IND vs WI సిరీస్‌తో కామెంటేటర్‌గా మారనున్న టీమిండియా సీనియర్ ఆటగాడు

ABN , First Publish Date - 2023-07-11T13:15:28+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు అదే రంగంలో కామెంటేటర్లుగా రాణిస్తున్నారు. వీడ్కోలు ప్రకటించకపోయినప్పటికీ అంతర్జాతీయ జట్టులో స్థానం లేని వారు సైతం పలువురు కామెంటేటర్లుగా వ్యవహరించడం చూస్తున్నాం. టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఈ కోవలోకే వస్తాడు.

IND vs WI సిరీస్‌తో కామెంటేటర్‌గా మారనున్న టీమిండియా సీనియర్ ఆటగాడు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు అదే రంగంలో కామెంటేటర్లుగా రాణిస్తున్నారు. వీడ్కోలు ప్రకటించకపోయినప్పటికీ అంతర్జాతీయ జట్టులో స్థానం లేని వారు సైతం పలువురు కామెంటేటర్లుగా వ్యవహరించడం చూస్తున్నాం. టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఈ కోవలోకే వస్తాడు. తాజాగా ఇదే బాటలో మరో భారత ఆటగాడు కూడా నిలవనున్నాడు. ప్రస్తుతం జాతీయ జట్టులో లేని టీమిండియా సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ (Ishant Sharma) కామేంటేటర్‌గా మారనున్నాడు. అది కూడా బుధవారం నుంచి ప్రారంభంకానున్న భారత్ vs వెస్టిండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్‌తోనే (West Indies vs India 1st Test) కావడం గమనార్హం. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమాతో (Jio Cinema) ఇషాంత్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని జియో సినిమా సైతం అధికారికంగా ప్రకటించింది. గతంలో వెస్టిండీస్‌పై ఓ టెస్టు మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ తీసిన 10 వికెట్ల హాల్‌కు సంబంధించిన వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి మరి జియో సినిమా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇషాంత్ శర్మ హిందీలో కామెంట్రీ చేయనున్నాడు. కాగా బుధవారం నుంచి ప్రారంభం కాబోయే భారత్, వెస్టిండీస్‌ మ్యాచ్‌లు జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.


19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ.. చాలా కాలంపాటు భారత జట్టులో (Team india) కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 311 వికెట్లు, వన్డేల్లో 115 వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. అయితే 34 ఏళ్ల ఈ సీనియర్ పేస్ బౌలర్‌ కొంత కాలంగా రాణించలేకపోతున్నాడు. దీనికి తోడు యువ ఆటగాళ్లు కూడా జట్టులోకి దూసుకురావడంతో టీమిండియాలో ఇషాంత్ శర్మ చోటు కోల్పోయాడు. ఈ క్రమంలోనే తాజాగా కామెంటేటర్‌గా నూతన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు.

Updated Date - 2023-07-11T13:22:20+05:30 IST