CM KCR Order: ప్రొఫెసర్ హరగోపాల్‌పై కేసు ఎత్తివేయండి... కేసీఆర్ ఆదేశం
ABN , First Publish Date - 2023-06-17T11:57:10+05:30 IST
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై కేసు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హరగోపాల్ సహా ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. హర గోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తి వేయాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తం 152 మందిలో కేవలం ముగ్గురు మీద మాత్రమే కేసు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మిగితా వారికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
హైదరాబాద్: పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై (Professor Haragopal) కేసు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశించారు. హరగోపాల్ సహా ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌ను (Telangana DGP Anjanikumar) ముఖ్యమంత్రి ఆదేశించారు. హరగోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తి వేయాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తం 152 మందిలో కేవలం ముగ్గురి మీద మాత్రమే కేసు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మిగితా వారికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్నారు. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా పోలీసులు ఈ కేసును బయటపెట్టారు. చంద్రమౌళిని రెండు నెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు.. బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తెలియజేశారు. మొత్తం అన్ని కేసుల వివరాలూ అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో బయటపడింది. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్ (జస్టిస్ సురేశ్ ఎఫ్ఐఆర్ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ తదితరుల పేర్లున్నాయి.
అప్పట్లో భగ్గుమన్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు
అయితే హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అవడం పట్ల ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. హరగోపాల్ సహా ఇతరులపై వెంటనే కేసును ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. హరగోపాల్‌పై కేసు నమోదు అవడాన్ని దాదాపు పది వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అభ్యుదయ భావాలతో, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తున్న హరగోపాల్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసును బనాయించడం అప్రజాస్వామికమని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వెంటనే హరగోపాల్‌పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డీజీపీకి ఆదేశించారు.