RevanthReddy: అనుముల రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీ...
ABN , First Publish Date - 2023-12-04T11:26:29+05:30 IST
ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్. ఈ అంశాలే ఆయన్ని పురాతన జాతీయ పార్టీకి రాష్ట్ర బాధ్యతలు చేపట్టేలా చేసింది. అదీ అనధి కాలంలోనే. ఇప్పుడు ఏకంగా సీఎం రేసులోకి రావడంతో తెలంగాణ ప్రజల చూపంతా ఆ నేతపైనే ఉంది. ఇప్పటికే మీకర్థం అయి ఉంటుంది. ఆయనెవరో కాదు.. అనుముల రేవంత్ రెడ్డి.
ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్. ఈ అంశాలే ఆయన్ని పురాతన జాతీయ పార్టీకి రాష్ట్ర బాధ్యతలు చేపట్టేలా చేసింది. అదీ అనధి కాలంలోనే. ఇప్పుడు ఏకంగా సీఎం రేసులోకి రావడంతో తెలంగాణ ప్రజల చూపంతా ఆ నేతపైనే ఉంది. ఇప్పటికే మీకర్థం అయి ఉంటుంది. ఆయనెవరో కాదు.. అనుముల రేవంత్ రెడ్డి. పెయింటర్ నుంచి యువ నాయకుడిగా ఎదిగి.. సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టి తన రాజకీయ ప్రయాణానికి సుస్థిర బాటలు వేసుకున్న రేవంత్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం..
వ్యక్తిగత విషయాలు..
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన సతీమణి గీత. తండ్రి అనుముల నర్సింహారెడ్డి, తల్లి అనుముల రామచంద్రమ్మ. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్యాడ్యుయేషన్ పట్టా పొందారు. రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు.
మొదట జడ్పీటీసీ ఇండిపెండెంట్ గా గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్(బీఆర్ఎస్), బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుంచి 2007లో జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ గెలుపు పార్టీలన్ని ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేలా చేశాయి. అక్కడే ఆయన నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. తరువాత ఎమ్మెల్సీగా గెలివడంతో అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావాలని ఆహ్వానించినా.. దివంగత సీఎం ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు.
రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ...
తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు రావులపల్లి గుర్నాథ్ రెడ్డి పై విజయం సాధించారు. ఆ విజయం ఆయన చరిష్మాను మరింతగా పెంచింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి బరిలో దిగిన ఆయన ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవారు. రేవంత్ 2014 – 2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. 2017 అక్టోబర్‌లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. 3 ఏళ్ల అనధికాలంలోనే ఎవ్వరికి దక్కని హోదాతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించింది.
2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 మే లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా(టీపీసీసీ) జూన్ 26, 2021లో కాంగ్రెస్ పార్టీ నియమించింది. రేవంత్ రెడ్డి 2021 జులై 7న అప్పటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పటి నుంచి కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. చివరికి డిసెంబర్ 3, 2023న తన లక్ష్యాన్ని చేరుకున్నారు. కేసీఆర్‌ని ఓడించి ముఖ్యమంత్రిగా ప్రమాణ బాధ్యతలు చేపట్టేస్థాయికి ఎదిగారు. ఉనికే ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయనే కీలక పాత్ర పోషించారడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓటుకు నోటు కేసు..
శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు లంచం ఇవ్వజూపిన కేసులో మే 31 2015న, రేవంత్ రెడ్డిపై స్టింగ్ ఆపరేషన్ చేసి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది.
అవినీతి నిరోధక చట్టం, సెక్షన్లు 120-B (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు – ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 34 కింద రేవంత్‌తో పాటు మరో ఇద్దరు - బిషప్ సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలను అరెస్ట్ చేసింది. వీరిని చర్లపల్లి సెంట్రల్ జైలుకి తరలించింది. జూన్ 30న వీరికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2015 జులై 1న రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. ఈ కేసు తాలూకు చేదు అనుభవాలు ఇప్పటికీ రేవంత్ ని వెంటాడుతున్నాయి.