Share News

Kakkalapally tomato market : మార్కెట్‌లో మాఫియా!

ABN , Publish Date - Aug 20 , 2024 | 12:20 AM

కక్కలపల్లి టమోటా మార్కెట్‌..! రైతులు, వ్యాపారులు, వాహనదారులు, చిరు వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులు, హమాలీలు, కూలీలు.. ఇలా ఎందరికో ఉపాధి కల్పించే చోటు. వచ్చిపోయే వారితో ఏడాదిలో ఆరు నెలలపాటు కళకళలాడుతుంటుంది. అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి సమీపంలో ఉంటున్న ఈ మార్కెట్‌లో పైకి కనిపించే దృశ్యం ఇది. కానీ ఇది మాఫియా గుప్పిట్లో ఉందంటే అతిశయోక్తి కాదు. వేరే రాషా్ట్రల వాహనాలు రావాలంటే కప్పం కట్టాలి. సొంత వాహనాలున్న టమోటా రైతులు రావాలన్నా కప్పం కట్టి తీరాలి. హైవేపై ఓ వాహనంలో ఉండే ముఠా.. రేయింబవళ్లూ రౌడీ మామూళ్ల వసూళ్లను ...

Kakkalapally tomato market : మార్కెట్‌లో మాఫియా!
Buyers and farmers protesting on the national highway

అసోసియేషనల పేరిట రౌడీయిజం

వేరే వాహనం రావాలంటే డబ్బు కట్టాల్సిందే

ఒక్కో వాహనదారుడి నుంచి రూ.3 వేలు వసూలు

ఇవ్వకుంటే వాహనాలు, రికార్డులను లాక్కుంటారు

కప్పం కట్టినవారికీ ఆలస్యంగానే అనుమతి

తమ వాహనాలు నిండాకే వాటి లోడింగ్‌

తీవ్రంగా నష్టపోతున్న బయ్యర్లు, రైతులు

కక్కలపల్లి టమోటా మార్కెట్‌ వేరే దేశంలో ఉందా..?

హైవేపై ఆందోళనకు దిగిన బాధితులు

కక్కలపల్లి టమోటా మార్కెట్‌..! రైతులు, వ్యాపారులు, వాహనదారులు, చిరు వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులు, హమాలీలు, కూలీలు.. ఇలా ఎందరికో ఉపాధి కల్పించే చోటు. వచ్చిపోయే వారితో ఏడాదిలో ఆరు నెలలపాటు కళకళలాడుతుంటుంది. అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి సమీపంలో ఉంటున్న ఈ మార్కెట్‌లో పైకి కనిపించే దృశ్యం ఇది. కానీ ఇది మాఫియా గుప్పిట్లో ఉందంటే అతిశయోక్తి కాదు. వేరే రాషా్ట్రల వాహనాలు రావాలంటే కప్పం కట్టాలి. సొంత వాహనాలున్న టమోటా రైతులు రావాలన్నా కప్పం కట్టి తీరాలి. హైవేపై ఓ వాహనంలో ఉండే ముఠా.. రేయింబవళ్లూ రౌడీ మామూళ్ల వసూళ్లను పర్యవేక్షిస్తుంటుంది. అధికార పక్షం, ఇటీవలే అధికారం కోల్పోయిన పక్షం, వామపక్షం.. ఇలా ఏ పక్షమూ బాధితుల పక్షాన నిలబడటం లేదు. జిల్లా కేంద్రంలో ఉండే కలెక్టర్‌, ఎస్పీ, మార్కెటింగ్‌, పంచాయతీ, రెవెన్యూ.. ఇలా ఏ శాఖ అధికారులూ అటువైపు కన్నెత్తి చూడరు. ‘ఇదేమైనా వేరే దేశంలో ఉందా..?’ అని బాధితుల్లో ఒకరు ఆక్రోశం వ్యక్తం చేశారంటే.. దీన్ని అడ్డుకోలేనివారిది అసమర్థతా..? అవినీతా..? అంతిమంగా నష్టపోయేది రైతులే కదా..!


