటికొండ రాజయ్య : 2014, 2018లో రాజయ్యకే టికెట్‌ ఇచ్చారు. ఈసారీ అదే జరిగితే తన దారి తాను చూసుకుంటానని కడియం అన్నారని తెలిసింది. సర్వేలు, నివేదికల ఆధారంగా శ్రీహరికి టికెట్‌ ఇచ్చామని చెప్పారు. కానీ, ఘన్‌పూర్‌ సర్వేల్లో నంబర్‌ వన్‌గా ఉంది. అక్కడ బీఆర్‌ఎస్‌ గెలిచే స్థితిలో ఉందంటే.. నావల్లే. కాబట్టి నివేదిక ఆధారంగా టికెట్‌ ఇవ్వలేదని తేలిపోయింది.

బీఆర్‌ఎస్‌కు విధేయుడిగా ఉన్నాను. కాంగ్రెస్‌లో ఉన్న నేను.. ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి వచ్చా. పార్టీ, నియోజకవర్గం కోసం చాలా కష్టపడ్డా. తిట్లు తిని ఉండొచ్చు.. వరంగల్‌కు హెల్త్‌ యూనివర్సిటీ ఎవరు తీసుకొచ్చారు..? రాష్ట్ర సాధనలో, జనగామ జిల్లా ఏర్పాటులో నా పాత్ర ఉంది. జిల్లా ఏర్పడటం వల్ల జనగామకు మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి వచ్చాయి.

Updated Date - 2023-10-06T17:18:06+05:30 IST