Leopard: చిరుత వయసు ఏడాది.. బావిలో పడ్డాక ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-15T20:12:32+05:30 IST

ఎలా పడిందో ఏమో కానీ ఏడాది వయసున్న ఓ చిరుత పులి లోతైన బావిలో పడింది. బయటపడే అవకాశం లేక గట్టిగా గాండ్రించడం మొదలుపెట్టింది.. ఆ తర్వాత..

Leopard: చిరుత వయసు ఏడాది.. బావిలో పడ్డాక ఏం జరిగిందంటే..

మంగళూరు: ఎలా పడిందో ఏమో కానీ ఏడాది వయసున్న ఓ చిరుత పులి లోతైన బావిలో పడింది. బయటపడే అవకాశం లేక గట్టిగా గాండ్రించడం మొదలుపెట్టింది. దీంతో బావిలోని చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించినప్పటికీ బయటకు తీసుకురావడం సాధ్యపడక చిన్నపాటి ఆపరేషనే చేపట్టాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది?. చిరుతను ఎలా రక్షించారో తెలియాలంటే పూర్తి వివరాల్లో వెళ్లాల్సిందే.

కర్ణాటకలోని (Karnataka) నిద్దొడ్డి (Niddodi) ప్రాంతంలో ఏడాది వయసున్న ఓ చిరుత బావిలో పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఫారెస్ట్ అధికారులు చిరుతను గుర్తించేందుకు ప్రయత్నించారు. బోనులో బంధించేందుకు ప్రయత్నించారు. కానీ లోతైన బావి కావడంతో అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. చేసేదేమీ లేక వణ్యప్రాణుల నిపుణరాలు డా.యశస్వి నరవి సారధ్యంలో రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. యశస్వి నరవికి డా.మేఘన, డా.పృద్వీ, డా.నఫిసా సహకారం అందించారు. బావి చాలా లోతుగా ఉండడం, బావిలో గుహ లాంటి ప్రదేశంలో దాక్కోవడంతో బయటకు తీసుకురావాలంటే చిరుతను అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లాలని ఈ బృందం నిర్ణయించింది.

Untitled-8.jpg

ప్లానింగ్ ప్రకారం.. మత్తు మందు, తుపాకీతో డా.మేఘన కూర్చున్న ఓ బోనును(Cage) తాళ్ల సాయంతో బావిలోకి దింపారు. అనంతరం తుపాకీ సాయంతో చిరుతకు మత్తు మందు ఇచ్చారు. చిరుత అపస్మారక స్థితిలోకి తీసుకోవడంతో పని సులభమైపోయింది. చిరుతను బోనులోకి లాగి బావి నుంచి పైకి తీసుకొచ్చారు. అనంతరం దానిని అడవిలో వదిలిపెట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు స్థానికులు, ఫారెస్ట్ సిబ్బంది సహకారం అందించారు. ఆ విధంగా బావిలో పడ్డ ప్రాణాలతో బయటపడింది.

Updated Date - 2023-02-15T20:17:10+05:30 IST