MLA Jeevan Reddy హత్యకు కుట్ర జరుగుతోందా? పట్టుబడ్డ నిందితులకు హత్య చేసేంత సీన్ ఉందా..నిజంగానే కుట్ర జరిగిందా..?

ABN , First Publish Date - 2023-02-22T07:08:20+05:30 IST

అధికార పార్టీ ఎమ్మెల్యే మర్డర్‌ అటెంప్ట్‌ వ్యవహారం నిజామాబాద్‌లో హీట్‌ పెంచుతోంది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే

MLA Jeevan Reddy హత్యకు  కుట్ర జరుగుతోందా? పట్టుబడ్డ నిందితులకు హత్య చేసేంత సీన్ ఉందా..నిజంగానే కుట్ర జరిగిందా..?

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందా?.. ఓ గ్రామ స్థాయి ప్రతినిధి, మరో మహిళ కలిసి జీవన్‌రెడ్డిని హతమార్చాలని వ్యూహం పన్నారా?.. పోలీసులు ఔనంటూ కేసులు నమోదు చేసినా.. కొందరిలో మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా?.. ఇంతకీ.. ఎమ్మెల్యే హత్యకు నిజంగానే కుట్ర జరిగిందా?.. లేక.. వ్యక్తిగత వివాదామా?.. అసలు.. పట్టుబడ్డ వారికి అంత సీన్ ఉందా?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-3554.jpg

ఇంటికి వెళ్ళి హత్యకు ప్రయత్నించారని అభియోగం

అధికార పార్టీ ఎమ్మెల్యే మర్డర్‌ అటెంప్ట్‌ వ్యవహారం నిజామాబాద్‌లో హీట్‌ పెంచుతోంది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లోకి వెళ్ళిన ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తి తుపాకీతో హత్యకు ప్రయత్నించాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే.. సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ప్రసాద్‌గౌడ్‌ను పట్టించారు. అనంతరం పోలీసులు హత్యాయత్నం కేసుతోపాటు.. పీడీ యాక్ట్‌ నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుడు ప్రసాద్‌గౌడ్ ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం కల్లెడి గ్రామ వాసి. అతని భార్య ప్రస్తుతం కల్లెడి సర్పంచ్‌గా ఉన్నారు.

Untitled-654.jpg

గతంలో జీవన్‌రెడ్డిని బెదిరించిన ప్రసాద్‌గౌడ్‌.. ఏకంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి హత్యకు ప్రయత్నించారనేది అభియోగం. ఆ మేరకు అతని దగ్గర తుపాకీ కూడా లభించింది. తాజాగా.. నిజామాబాద్ నగరంలోని న్యూ హౌజింగ్‌ బోర్డు కాలనీలో బొంత సుగుణ అనే మహిళ ఇంట్లో 95 జిలెటిన్ స్టిక్స్‌, 10 డిటోనేటర్లు పట్టుబడడం ప్రకంపనలు రేపింది. వాటిని కూడా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కోసమే సమకూర్చినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ప్రసాద్‌గౌడ్ దాచిపెట్టాడని, అవసరాన్ని బట్టి వాడుకుందామని చెప్పినట్లు సుగుణ వెల్లడించడంతో.. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Untitled-754.jpg

బిల్లుల చెల్లింపుపై వేధించడంతో తిరుగుబాటు

నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకున్న రెండు సంఘటనలూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. బీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు భారీ స్థాయిలో కుట్ర జరిగిందనే విషయం సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించి.. జీవన్‌రెడ్డికి సెక్యూరిటీ పెంచారు. భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. అయితే.. అప్పట్లోనే ప్రసాద్‌గౌడ్ వ్యవహారంపై రకరకాల చర్చలు జరిగాయి. కల్లెడి గ్రామానికి చెందిన ప్రసాద్‌గౌడ్.. మొదట్లో బీజేపీ మద్దతుదారుడిగా ఉన్నాడు. అతని భార్య సర్పంచ్‌గా అయ్యాక గులాబీ కండువా కప్పుకున్నారు.

