Share News

India vs Australia final: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డులు బద్ధలయ్యే ఛాన్స్..

ABN , First Publish Date - 2023-11-19T09:11:47+05:30 IST

మరికొన్ని గంటల్లో ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. వరల్డ్ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ఎగరేసుకు పోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతున్నాయి.

India vs Australia final: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డులు బద్ధలయ్యే ఛాన్స్..

అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. వరల్డ్ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ఎగరేసుకు పోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతున్నాయి. మరి ఎవరు గెలవబోతున్నారనే విషయాన్ని పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్ధలుకానున్నాయి. ఆ రికార్డులు ఏంటో మీరూ ఓ లుక్కేయండి..

1. ప్రత్యక్షంగా అత్యధికమంది వీక్షించనున్న ఫైనల్

2015లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియాల్లో ఒకటైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌ను 93,000 మంది ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌ను ఏకంగా 1,32,000 మంది ప్రేక్షకులు స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఫైనల్ మ్యాచ్‌ను ఈ విధంగా రికార్డు స్థాయిలో వీక్షించడం ఇదే మొదటిసారి కానుంది.

2. ఫైనల్లో అత్యధిక టార్గెట్ బ్రేక్ అయ్యే ఛాన్స్

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 259 పరుగులు చేసింది. ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇది అత్యధిక జట్టు స్కోరుగా మిగిలిపోయింది. ఈ రికార్డు ఆదివారం జరిగే ఫైనల్లో బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు 350కి పైగా స్కోర్లు చేశాయి. ఇరు జట్ల ఫామ్ దృష్ట్యా 359 పరుగుల రికార్డును అధిగమించే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

3. ప్రపంచకప్ ఫైనల్లో అతిపెద్ద విజయం నమోదయ్యే ఛాన్స్

2003 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో గెలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక తేడాతో గెలిచిన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ప్రస్తుతం ఇరు జట్లు అద్భుతంగా రాణిస్తుండడం, మొదటి బ్యాటింగ్ చేసే జట్టుకు బ్యాటింగ్ సానుకూలంగా ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో అత్యధిక పరుగుల తేడాతో విజయం నమోదవ్వొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

4. ప్రపంచకప్ ఫైనల్‌లో అత్యల్ప స్కోరు

ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ చేసిన 132/10 స్కోరు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యల్ప స్కోరుగా ఉంది. ఈ ఎడిషన్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో ఆస్ట్రేలియాను అంతకంటే తక్కువ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో. ఈ టోర్నీ లీగ్ దశలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లను మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా‌తోపాటు మహ్మద్ సిరాజ్ వణించిన విషయం తెలిసిందే. కాబట్టి ఆస్ట్రేలియా 132 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యే అవకాశం లేకపోలేదని క్రికెట్ నిపుణులు గుర్తుచేస్తున్నారు.


5. ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 149 పరుగులుగా ఉంది. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ 2007 వరల్డ్ కప్‌లో ఈ రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ ఇన్నింగ్స్ శ్రీలంక నుంచి కప్‌ను దూరం చేసింది.

6. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

1979 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ జోయెల్ గార్నర్ ఇంగ్లండ్‌పై 38 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా ఉన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్‌లో పిచ్‌ టర్న్‌ను బట్టి ఈ రికార్డు బద్ధలయ్యే అవకాశాలు లేకపోలేదు.


Untitled-8.jpg

విరాట్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే

- ఆస్ట్రేలియాపై గెలిచి టీమిండియా వరల్డ్ కప్‌ను సాధిస్తే విరాట్ కోహ్లీ పేరిట అరుదైన రికార్డ్ నమోదు కానుంది. ఆస్ట్రేలియాపై సాధించిన ప్రపంచకప్ టైటిల్స్ రెండుసార్లు జట్టు సభ్యుడిగా ఉన్న తొలి ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. విరాట్ కోహ్లీ 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.క్రికెట్ వరల్డ్ కప్ 2023లో కూడా కోహ్లీ అత్యధిక పరుగులు సాధించాడు. 10 మ్యాచ్‌లలో 711 పరుగులతో, ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. 2003 ఎడిషన్‌లో టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి మరో 89 పరుగులు జోడిస్తే, ఒకే ఎడిషన్‌లో 800కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కవచ్చు.

- విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 4 ప్రపంచకప్‌ ఎడిషన్లు ఆడాడు. మొత్తం 1741 పరుగులు నమోదు చేశాడు. కోహ్లీ ఆదివారం 2 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ 1743 ప్రపంచ కప్ పరుగుల రికార్డును బద్ధలు కొట్టనున్నాడు. కాగా ఈ జాబితాలో 2,278 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.

షమీని ఊరిస్తున్న రికార్డులు

ప్రపంచ కప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన వీరుల్లో ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్ (68), మిచెల్ స్టార్క్ (58), లసిత్ మలింగ (56), వసీం అక్రమ్ (55) వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ ప్రపంచ కప్‌లో 6 మ్యాచ్‌ల్లోనూ 23 వికెట్లు తీసిన షమీ వరల్డ్ కప్‌లలో మొత్తం వికెట్ల సంఖ్యను 54కు పెంచుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో తీసే వికెట్లను బట్టి ఈ జాబితా టాప్-5లో మహ్మద్ షమీ అడుగుపెట్టనున్నాడు.

Updated Date - 2023-11-19T09:12:49+05:30 IST