Murali Vijay: టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-01-30T18:43:30+05:30 IST

టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్(Murali Vijay) క్రికెట్‌కు

Murali Vijay: టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ కీలక నిర్ణయం

చెన్నై: టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్(Murali Vijay) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మురళీ విజయ్ 87 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 4,490 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఎక్కువ మ్యాచ్‌లకు ఆడాడు. 61 మ్యాచ్‌లు ఆడి 38.29 సగటుతో 3,982 పరుగులు చేశాడు. 17 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌ల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు చెబుతూ మురళీ విజయ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు.

2002 నుంచి 2018 వరకు సాగిన తన క్రికెట్ ప్రయాణంలో భాగమైన అందరికీ ధన్యావాదాలు తెలిపాడు. ఈ ప్రయాణం గొప్పగా సాగిందని, భారత్‌కు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని అన్నాడు. తనకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ (BCCI), తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA), చెన్నై సూపర్ కింగ్స్, కెమ్‌ప్లాస్ట్ శాన్‌మర్ (Chemplast Sanmar)కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

మీ అందరితో కలిసి ఆడినందుకు గొప్పగా ఉందని, తన కలలు సాకారం చేయడంలో సాయం చేసినందుకు జట్టు సహచరులు, కోచ్‌లు, మెంటార్లు, సపోర్ట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. క్రికెట్‌లో తాను ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు ఫ్యాన్స్ తనకు అండగా నిలిబడి మద్దతు ఇచ్చారని, వారు తనకు ప్రేరణ ఇచ్చారని అన్నాడు. తన కెరీర్‌లో తనకు అండగా నిలబడి ప్రేమ, మద్దతు అందించిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు చివరిగా ధన్యావాదాలు చెప్పాలనుకుంటున్నట్టు పేర్కొన్నాడు. వారు తనకు వెన్నెముకలా నిలిచారని, వారి ప్రేమ, మద్దతు లేకుండా తాను ఏమీ సాధించలేకపోయి ఉండేవాడినని అన్నాడు.

అమితంగా ఇష్టపడే క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడానికి సంతోషిస్తున్నానని, క్రికెట్ ప్రపంచంలో కొత్త అవకాశాలను అన్వేషిస్తానని మురళీ విజయ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, క్రికెట్ ఎక్కడ జరిగినా పాల్గొంటూనే ఉంటానని పేర్కొన్నాడు. విభిన్న వాతావరణంలో క్రికెటర్‌గా తన ప్రయాణంలో ఇదే తన తదుపరి దశ అని విశ్వసిస్తున్నట్టు మురళీ విజయ్ చెప్పుకొచ్చాడు. జీవితంలో ఈ కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.

Updated Date - 2023-01-30T19:03:12+05:30 IST