Revanth Reddy: జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటది
ABN , First Publish Date - 2023-06-15T13:15:37+05:30 IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జోగు రామన్న చెల్లని రూపాయని కేసీఆర్ నిర్ణయించారని.. అందుకే జోగు రామన్నకి మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. ఆదిలాబాద్‌కు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నను (BRS MLA Joguramanna) జోకుడు రామన్న అంటే బాగుంటదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జోగు రామన్న చెల్లని రూపాయని కేసీఆర్ నిర్ణయించారని.. అందుకే జోగు రామన్నకి మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. ఆదిలాబాద్‌కు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నా అక్కడి ప్రజలకు ఇల్లు రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అధికారంలోకి రాగానే కర్ణాటకలో హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణలో కూడా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామన్నారు. తమ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టాలని చూస్తున్నారని.. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మరన్నారు. ‘‘ఆదిలాబాద్‌లో 8 అసెంబ్లీ స్థానాలు మీరు గెలిపించండి.. రాష్ట్రంలో 80 అసెంబ్లీ స్థానాలు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియమ్మకు జన్మదిన కానుక ఇద్దాం’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
షాద్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి షాద్‌నగర్ ప్రజలు రెండుసార్లు మోసపోయారన్నారు. కర్ణాటకలో బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని.. నిత్యం ప్రజల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.