Auto Driver: ఆటో డ్రైవరే కానీ.. ఇంజనీర్లు కూడా అవాక్కయ్యేలా అద్భుతాన్నే చేసేశాడు.. పెట్రోలే అక్కర్లేని ఆటో రెడీ..!
ABN , First Publish Date - 2023-07-22T15:30:48+05:30 IST
కొందరు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు అదే వీడియోలు చూస్తూ వివిధ నేరాలకు పాల్పడుతూ చివరకు జైలుపాలవుతున్నారు. ఇంకొందరు ఇదే వీడియోల సాయంతో వినూత్న ఆవిష్కరణలు చేసి..
కొందరు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు అదే వీడియోలు చూస్తూ వివిధ నేరాలకు పాల్పడుతూ చివరకు జైలుపాలవుతున్నారు. ఇంకొందరు ఇదే వీడియోల సాయంతో వినూత్న ఆవిష్కరణలు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ పెట్రోల్, డీజిల్ అవసరం లేని ఆటోను సిద్ధం చేశాడు. ఇతడి గురించి తెలుసుకున్న వారు.. ‘‘ఆటో డ్రైవరే కానీ.. ఇంజనీర్లు కూడా అవాక్కయ్యేలా అద్భుతాన్నే చేసేశాడు’’.. అంటూ అభినందిస్తున్నారు. ఇతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశా (Odisha) రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar) పరిధికి చెందిన ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వార్త సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. 35 ఏళ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి 15ఏళ్లుగా భువనేశ్వర్‌లో ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆటో మీద వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి ఎనిమిదో తరగతి చదువుతున్న కూతురు ఉంది. అయితే డీజిల్, మిగతా ఖర్చులు పోనూ రోజూ 300నుంచి 400దాకా మాత్రమే వస్తుండడంతో కుటుంబం గడవడం కష్టమైంది. పిల్లలను చదివించడం మరింత భారంగా మారింది. దీంతో చివరకు ఏడాదిన్నర కిందట ఎలక్ట్రిక్ ఆటో (Electric auto) కొన్నాడు. దీంతో సమస్యలు తీరతాయనుకుంటే.. అందుకు విరుద్ధంగా మరింత ఎక్కువయ్యాయి. బ్యాటరీ చార్జింగ్ సమస్యతో (Battery charging problem) ఆదాయం రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది.
దీంతో శ్రీకాంత్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలబ్బా... అని ఆలోచిస్తున్న సమయంలో అతడి కూతురు ఓ మాట చెప్పింది. ‘‘ఎలక్ట్రిక్ ఆటోలను సోలార్ ఆటోలుగా మార్చే వీలుంది.. ఓ సారి య్యూటూబ్ చూడండి డాడీ’’.. అని చెప్పడంతో శ్రీకాంత్ ఆ దిశగా దృష్టి పెట్టాడు. రోజూ య్యూటూబ్ వీడియోలు చూస్తూ ఆటోకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై అవగాహన పెంచుకున్నాడు. సొంతంగా వస్తువులు తెచ్చుకుని చివరకు తన ఎలక్ట్రిక్ ఆటోను కాస్తా.. సోలార్ ఆటోగా (Solar Auto) మార్చాడు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు నడుస్తుందని శ్రీకాంత్ చెబుతున్నాడు. ప్రస్తుతం రోజుకు రూ.1300-1500 వరకు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవని శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కాగా, ఇతడికి సంబంధించిన వార్త (Viral news) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.