Untitled-42545.jpg

ఆ తర్వాత.. అభివృద్ధి పనులు, కంట్రాక్టులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలో వేధించడంతో జీవన్‌రెడ్డిపై తిరగబడ్డాడు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడు. వేధిస్తే ఊరుకోమంటూ ఖబడ్దార్ అని హెచ్చరించాడు. ఆ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్ళి జైలు పాలయ్యాడు. అయితే.. సొంత పనుల కోసం ఎమ్మెల్యేను కలవడానికి వెళ్ళాడని ప్రసాద్‌గౌడ్ కుటుంబ సభ్యులు చెప్పగా.. సీన్ ఆఫ్ అఫెన్స్ మాత్రం కుట్రపూరితంగా ఉందని పోలీసులు వెల్లడించారు. అప్పటికే.. ప్రసాద్‌గౌడ్‌పై ఇతర కేసులు, ఫిర్యాదులు ఉండడంతో పీడీ యాక్టు నమోదు చేశారు.

Untitled-254.jpg

పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని పోలీసుల భావన

మరోవైపు.. ప్రసాద్‌గౌడ్ కేసులో నిజామాబాద్ నగరానికి చెందిన బొంత సుగుణ కూడా నిందితురాలు. ప్రసాద్‌గౌడ్ కొనుగోలు చేసిన తుపాకీకి సుగుణ ఆర్థిక సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసులో రిమాండ్‌కు వెళ్ళిన సుగుణ ఇటీవలే బయటకు వచ్చారు. బయటకు వచ్చాక జీవన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో.. సుగుణ మరోమారు టార్గెట్ అయింది. ఆమెపై పోలీసులు ఓ కన్నేసి ఉంటారు. వాస్తవానికి.. సుగుణ వృత్తిరీత్యా బండలు పగులగొట్టి కంకర, ఐడర్ రాళ్ళు తయారు చేసే పనులు నిర్వహిస్తుంటారు. మాక్లూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో కొన్ని గుట్టలు పగులగొట్టే కాంట్రాక్టు పనులు కూడా చేపట్టారు. ఆ పనుల సందర్భంలోనే ప్రసాద్‌గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. సుగుణ కూడా కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడారు. దాంతో.. ప్రసాద్‌గౌడ్ కేసులో నిందితురాలిగా ఉన్న సుగుణపై నిఘా పెంచడంతో గుట్టు రట్టు అయింది. ఎమ్మెల్యేపై మందుపాతరలతో దాడి చేయాలనే వ్యూహం పన్నిన కేసులో సుగుణను అరెస్టు చేశారు. అలాగే.. ప్రసాద్‌గౌడ్ మాదిరిగానే సుగుణపైనా పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Untitled-150.jpg

వ్యక్తిగత వివాదమా?, రాజకీయ పరిణామమా?

ఇదిలావుంటే.. హత్యాయత్నాలు, మారణాయుధాలు, మందుపాతరలు, కేసుల విషయాలు ఎలా ఉన్నప్పటికీ నిందితులిద్దరికీ అంత సీన్ ఉందా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రసాద్‌గౌడ్ ఓ గ్రామ స్థాయి ప్రతినిధి కావడం, సుగుణ ఓ సాధారణ మహిళ కావడంతో జరుగుతున్న పరిణామాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వారనుకున్న పని చేయాలనుకుంటే ఎంత బలం, బలగం ఉండాలనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. వారి బ్యాక్ గ్రౌండ్ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఏకంగా.. ఓ ఎమ్మెల్యేను హత్య చేయాలనుకునే వ్యూహానికి మూలం ఎక్కడుందో తేల్చాల్సి ఉంది. అదే సమయంలో.. వ్యవహారమంతా వ్యక్తిగత వివాదమా?.. రాజకీయ పరిణామమా? అనేది కూడా అందరినీ ఆలోచింపజేస్తోంది. మొత్తంగా.. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు వ్యవహారం రకరకాల అనుమానాలకు తావిస్తోంది. నిజామాబాద్‌ బీఆర్ఎస్‌లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో.. కేసులోని అనుమానాలకు పోలీసులు ఎలా చెక్‌ పెడతారో చూడాలి మరి.

Untitled-90.jpg

Updated Date - 2023-02-22T07:10:01+05:30 IST