CM Jagan: బటన్ నొక్కుడుతో పనైపోతుందా?
ABN , First Publish Date - 2023-01-06T15:17:38+05:30 IST
సీఎం జగన్ ‘వై నాట్ 175’ టార్గెట్ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిజానికి 175 సీట్లు గెలవాలనుకునే లక్ష్యాన్ని పక్కనపెడితే వైసీపీకి మరో ఛాన్స్ ఎందుకివ్వాలి?, ఎందుకు గెలిపించాలి? అనే మౌలిక ప్రశ్నలకు ఆ పార్టీ దగ్గర సమాధానం లేదనే వాదనలున్నాయి.
‘‘ వై నాట్ 175’’ అంటున్నారు ఏపీ సీఎం జగన్(AP CM Jagan). ఈసారి ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లోనూ గెలవాలని కేడర్‌కు ఆయన పిలుపునిస్తున్నారు. బటన్ నొక్కుడు ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తున్నామని, ఇక మనకెందుకు ఓటేయరని ఆయన పార్టీ సమావేశాలలో తరచూ ప్రశ్నిస్తున్నారు. నిజమే ఓ పార్టీ మొత్తం సీట్లు గెలవాలనుకోవడం కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ లక్ష్యం ఆ పార్టీ మనస్తత్వానికి అద్దం పడుతోంది. ఈ లక్ష్యాన్ని చూశాకా వైసీపీకి (YCP) ప్రజాస్వామ్య (Democracy) లక్షణం అర్థం కాలేదంటున్నారు రాజకీయ నిపుణులు. బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికారపక్షం ఎలాంటి రాక్షసక్రీడలకు తెగబడుతోందో ఇప్పటికే చూస్తున్నాం. గిట్టనివారిపై అనుక్షణం పోలీసు కేసులు పెడుతూ హింసిస్తున్న అధికార పక్షానికి ఇక పూర్తి సీట్లు దక్కితే ఏపీ పరిస్థితి ఏమవుతుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి 175 సీట్లు గెలవాలనుకునే లక్ష్యాన్ని పక్కనపెడితే వైసీపీకి మరో ఛాన్స్ ఎందుకివ్వాలి?, ఎందుకు గెలిపించాలి? అనే మౌలిక ప్రశ్నలకు ఆ పార్టీ దగ్గర సమాధానం లేదనే వాదనలున్నాయి. కేవలం బటన్ నొక్కుడుతో, కులం చూడం-మతం చూడం, మనకు ఓటేశారో లేదో చూడమనే స్టాక్ డైలాగులతోనూ, దత్తపుత్రుడు, దుష్టచతుష్టయం అనే పడికట్టుపదాలతోనూ తన ప్రసంగాన్ని ముగించే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈమూడున్నరేళ్ళలో పారిశ్రామిక ప్రగతి గురించి గణాంకాలతో ఎప్పుడైనా ఎక్కడైనా వివరించగలిగారా? తాను వచ్చాక ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చాయో చెప్పగలిగారా? ఎంత పేదరికాన్ని పోగొట్టారో, ఎంతమంది సొంత కాళ్ళపై నిలబడగలిగారో చెప్పగలిగారా? పోనీ ఏపీకి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయో చెప్పగలిగారా? కులం చూడం అంటూ ఒకే కులాన్ని అదేపనిగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పగలిగారా? మాకు ఓటు వేయనివారికి కూడా పథకాలు అందిస్తామని చెప్పే సీఎం జగన్, తన సభకు రాకపోతే పెన్షన్లు కట్ చేస్తామని, ఈసారి ఓటేయకపోతే పథకాలు రావని ఎందుకు భయపెడుతున్నారో చెప్పగలిగారా? ఓ పద్ధతిప్రకారం సాగుతున్న ఇసుక పంపిణీని తోచినట్టుగా ఓ ప్రైవేటు కంపెనీకి ధారదత్తంచేసి, ఇష్టారాజ్యంగా ఇసుక విక్రయాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పగలిగారా? ఈ మూడున్నరేళ్ల పాలనలో శాంతిభద్రతలు ఎందుకు క్షీణించాయో చెప్పగలిగారా? పోలీసులు అధికారపక్షం పెట్టే కేసులపైనే పనిచేస్తున్నారు కానీ, ఇతర శాంతిభద్రతల విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో వివరించారా? మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగిపోయాయో చెప్పగలిగారా? వైసీపీ నేతల వేధింపులు, బరితెగింపులు దేనిని చూసుకొనో చెప్పగలరా? ఓ ఎంపీ నిస్సిగ్గుగా బరితెగిస్తే... ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేశారో చెప్పగలిగారా? వీటన్నింటినీ చెప్పకుండా ‘వైనాట్ 175’ అంటే ఎలా గెలుస్తారనే వైసీపీ శ్రేణుల్లోనే బోలెడంత అంతర్మథనం సాగుతోంది.
ఇక బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షాన్ని ఎవరు నిలదీయాలి? వారు చేసే తప్పులు, చెప్పే అబద్ధాలను ఎవరు ఎదిరించాలి. కేవలం నియంతృత్వ పోకడలు ఉన్నవారు మాత్రమే ఇలాంటి కోరికలు కోరుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారు తనకో బలమైన ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటారు. కానీ ఇలా అంతా నేనే ఉండాలి, అంతటా నేనే కనిపించాలనే తీరు అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది. ఇది మన రాజకీయ మౌలిక వ్యవస్థకే గొడ్డలిపెట్టు. మరి జగన్ కోరిక నెరవేరుతుందా? నిజంగానే ఏపీలో ప్రతిపక్షాలు అంత బలహీనంగా ఉన్నాయా?.. రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహించిన చర్చా కార్యక్రమాన్ని ఈ వీడియోలో వీక్షించండి.