UP Police: వావ్.. షారూఖ్ 'జవాన్' గెటాప్ను ట్రాఫిక్ పోలీసులు భలే వాడారుగా..!
ABN , First Publish Date - 2023-09-10T12:56:21+05:30 IST
తమిళ యువ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్షా, కింగ్‌ఖాన్ షారూఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీ (Jawan Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కుమ్మేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళ యువ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్షా, కింగ్‌ఖాన్ షారూఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీ (Jawan Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఐదేళ్ల పాటు సరియైన హిట్ లేని షారూఖ్‌కు 2023 బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'పఠాన్' సూపర్ హిట్ కాగా, ఇప్పుడు 'జవాన్' రూపంలో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బాద్షా ఆనందానికి హద్దుల్లేవు.
ఇదిలాఉంటే.. జవాన్ మూవీలో షారూఖ్ తలకు కట్లుకట్టుకుని కనిపించిన గెటాప్ సినిమా విడుదల కంటే ముందే బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే గెటాప్ను ఉత్తర ప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కూసింత వెరైటీగా వాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ద్విచక్రవాహనాలను డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం ఎంతో ముఖ్యమో తెలియజేస్తూ షారూఖ్ గెటాప్ను వాడారు. హెల్మెట్‌ను, తలకు కట్లతో ఉన్న షారూఖ్ ఫొటోను పక్కపక్కన ఉంచి ఒక పోస్టర్ రెడీ చేశారు. షారూఖ్ ఫొటోపై 'ఇలాంటి పరిస్థితిని నుంచి తప్పించుకోవాలంటే'.. హెల్మెట్ ఫొటోపై 'దీన్ని ధరించండి' అని రాశారు.
ఆ తర్వాత ఈ పోస్టర్‌ను యూపీ పోలీస్ విభాగం తన అధికారిక ట్విటర్ ఖాతా (ఎక్స్-x) ద్వారా పంచుకుంది. దీనికి "యువతైనా, వృద్ధులైనా ఎవరైనా సరే ద్విచక్రవాహనాలపై కూర్చునే ముందు హెల్మెట్ ధరించడం మరిచిపోకండి" అనే క్యాప్షన్ జోడించింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 1.2 మిలియన్ల వ్యూస్, 49వేలకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.