Share News

Land : ఖాళీగా ఉందా.. అమ్మెయ్‌!

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:24 PM

మండలంలోని జగనన్న లేఔట్‌లలో మిగిలిపోయిన ఇంటి పట్టాల విక్రయాలు జోరుందుకున్నాయి. ఇంటి పట్టా ఉన్నా? లేకున్నా ఖాళీ స్థలం కనబడితే..చాలు అక్కడ వైసీపీ నేతలు ప్రత్యక్షమవుతున్నారు. ప్లాటు రేటు బట్టి ధర నిర్ణయించి అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. కొన్ని పట్టాలకు గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిపోయిన తహసీల్దార్ల వద్దకు వెళ్లి సంతకాలు చేయించుకుని ఆక్రమించు కుంటున్నారు. రాత్రికి రాత్రే పునాదులు వేసేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ...

Land : ఖాళీగా ఉందా.. అమ్మెయ్‌!
Illegally laid foundations in Bukkarayasamudra Jagananna layout

పట్టా రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు విక్రయం

ఆక్రమించుకోవడానికి రాత్రికి రాత్రే పునాదుల నిర్మాణం

ఇంటి పట్టాలలో వైసీపీ నాయకుల దందా

బీకేఎస్‌లో పట్టించుకోని రెవెన్యూ అధికారులు

బుక్కరాయసముద్రం, జూలై 26: మండలంలోని జగనన్న లేఔట్‌లలో మిగిలిపోయిన ఇంటి పట్టాల విక్రయాలు జోరుందుకున్నాయి. ఇంటి పట్టా ఉన్నా? లేకున్నా ఖాళీ స్థలం కనబడితే..చాలు అక్కడ వైసీపీ నేతలు ప్రత్యక్షమవుతున్నారు. ప్లాటు రేటు బట్టి ధర నిర్ణయించి అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. కొన్ని పట్టాలకు గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిపోయిన తహసీల్దార్ల వద్దకు వెళ్లి సంతకాలు చేయించుకుని ఆక్రమించు కుంటున్నారు. రాత్రికి రాత్రే పునాదులు వేసేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు. అక్రమ ప్లాట్ల దందాపై స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఇలాంటి ప్లాట్ల విక్రయాలు, అందులో నిర్మాణాలు వెంటనే ఆపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయినా ఇవేవీ అక్రమ దందాను


ఆపలేకపోతున్నాయి. పట్టా లేని స్థలం చూపిస్తే రూ.1.5 లక్ష నుంచి రూ.2లక్షలు వరకు అమాయక ప్రజలతో వసూలు చేస్తున్నారు. అలా కాకుండా గతంలో పని చేసి వెళ్లిపోయిన తహసీల్దార్లుతో సంతకం చేయించి పట్టా తీసుకుని వస్తే మరో రూ.లక్ష అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. బీకేఎస్‌ గ్రామ పంచాయతీ లోనే కాకుండా రేకలకుంట, గోవిందంపల్లి, భద్రంపల్లి, దయ్యాలకుంటపల్లి గ్రామాలలో వేసిన జగనన్న లేఔట్‌లలో కూడా వైసీపీ నేతలు ఇప్పటికి దందాలు సాగిస్తున్నారు. అనంతపురం-నార్పల రహదారి పక్కనే ఉన్న రేకలకుంట లేఔట్‌లో ఒక ఇంటి పట్టా రూ. ఏడు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరుకు ధర పలుకుతోంది. ఇందులో వైసీపీ నేతలు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు.

బీకేఎస్‌ జగనన్న లేఔట్‌లో భారీ అక్రమాలు

వైసీపీ పాలనలో పేద ప్రజలకు ఇచ్చిన ఇంటి పట్టాల విషయంలో భారీగా అక్రమాలు జరిగాయి. వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ఇంటి పట్టాలు ఇప్పించుకుని దోచుకుతిన్నారు. బినామీ పేర్లతో పదుల సంఖ్యలో తీసుకుని విక్రయాలు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో బుక్కరాయసముద్రంలోని జగనన్న కాలనీలో ఎనిమిది లేఔట్‌లు వేశారు. రైతులకు ఒక్కో ఎకరానికి రూ.20 లక్షలకు పైగా ప్రభుత్వ ధర చెల్లించి, 55 ఎకరాలు సేకరించారు. అందులో మౌలిక సదుపాయల కల్పన కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. అయితే ఇంటి పట్టాలు అర్హులందరికీ కాకుండా కేవలం వైసీపీ నాయకుల అనుచర వర్గానికే ఇప్పించుకున్నారు. ఎనిమిది లేఔట్‌లలో 2300 మందిపైగా నిరుపేదలను అర్హులుగా గుర్తించి, ఇంటి స్థలాలను చూపారు. అయితే ఇందులో కొంత మందిని మళ్లీ అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి తొలగించారు. అలాంటి వారి స్థలాలు పలు లేఔట్‌లలో మిగి పోయాయు. ఇందులో ఎక్కడ ఖాళీ స్థలం ఉందో రెవెన్యూ రికార్డులో చూడటం పట్టా ఇవ్వకుంటే కబ్జా చేస్తున్నారు.

చర్యలు తప్పవు

మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో నవరత్నాల కింద జగనన్న కాలనీల్లో మంజూరు అయిన ప్లాట్లను అక్రమంగా విక్రయిస్తే చర్యలు తప్పవు. ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. అనుమతి లేకుండా, ఇంటి పట్టా లేకుండా ఇంట్లి నిర్మాణం చేపడితే తొలగిస్తాం. ప్రజలు కూడా ప్రభుత్వ ఇంటి స్థలాలను కొనగోలు చేయరాదు.

- హనుమంతునాయక్‌, మండల తహసీల్దార్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 26 , 2024 | 11:24 PM