YS Sharmila: షర్మిల, విజయమ్మ పయనం ఎటో వైఎస్ జయంతి చెప్పేసిందా..?

ABN , First Publish Date - 2023-07-08T18:46:08+05:30 IST

వైఎస్ జయంతి సందర్భంగా సందేహాలను పటాపంచలు చేస్తూ ఒక పరిణామం చోటుచేసుకుంది. నేడు (జూలై 8, 2023, శనివారం) వైఎస్‌ఆర్ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ పరిణామంతో మొత్తానికో క్లారిటీ వచ్చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

YS Sharmila: షర్మిల, విజయమ్మ పయనం ఎటో వైఎస్ జయంతి చెప్పేసిందా..?

వైఎస్ రాజశేఖరరెడ్డి. తుది శ్వాస వరకూ హస్తం పార్టీలోనే కొనసాగిన కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్‌లోనే అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత. హెలికాఫ్టర్ ప్రమాద దుర్ఘటనలో వైఎస్‌ఆర్ కాలం చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం నెలకొన్న అనూహ్య పరిణామాల కారణంగా వైఎస్‌ఆర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. వైఎస్ జగన్ వైసీపీ పార్టీని స్థాపించడం, 2014లో ఓటమి పాలవడం, 2019లో అధికారాన్ని చేజిక్కించుకోవడం.. ఇదంతా చరిత్ర. వైఎస్ జగన్‌తో విభేదాలు, వైఎస్సార్‌టీపీ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ.. ఇది వర్తమానం. కానీ.. వైఎస్ కుటుంబంలో తాజాగా నెలకొన్న పరిణామాలను గమనిస్తే.. భవిష్యత్‌లో మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి రాజశేఖరరెడ్డి కుటుంబం ముందుకు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.


వైఎస్ షర్మిలకు, కాంగ్రెస్‌కు మధ్య అవగాహన కుదిరిందని గత కొన్ని రోజులుగా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అనంతరం డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ, వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు ఇటీవల షర్మిల గురించి చేసిన వ్యాఖ్యలు.. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం కావడం ఖాయమనే వాదనలకు బలం చేకూర్చాయి. తాజాగా.. వైఎస్ జయంతి సందర్భంగా సందేహాలను పటాపంచలు చేస్తూ, ఈ వాదనలకు మరింత బలం చేకూర్చుతూ ఒక పరిణామం చోటుచేసుకుంది. నేడు (జూలై 8, 2023, శనివారం) వైఎస్‌ఆర్ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఒక ట్వీట్ చేశారు.

‘‘కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం జీవితాంతం కష్టపడిన ఒక విజనరీ లీడర్. ఆయన సదా చిరస్మరణీయుడు’’ అని రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్‌కు.. వైఎస్‌ఆర్ తనయురాలు, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల బదులిచ్చారు.

‘‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మీ ఆప్యాయతతో కూడిన మాటలకు ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారూ. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్సార్. ఆయన సంక్షేమాన్నే ప్రస్తుతం దేశమంతా అవలంబిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్’’ అని షర్మిల ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.


ఒక దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని ఆయన జయంతి రోజు రాహుల్ గాంధీ జ్ఞప్తికి తెచ్చుకోవడంలో రాజకీయం లేకపోవచ్చు. రాహుల్ గాంధీకి షర్మిల బదులివ్వడంలో కూడా రాజకీయం లేకపోవచ్చు. కానీ.. రాహుల్ గాంధీ నాయకత్వం గురించి షర్మిల ట్వీట్‌లో ప్రస్తావించడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. వైఎస్ కుటుంబం.. మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిల, విజయమ్మ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారనే ప్రచారానికి మరింతగా షర్మిల ట్వీట్ అవకాశం ఇచ్చింది. అయితే.. కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్టీపీ కలిసిపోతుందా.. లేక రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? అన్నదే తేలట్లేదు. దీంతో తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలన తేవడమే లక్ష్యంగా షర్మిల ఏర్పాటు చేసిన పార్టీ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినా కొద్ది నియోజకవర్గాల్లోనే పార్టీ ప్రభావం చూపుతుందన్న విషయం గ్రహించిన షర్మిల.. కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్టీపీ విలీన ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాల సమాచారం.

Sharmila-and-YSR.jpg

కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు సంబంధించి అధిష్ఠానం సూచన మేరకు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆమెతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం చేసే ప్రతిపాదనకూ షర్మిల అంగీకారం తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తుండగా.. తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలోనేనంటూ షర్మిల చెబుతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ పెద్దలతో షర్మిల టీమ్‌ సంప్రదింపులు గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి.

ys-sharmila-vijayamma.jpg

వైఎస్‌ఆర్‌ సతీమణి, షర్మిల తల్లి విజయలక్ష్మి అభ్యంతరాల నేపథ్యంలోనే చిక్కుముడి వీడట్లేదని పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే తన భవిష్యత్తు తెలంగాణలోనే అంటూ షర్మిల ప్రకటించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. తాజాగా రాహుల్ ట్వీట్, షర్మిల రెస్పాన్స్ తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టమైందని, పొత్తో.. విలీనమో పక్కన పెడితే వైఎస్ఆర్ వారసురాలు కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-07-08T19:02:47+05:30 IST