అనంతపురం రూరల్‌, ఆగస్టు 19: కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో అసోసియేషన్ల పేరిట రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. దారికాచి దౌర్జన్యం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని లారీ డ్రైవర్ల నుంచి వాహనాల రికార్డులను లాక్కుంటున్నారు. భయపడి డబ్బులు చెల్లించినా.. వారి వాహనాలను మార్కెట్‌లోకి పంపడం లేదు. అసోసియేషన సభ్యుల వాహనాలు లోడింగ్‌ అయిన తరువాతనే కప్పం కట్టినవారి వాహనాలను అనుమతిస్తున్నారు. హేవీ గూడ్స్‌, లారీ, క్లీనర్స్‌, మండీల పేరిట అసోసియేషనలు ఏర్పాటు చేసుకుని.. ఎవరి స్థాయిలో వారు వసూళ్లకు తెగబడుతున్నారు. వీరి దెబ్బకు వ్యాపారులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ‘ఈ మార్కెట్‌ వద్దు.. ఈ వ్యాపారమూ వద్దు..’ అని కొందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రౌడీ మామూళ్ల పర్వం శ్రుతిమించడంతో కొందరు వాహనదారులు, బయ్యర్లు సోమవారం ఉదయం టమోటా మార్కెట్‌ సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. మార్కెట్‌కు, వాహనాల అసోసియేషన్లకు ఏం సంబంధమని నిలదీశారు. మార్కెట్‌ క్రాస్‌లో హెవీ గూడ్స్‌ అసోసియేషన సభ్యులు దారికాచి దౌర్జాన్యాలకు దిగడం ఏమిటని మండిపడ్డారు. అసోసియేషన వారి ఫర్నిచర్‌ను రోడ్డుపై వేసి నిప్పు పెట్టారు. వారి ఆందోళనతో హైవేపై మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయు.

పంచాయతీని కోర్టుకెక్కించి..

కక్కలపల్లి టమోటా మార్కెట్‌కు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. గతంలో పంచాయతీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించి, సుంకం వసూలు చేసేవారు. కోర్టు ఉత్తర్వుల పేరిట హెవీ గూడ్స్‌ లారీ అసోసియేషనవారు దీన్ని అడ్డుకున్నారు. మండీ అసోసియేషన ఆధ్వర్యంలో వసూళ్లు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతిలో ‘టమోటా మార్కెట్‌లో నయా దందా’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. మండీ అసోసియేషన తరహాలోనే ‘ది అనంతపురం హెవీ గూడ్స్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన’, మరో రెండు మూడు అసోసియేషన్లు దందాలను సాగిస్తున్నాయి. మినీలారీ అసోసియేషన, క్లీనర్స్‌ అసోసియేషన అంటూ మరో రూ.వెయ్యికి పైగా వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

దిక్కున్నచోట చెప్పుకోవాలట..

లారీ ఓనర్స్‌ అసోసియేషన ఏకంగా రౌడీయిజానికి దిగుతోంది. ఇతర ప్రాంతాల వాహనాలను, జిల్లాలో సొంత వాహనాలు ఉన్నవారిని మార్కెట్‌లోకి అడుగు పెట్టనివ్వడం లేదు. కక్కలపల్లి క్రాస్‌లో దారికాచి మరీ వారిని బెదిరిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వందే మార్కెట్‌లోకి వెళ్లడానికి వీళ్లేదని హెచ్చరిస్తున్నారు. కక్కలపల్లి క్రాస్‌లో ఈ అసోసియేషనకు సంబంధించిన ఓ వాహనంలో 24 గంటలూ కాపలాగా ఉంటున్నారు. బయటి వాహనాలు కనిపించగానే విరుచుకుపడుతున్నారు. ఒక్కొక్క వాహనానికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కొందరితో రూ.5 వేలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్లకు ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. కొందరికి రసీదులు ఇచ్చినా.. ఎందుకూ పనికిరావని అంటున్నారు. స్వలాభం కోసం అసోసియేషన ముసుగులో ఈ దందా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే వాహనాలను తమ అసోసియేషన కార్యాలయానికి తీసుకెళుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాహనాల రికార్డులను లాక్కుంటున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు.

దోపిడీకి పరాకాష్ట

కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో దోపిడీ పరాకాష్టకు చేరింది. ఇలాంటి పరిస్థితి ఏ మార్కెట్‌లోనూ లేదని బయ్యర్లు అంటున్నారు. ఎక్కడైనా పది రూపాయలు తక్కువ బాడుగ అంటే.. ఆ వాహనాలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ అసోసియేషనల తీరు భిన్నంగా ఉంది. ఇతర ప్రాంతాల వాహనదారుల నుంచి డబ్బు లు దండుకోవడమే కాకుండా.. తమ సభ్యుల వాహనాలకు భారీగా బాడుగ వసూలు చేస్తున్నారు. తమ వాహనాల లోడింగ్‌ పూర్తి అయ్యాకే కప్పం వసూలు చేసుకుని ఇతరుల వాహనాలను అనుమతిస్తున్నారు. ఆలస్యంగా లోడింగ్‌ చేయడమే కాకుండా.. నిర్ధిష్ట సమయానికి అనలోడ్‌ చేయాలని డ్రైవర్లను హెచ్చరిస్తున్నారు. దీంతో సమయానికి గమ్యస్థానం చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లను వాడుకుంటున్నారు.

గుర్రం గుడ్డిదైనా..

కక్కలపల్లి మార్కెట్‌ నుంచి ఉత్తరప్రదేశకు ఎక్కువగా టమోటా వెళుతుంది. ఆ ప్రాంత వాహనదారులు ఇక్కడి నుంచి 32 గంటల వ్యవధిలో సరుకును తమ మార్కెట్‌కు చేరుస్తారు. కానీ ఘనత వహించిన ఇక్కడి అసోసియేషన వాహనదారులు కనీసం 10 గంటలు ఆలస్యంగా వెళతారు. అంటే.. ముందే బయలుదేరి ఆలస్యంగా వెళతారన్నమాట. ఆలస్యంగా వెళ్లిన యూపీ డ్రైవర్లు మాత్రం ముందే వారి మార్కెట్‌కు చేరుతున్నారు. యూపీ వాహనదారులు రూ.1.20 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య బాడుగ తీసుకుంటే.. అసోసియేషన వాహనదారులు అంతకంటే రూ.20 వేలు అధికంగా తీసుకుంటున్నారు. కర్ణాటకలోని చింతామణి మార్కెట్‌ నుంచి యూపీకి చెల్లించే బాడుగ కంటే.. సుమారు 400 కి.మీ. దూరం తక్కువగా ఉండే కక్కలపల్లి మార్కెట్‌ నుంచి చెల్లించే బాడుగలే ఎక్కువ అంటే.. అసోసియేషనల దందా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత చెల్లిస్తున్నా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని బయ్యర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారిని రానివ్వొద్దు..

రౌడీ మామూళ్లపై గళం విప్పినవారిపై ఓ అసోసియేషన నిషేధం విధించింది. అన్యాయం అని గళం విప్పినవారిని మార్కెట్‌లోకి అడుగు పెట్టనివ్వొద్దని హుకుం జారీ చేసింది. ‘మాకే వ్యతిరేకంగా రోడ్డు ఎక్కుతారా..? మార్కెట్‌లోకి ఎలా వస్తారో చూస్తాం..’ అని తమకు ఫోన చేసి బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ మార్కెట్‌లోనూ లేదని అన్నారు.

అనంతపురం వేరే దేశంలో ఉందా..?

మార్కెట్‌లో మేము సరుకు కొనుగోలు చేసి.. బండ్ల కోసం అసోసియేషన వారిని అడుక్కోవాల్సి వస్తోంది. వారి బండ్లలోనే లోడ్‌ చేయాలట. వేరే బండ్లలో లోడ్‌ చేయకూడదని అంటున్నారు. అనంతపురం ఏమైనా వేరే దేశంలో ఉందా..? మార్కెట్‌తో అసోసియేషనకు ఏం సంబంధం? వారి దందా గురించి ప్రశ్నిస్తే లారీలు తీసుకెళ్లిపోతున్నారు. వాహనాల పత్రాలను లాగేసుకుంటున్నారు. మేము చాలా మార్కెట్‌లలో వ్యాపారం చేస్తున్నాం. అక్కడికి వెళ్లిపోతాం. మేం రాకపోతే నష్టపోయేదీ ఇక్కడి రైతులే. ఈ రోజు నా బండి నిలబడిపోయింది. నాకు నష్టం వచ్చింది. నష్టపోయిన డబ్బును అసోసియేషన ఇస్తుందా? వారికి డబ్బులు కడుతున్నాం కదా..? అయినా మా లారీలను ఎందుకు ఆపుతున్నారు..?

- సర్దార్‌, వ్యాపారి

రికార్డులను లాక్కోవడం ఏమిటి..?

లారీ అసోసియేషన వారు వాహనాల పేపర్లు లాక్కోవడం ఏమిటి..? దౌర్జన్యం కాకపోతే..! మార్కెట్‌లోకి వాహనాలను రానివ్వకపోతే సరుకు ఎలా కొంటారు..? ఎలా తీసుకెళ్తారు..? అసోసియేషన చేష్టలకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. పంట సాగుకోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశా. ఇక్కడ చూస్తే టమోటా బాక్సు రూ.50కి అమ్ముడుపోతోంది. మందులకు ఎలా కట్టాలి..? కూలీలకు డబ్బులెలా చెల్లించాలి.? బండ్ల బాడుగలు ఏలా చెల్లించాలి..? మండీ, లారీ అసోసియేషన వాళ్లేమైనా మా నష్టాన్ని భర్తీ చేస్తారా..? ఎవరి ఇష్టానుసారం వారు వసూలు చేస్తూ పోతే ఎలా..? మార్కెట్‌లో కాయలు అమ్ముడుపోకపోతే మేం ఏం చేయాలి..?

- ఆదిశేషారెడ్డి, రైతు, ఆత్మకూరు

మళ్లీ రోడ్డెక్కుతాం..

అసోసియేషనల వ్యవహారంతో నష్టపోతోంది రైతుల మాత్రమే. బయ్యర్ల వాహనాలను పది గంటలకు మా ర్కెట్‌లోకి పంపితే సరుకు కొనేదెప్పుడు..? వాటిని తరలించేది ఎప్పుడు..? బండ్లను మార్కెట్‌లోకి రాన్వికపోవడంతో బయ్యర్లు టమోటా కొనుగోలు చేయడం లేదు. వారొస్తేనే మాకు మేలు జరుగుతుంది. వారే రాకపోతే అసోషియేషనలు సరుకు కొంటాయా..? డబ్బులిస్తాయా..? వారేమో రూ.కోట్లకు కోట్లు కుప్పేసుకోవాలి.. రైతులేమో నష్టపోవాలా..? రైతుల గురించి ఆలోచించేవాడే లేడు. మార్కెట్‌కు బయ్యర్లు వస్తే మాకు మేలు జరుగుతుంది. ఇది ఈ రోజుతో అయిపోదు. ఇలానే జరిగితే మళ్లీ రోడ్డెక్కుతాం. - మహేంద్ర, రైతు, రాంపురం, కంబదూరు మండలం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 20 , 2024 | 12:20 AM